104కు మరింత ప్రాచుర్యం: సీఎం వైఎస్‌ జగన్‌ | 104 Call Centre More Popular Orders CM YS JaganMohanReddy | Sakshi
Sakshi News home page

104కు మరింత ప్రాచుర్యం: సీఎం వైఎస్‌ జగన్‌

Published Fri, Apr 16 2021 4:08 AM | Last Updated on Fri, Apr 16 2021 12:07 PM

108 Call Centre More Popular Orders CM YS JaganMohanReddy - Sakshi

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స ఫీజులు, చార్జీలకు సంబంధించిన వివరాలను రోగులకు అర్థమయ్యేలా ప్రదర్శించాలి. బోర్డులపై ప్రదర్శించిన దాని కంటే ఎక్కువ వసూలు చేస్తే, ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా ప్రజలకు తెలిసేలా అన్ని వివరాలు ఉండాలి. ఔషధాలు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ల రేట్లు కూడా స్పష్టంగా తెలియజేయాలి. ఎక్కడైనా అధిక ఫీజులు, చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. - సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 104 కాల్‌ సెంటర్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని, ఎవరికైనా ఉచితంగా కోవిడ్‌ చికిత్స, బెడ్‌ కావాలంటే ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా సేవలందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 104 కాల్‌ సెంటర్‌కు రోగి ఫోన్‌ చేసిన 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్‌ సమకూర్చాల్సిందేనని స్పష్టం చేశారు. కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హోం ఐసొలేషన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా ఆస్పత్రిలో చేర్చడానికి వైద్యుల సూచనల మేరకు సేవలందించాలని చెప్పారు. అవసరమైతే అంబులెన్స్‌ సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహాయంతో రోగికి వేగంగా వైద్య సేవలందించాలన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారిని కూడా ఫాలో అప్‌ చేయాలని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కువ చార్జీలు వసూలు చేయకుండా దృష్టి సారించడంతోపాటు, కోవిడ్‌ చికిత్స ఫీజులను రోగులకు అర్థమయ్యేలా  ప్రదర్శించాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ప్రతి ఒక్కరికీ అభినందనలు..

  • నిన్న (బుధవారం) అత్యధికంగా 6.28 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చాం. ఇది ఒక రికార్డు. ఇందుకు ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను. మీరంతా ఎంతో చొరవ చూపి పని చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, పీహెచ్‌సీల సిబ్బంది అందరూ సమష్టిగా పని చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. 
  • రోజుకు 6 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది మన లక్ష్యం. దాన్ని సాధించాము. ఇక ముందు కూడా అలాగే చేయాలి. ప్రస్తుతం వ్యాక్సిన్లు లేవు. కాబట్టి వాటి కోసం కేంద్రానికి లేఖ రాయండి. అవసరం అనుకుంటే నేను కూడా లేఖ రాస్తాను. 

గ్రీవెన్సుల కోసం 1902 నంబర్‌

  • గ్రీవెన్సుల కోసం 1902 నంబరు కేటాయించండి. ఇక 104 నంబరు కోవిడ్‌ సేవల కోసం పని చేస్తుంది. ఈ రెండింటినీ విస్తృతంగా ప్రచారం చేయండి.
  • కోవిడ్‌కు సంబంధించిన ఏ సందేహం ఉన్నా 104కు ఫోన్‌ చేయాలని బాగా ప్రచారం చేయండి. దీన్ని కూడా ఇవాళ్టి నుంచి ప్రచారంలో చేర్చండి. అందుకు అవసరమైన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను బస్టాండ్‌ వంటి పబ్లిక్‌ ప్లేసెస్‌లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయండి.
  • కోవిడ్‌ పరీక్ష మొదలు.. వైద్యం, ఆస్పత్రులలో మెడిసిన్, శానిటేషన్, క్వాలిటీ ఆఫ్‌ ఫుడ్‌ వరకు.. ఏ మాత్రం రాజీ పడొద్దు. ఎక్కడా కూడా రోగులు ఇబ్బంది పడకుండా చూడాలి.

ఆ మూడింటిపై ప్రత్యేక శ్రద్ధ 

  • ఆస్పత్రిలో సేవలు, శానిటేషన్, నాణ్యమైన ఆహారం.. ఈ మూడు ప్రమాణాలు కోవిడ్‌ ఆస్పత్రులతో సహా, అన్ని ఆస్పత్రులలో ఉండేలా చూడాలి. క్వాలిటీ ఆఫ్‌ మెడికేషన్‌తో పాటు, సమయానికి మందులు అందించడం అన్నది చాలా ముఖ్యం.
  • అన్ని ఆస్పత్రులలో ఇవన్నీ పర్‌ఫెక్ట్‌గా జరగాలి. అందుకోసం వాటిని పరిశీలించడానికి గతంలో మాదిరిగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. జిల్లాలలో కూడా ఆ ఏర్పాటు జరగాలి.

టెస్టింగ్‌ ముఖ్యం

  • టెస్టింగ్‌ చాలా ముఖ్యం. కోవిడ్‌ పేషెంట్‌ ప్రైమరీ కాంటాక్టులందరికీ పరీక్షలు చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో కూడా పరీక్షలు చేయాలి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.
  • 104కు ఎవరైనా ఫోన్‌ చేసి, తాము పరీక్ష చేయించుకోవాలని అనుకుంటున్నామని చెబితే, వారు ఎక్కడికి పోవాలన్నది గైడ్‌ చేయాలి. అందువల్ల పీహెచ్‌సీ, సబ్‌ సెంటర్‌ లేదా విలేజ్‌ క్లినిక్‌.. ఎక్కడైనా సరే పరీక్ష  చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి.

వ్యాక్సినేషన్‌పై ఫోకస్‌

  • వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టి సారించాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలి. ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికా బద్దంగా చేయాలి. రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ వేయాలి. 
  • హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లందరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయాలి. ఒక్కరు కూడా మిగలకూడదు. మనం పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా, కచ్చితంగా ఇంకా కొన్ని రోజులు రోజుకు 6 లక్షల వాక్సిన్లు వేయాలి.

హోం క్వారంటైన్‌

  • హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు కచ్చితంగా ఇళ్లలోనే ఉండేలా, రెగ్యులర్‌గా మానిటర్‌ చేయాలి. అందుకు తగిన ప్రొటోకాల్‌ రూపొందించుకోండి. తరుచూ సందర్శించడం వంటివి చేయాలి. అదే విధంగా వారికి ఏడు రకాల ట్యాబ్లెట్లు, క్యాప్సల్స్‌తో కూడిన కోవిడ్‌ కిట్‌ తప్పనిసరిగా అందించాలి.

ఆక్సిజన్‌ సరఫరా

  • ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరా పూర్తి స్థాయిలో ఉండాలి. విశాఖలో ప్రొడక్షన్‌ సెంటర్‌ నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చూడాలి. కోవిడ్‌ చికిత్స అందిస్తున్న 108 ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా చూడండి.
  • రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అవసరమైన మేరకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్క రోగి కూడా ఇబ్బంది పడకుండా చూడాలి.
  • ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

108 ఆస్పత్రుల్లో 15,669 బెడ్లు

  • రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.03 శాతం ఉందని సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. కోవిడ్‌ చికిత్స కోసం రాష్ట్రంలో 108 ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉండగా వాటిలో 15,669 బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
  • ఇందులో ఇప్పుడు 4,889 బెడ్లను పేషంట్లకు కేటాయించామన్నారు.1,987 వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. బుధవారం నాటికి 22,637 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని  వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement