జాగ్రత్తలతోనే మనుగడ: సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ | CM Jagan Review On 3 Rd Phase Vaccination | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలతోనే మనుగడ: సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ

Published Fri, Apr 30 2021 3:13 AM | Last Updated on Fri, Apr 30 2021 1:30 PM

CM Jagan Review On 3 Rd Phase Vaccination - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం కోవిడ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం, జనాభా సంఖ్య, వ్యాక్సినేషన్‌ తీరుపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 45 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు వేసే ప్రక్రియ సగంలో ఉందని, పూర్తి చేసేందుకు కనీసం నాలుగు నెలలు సమయం పడుతుందని ఈ సందర్భంగా చెప్పారు. తదనంతరం 18 – 45 మధ్య వయసు వారికి సెప్టెంబర్‌ నుంచి వ్యాక్సిన్‌ ఇచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్‌కు ఇప్పుడు వ్యాక్సినేషన్‌ మాత్రమే ఒక పరిష్కారంగా ఉందని, అయితే ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారాయన. సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 
 
వారికి 37 కోట్ల డోస్‌లు కావాలి... 
కోవిడ్‌తో కలసి జీవించాలన్న వాస్తవంలోకి అందరూ రావాలి. కళ్లెదుటే కనిపిస్తున్న కఠోర సత్యాలు మనకు అదే చెబుతున్నాయి.  దేశంలో ప్రస్తుతం కోవిడ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు కాగా అందులో కోటి వ్యాక్సిన్లు కోవాక్సిన్‌. మిగిలినవి కోవిషీల్డ్‌ ఉన్నాయి. దేశంలో 45 ఏళ్లకు పైబడినవారు దాదాపు 26 కోట్ల మంది ఉన్నారు. వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండో రెండో డోస్‌ ఇవ్వాలి. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వ్యాక్సిన్లు కావాలి. తొలి డోస్‌ ఇప్పటివరకు కేవలం 12 కోట్ల మందికి మాత్రమే ఇచ్చారు. 2.60 కోట్ల మందికి రెండో డోస్‌ వేశారు. మొత్తం కలిపి చూసినా ఇప్పటివరకు వేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు దాదాపు 15 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 37.40 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు కావాలి. 
 
అన్నీ కలిపితే.. 
భారత్‌ బయోటెక్‌ ప్రస్తుతం నెలకు కోటి వ్యాక్సిన్లు తయారు చేస్తుండగా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 6 కోట్ల వ్యాక్సిన్లను తయారు చేస్తోంది. వీటితోపాటు రెడ్డీ ల్యాబ్స్‌ మే నెలలో 3 కోట్ల స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. దాన్ని స్థానికంగా తయారు చేయటానికి ఇతర కంపెనీలతో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కొలిక్కి వచ్చి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కావాలంటే కనీసం 3 నెలలైనా పడుతుంది. ఇతర సంస్థల ఉత్పత్తులు రావడానికి మరిన్ని నెలల సమయం పడుతుంది. ఇక కోవిషీల్డ్, కోవాక్సిన్‌ ఉత్పత్తి పెరిగితే... అన్నీ కలిపి ఆగస్టు నాటికి దేశంలో నెలకు 20 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి రావచ్చు. ఈ లెక్కన 37.40 కోట్ల వ్యాక్సిన్‌ డిమాండ్‌ ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి కానీ పూర్తి కాదు. 

ఇదీ పరిస్థితి... 
18 – 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దేశంలో 60 కోట్ల మంది ఉన్నారు. ఆ మేరకు వారికి 120 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోస్‌లు కావాలి. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక 18 – 45 వయసు వారికి సెప్టెంబరు నుంచి టీకాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు వారికి వ్యాక్సినేషన్‌ పూర్తి కావడానికి మరో ఆరు నెలలు పడుతుంది. అంటే వచ్చే ఏడాది జనవరి– ఫిబ్రవరి నాటికి అందరికీ వ్యాక్సినేషన్‌ చేయగలుగుతాం. కాబట్టి దాదాపు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలోను చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు, భౌతికదూరం వంటివి తప్పనిసరి. 

 
‘‘దేశంలో 45 ఏళ్లు దాటిన వారికే ఇంకా వ్యాక్సినేషన్‌ పూర్తికాలేదు. ఇపుడు ఉత్పత్తవుతున్న టీకాల సంఖ్యను బట్టి చూస్తే మరో నాలుగు నెలలు పట్టొచ్చు. సెప్టెంబర్‌ నాటికి వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగి నెలకు 20 కోట్లకు చేరుకుంటుందని అనుకున్నా... 18 – 45 ఏళ్ల వయసున్న 60 కోట్ల మందికి 120 కోట్ల డోసులు వేయాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది. ఈ లెక్కన ఫిబ్రవరి వరకు టీకాల కార్యక్రమం కొనసాగే అవకాశముంది. వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు కోవిడ్‌ కేసులు కూడా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఫిబ్రవరి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందనే విషయాన్ని గుర్తించి మనం వాస్తవంలోకి రావాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా నుంచి కాపాడుకుంటూ ముందుకెళ్లాలి. వైరస్‌ నుంచి రక్షించుకుంటూ మనుగడ సాగించాలి. మాస్కులు ధరించడం, శానిటైజేషన్, భౌతిక దూరాన్ని పాటించటం తప్పనిసరి. వ్యాక్సినేషన్‌ వేగం పెరిగే కొద్దీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. టీకాల ప్రక్రియ పూర్తయితేనే ఈ ముప్పు నుంచి పూర్తిగా బయటపడతాం’’ 
– సీఎం వైఎస్‌ జగన్‌ 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement