సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో అధికార వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లోనే ఉండగా, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎన్నికల ముందు మాత్రమే హడావుడి చేసే నాయకులుగా మిగిలారు. ప్రధానంగా గత రెండున్నరేళ్లలో వైఎస్సార్‌సీపీ నేతలు పార్టీ అధిష్టానం నిర్దేశించిన పలు కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి గడపనూ సందర్శించారు.
సంక్షేమ పథకాలు అందాయా? లేదా? అని ఆరా తీశారు. సమస్యలేమైనా ఉంటే తెలుసుకుని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అదే ప్రతిపక్ష టీడీపీలో ఎమ్మెల్యేలు, కొందరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఎన్నికల వేళ కనిపించడం, బీఫాం తీసుకునే వరకు హడావుడి చేయడం, ఫలితాల అనంతరం.. గెలిచినా, ఓడినా పత్తా లేకుండా పోవడంతో ‘పార్ట్ టైం పొలిటీషియన్లు’గా ముద్ర వేసుకున్నారు. మరికొందరైతే సీజన్‌లో వచ్చిపోయే వలస పక్షులేనంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. వీరికి ప్రజా సేవ కన్నా సొంత కార్యకలాపాలే ముఖ్యం. దీంతో టీడీపీ అంటే ‘టెంపరరీ డెలిగేట్స్ ఇన్ పార్టీ’గా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
అస్మిత్‌రెడ్డి కేరాఫ్ హైదరాబాద్
తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ నుంచి జేసీ అస్మిత్‌రెడ్డి 2019లో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఆరు మాసాలకోసారి తాడిపత్రికి వచ్చిపోవడం తప్ప, ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు నియోజకవర్గంలోకి వచ్చి ఊరూరా కలియదిరుగుతున్నారు.
బాలయ్యా.. ఏడాదికోసారైనా రావయ్యా
హిందూపురం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ ఏడాదికోసారి వస్తే చాలా గొప్ప అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఎన్టీయార్ మీద ప్రేమతో బాలయ్యను గెలిపిస్తే ఆయన ఇక్కడకు ఎప్పుడూ రావడం లేదు. ఇక్కడ ఆయన పీఏలదే పెత్తనమని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఎప్పుడైనా వస్తే.. రెండ్రోజులు హడావుడి చేయడం, ఎన్నికల సమయంలో భార్యతో ప్రచారం చేయించడం, ఆ తర్వాత షూటింగులతో బిజీ అవడం పరిపాటిగా మారిందని విమర్శిస్తున్నారు.
ప్రజలకు దూరంగా పయ్యావుల
ఉరవకొండ నుంచి గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో చాలా అరుదుగా కనిపిస్తారని ప్రజల మాట. ఆయన ఎన్నికల ముందే వస్తారని, ఎక్కువగా హైదరాబాద్‌లో ఉంటారని స్థానికులు చెప్తున్నారు. ఆయన సోదరుడు శీనయ్య ఇక్కడ పెత్తనం చేస్తారని, కేశవ్ అంతగా రారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. పీఏసీ చైర్మన్‌గా ఉన్నప్పటికీ ఈయన్ని నియోజకవర్గంలో ‘పార్ట్ టైమ్ పొలిటీషియన్’గానే జనాలు పరిగణిస్తున్నారు.
హమ్మయ్య.. సూరికి ధర్మవరం గుర్తుకొచ్చింది
ఎప్పుడు కనిపించినా మందీ మార్బలంతో హడావుడి చేసే వరదాపురం సూరి ఈసారీ అదే చేస్తున్నారు. 2019లో ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి.. ఓడిపోయాక బీజేపీలో చేరిన ఈయన పత్తా లేకుండా పోయారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ఫ్లెక్సీలతో మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం సూరి.. ధర్మవరంలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అసలు ఈయన బీజేపీలో ఉన్నారా? టీడీపీలో ఉన్నారా? అన్న ధర్మసందేహంలో ధర్మవరం నియోజకవర్గ ప్రజలు సతమతమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment