సాక్షి, అమరావతి: విద్యార్థులకు ’జగనన్న విద్యా కానుక’ ద్వారా పంపిణీ చేసే స్టూడెంట్ కిట్లలో వస్తువుల నాణ్యతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 47.32 లక్షల మందికిపైగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కోసం 2021– 22 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.731.30 కోట్లను వ్యయం చేస్తోంది. విద్యా కానుక కింద ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగుతోపాటు ఈసారి ఇంగ్లీషు–తెలుగు నిఘంటువులను కిట్ రూపంలో అందించనున్నారు. విద్యా కానుక ద్వారా అందచేసే వస్తువులు 100 శాతం నాణ్యంగా ఉండేలా పరస్పర సహకారంతో పర్యవేక్షించే బాధ్యతను స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎమ్, మండల విద్యాశాఖాధికారి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి అప్పగించారు. ఈ నేపథ్యంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా క్షుణ్ణంగా పరిశీలన జరుగుతోంది.
విద్యాకానుక ద్వారా ఇచ్చే వస్తువులు వంద శాతం నాణ్యత ఉండాల్సిందేనన్న సీఎం జగన్ ఆదేశాలను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు. ఏమాత్రం నాణ్యత లోపించినా వెంటనే వెనక్కి పంపిస్తున్నారు. నోటు పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, జత బూట్లు, రెండు జతల సాక్సులను రాష్ట్రంలోని 4,031 స్కూల్ కాంప్లెక్స్‌లకు, యూనిఫాం క్లాత్‌ను 670 మండల రిసోర్సు కేంద్రాలకు సప్లయర్స్ అందజేస్తున్నారు. కిట్లను ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారులతో పాటు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలని ఉన్నతాధికారులు అదేశాలిచ్చారు.
క్షుణ్నంగా పరిశీలించాలి..
– నోటు పుస్తకాలకు సంబంధించి వైట్ నోట్ బుక్స్, రూల్డ్ నోట్ బుక్స్, బ్రాడ్ రూల్డ్, గ్రాఫ్ పుస్తకాలు ఇలా అన్ని రకాల నోటు పుస్తకాలను పరిశీలించాలి.
– అన్ని రకాల బ్యాగులు, బెల్టులు, బూట్లు, సాక్సులు, యూనిఫాం క్లాత్‌ను పరిశీలించాలి
– ప్రతి మండల రిసోర్సు కేంద్రం/ స్కూల్ కాంప్లెక్సుకు మెటీరియల్ తగినంత అందిందో లేదో సరిచూసుకోవాలి.
– ప్రతి స్కూల్ కాంప్లెక్సుకు అందజేసే మెటిరీయల్‌లో ప్రతి రకానికి సంబంధించి కనీసం ఒక కార్టన్ / సంచి / ప్యాకెట్‌ను పూర్తిగా పరిశీలించాలి.
– యూనిఫాం క్లాత్ మండల రిసోర్సు కేంద్రానికి ప్యాకెట్లతో కూడిన బేల్ రూపంలో చేరుతుంది.
– స్కూల్ కాంప్లెక్స్‌కు అందజేసిన వస్తువుల్లో పాడైనవి, చిరుగులు గుర్తిస్తే మండల విద్యాధికారి దృష్టికి తేవాలి. మండల రిసోర్సు కేంద్రాల్లో వీటిని గుర్తిస్తే జిల్లా విద్యాశాఖాధికారి/ సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌కి సమాచారం అందించాలి.
– వస్తువులన్నీ సెట్లుగా చేసి బ్యాగులో సర్ది కిట్లుగా ఉంచాలి.
– మండల రిసోర్సు కేంద్రం నుంచి కిట్ల రూపంలో పాఠశాలలకు చేర్చాలి .
– ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో విద్యార్థులకు వెంటనే అందించాలి.
– నోటు పుస్తకాలకు సంబంధించి సప్లయిర్స్ నుంచి స్కూల్ కాంప్లెక్సులకు నేరుగా సరుకు అందుతుంది.
– తగినంత సరుకు రాని పక్షంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయాలి.
– వివరాలను జగనన్న విద్యాకానుక ’ యాప్‌లో నమోదు చేయాలి.
– యూనిఫాంకి సంబంధించి మండల రిసోర్సు కేంద్రానికి తగినంత సరుకు వచ్చిందా లేదా సరిచూసుకోవాలి. ఒక్కో ప్యాకెట్లో 3 జతలకు సరిపడే యూనిఫాం క్లాత్ ఉంటుంది.
– ప్రతి తరగతికి క్లాత్ కొలతలు సరిగా సరిపోయాయా లేదా అనేది యూనిఫాం బేల్‌లో ఒక ప్యాకెట్ తీసుకుని చెక్ చేయాలి.
– యూనిఫాం క్లాత్ రంగు ఇచ్చిన నమూనాతో సరిచూసుకోవాలి.
– క్లాత్ నాణ్యత బాగాలేకపోయినా, రంగు మారినా, చిరుగులు ఉన్నా రిజక్ట్ చేసి వెనక్కి పంపవచ్చు. ఈ సమాచారాన్ని సంబంధిత మండల విద్యాశాఖాధికారి / సీఎంవో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌కు సమాచారం ఇవ్వాలి.
– బ్యాగులు రెండు (స్కై బ్లూ , నేవీ బ్లూ ) రంగులలో, 3 సైజుల్లో (స్మాల్, మీడియం, బిగ్ ) మొత్తం 6 రకాలు ఉంటాయి. బాలికలకు స్కై బ్లూ రంగు బ్యాగులు , బాలురకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందజేయాలి.
– బ్యాగు డబుల్ జిప్పులు, షోల్డర్, డబుల్ రివిట్స్, షోల్డర్ స్టాప్ ఫోమ్, హ్యాండిల్, బ్యాగు ఇన్నర్ క్లాత్‌ను నమూనాతో సరిపోల్చి చూడాలి.
– బెల్టులు నాలుగు రకాలుగా అందిస్తారు. నాణ్యత బాగాలేకపోయినా, చిరిగిపోయినా , ద్యామేజ్ కనిపించినా రిజక్ట్ చేసి వెనక్కి పంపవచ్చు.
– అందరు జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment