సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు 108 అంబులెన్సుల ట్రాకింగ్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెస్తోంది. ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో 108 అంబులెన్స్‌ను కాలర్ (సాయం కోసం ఫోన్ చేసిన వారు) ట్రాక్ చేసే విధానాన్ని వైద్య శాఖ ప్రవేశపెడుతోంంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ట్రయల్ రన్ కూడా విజయవంతం కావడంతో ట్రాకింగ్‌సదుపాయాన్ని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేనుంది.
ఎస్‌ఎంఎస్ ద్వారా
రోడ్డు ప్రమాదాలు, గుండె, బ్రెయిన్ స్ట్రోక్, శ్వాసకోశ ఇబ్బందులు, గర్భిణులకు పురిటి నొప్పులు రావడం వంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రజలకు వెంటనే 108 అంబులెన్స్ గుర్తొస్తుంది. 108కు ఫోన్ చేస్తే నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి సకాలంలో ఆస్పత్రులకు చేరుస్తుంది. ఆపద సమయంలో ఫోన్ చేసిన వారికి 108 అంబులెన్స్ ఎంత దూరం వచ్చిందో, ఇంకా ఎంత సమయం పడుతుందోనని ఆందోళన ఉంటుంది.
ప్రస్తుత విధానంలో 108 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వారి ఫోన్ నంబర్ లేదా బాధితుల ఫోన్ నంబర్‌కు వారికి కేటాయించిన వాహనం నంబరు, సిబ్బంది ఫోన్ నంబర్ ఎస్‌ఎంఎస్ పంపుతున్నారు. ఈ ఫోన్ నంబర్‌కు కాల్ చేసి బాధితులు/సహాయకులు అంబులెన్స్ ఎంత వరకూ వచ్చిందో తెలుసుకుంటున్నారు. నూతన విధానంలో బాధితులకు పంపే ఎస్‌ఎంఎస్‌లో లింక్‌ను పంపుతారు. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే అంబులెన్స్ ఎక్కడ ఉంది, ఎంత సమయంలో వస్తుందో తెలుసుకోవచ్చు. తద్వారా బాధితులకు అంబులెన్సు వస్తోందన్న భరోసా లభిస్తుంది.
748 అంబులెన్స్‌ల ద్వారా సేవలు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‘108 అంబులెన్స్’లు 748 ఉన్నాయి. ఇవి రోజుకు సగటున 3,096 ఎమర్జెన్సీ కేసులను ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 24 వరకు 7,52,302 ఎమర్జన్సీ కేసుల్లో అంబులెన్స్‌లు సేవలందించాయి.
త్వరలోనే అందుబాటులోకి
కాలర్‌లు అంబులెన్స్ ఎంత దూరం వచ్చిందో ట్రాక్ చేసేలా సాంకేతిక ఏర్పాట్లు చేశాం. ట్రయల్ రన్ విజయవంతం అయింది. త్వరలోనే ట్రాకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం. అంబులెన్స్ ఎంత దూరం వచ్చిందో తెలుసుకోవడంతో బాధితులు, వారి సహాయకులకు భరోసా లభిస్తుంది.
– ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, సీఈవో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
Comments
Please login to add a commentAdd a comment