సభా ఏర్పాట్లపై చర్చిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి చెల్లుబోయిన, ఎమ్మెల్సీ,ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాల ప్రజలను (బీసీలను) సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దుతానంటూ 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన బీసీ గర్జనలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడున్నరేళ్లుగా చిత్తశుద్ధితో అమలుచేసి చూపిస్తున్నారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాలకు అధిక ప్రయోజనం చేకూరుస్తున్నారు.
ఇదే అంశాన్ని వివరించి.. రానున్న రోజుల్లో మరింత ప్రయోజనం కల్పిస్తామని బీసీలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘జయహో బీసీ’ మహాసభను వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తోంది. ఉదయం పదిగంటలకు ప్రారంభమయ్యే ఈ మహాసభలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ పాల్గొని.. గత మూడున్నరేళ్లుగా బీసీలకు చేస్తున్న మేలును, రానున్న రోజుల్లో కలిగించబోయే ప్రయోజనాలను వివరించనున్నారు.
ఈ మహాసభకు 82,432 మంది బీసీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ.. వారికి పేరుపేరునా ఆహ్వానపత్రికలను పంపారు. వెనుకబడిన వర్గాలే వెన్నెముక నినాదంతో నిర్వహిస్తున్న ఈ మహాసభకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతోపాటు విజయవాడ నగరాన్ని వైఎస్సార్‌సీపీ జెండాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
విజయవాడ వారధిపై రెపరెపలాడుతున్న వైఎస్సార్‌సీపీ జెండాలు
బీసీ డిక్లరేషన్‌లో చెప్పినదానికంటే అధికంగా..
బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాల ప్రజలకు మూడున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ అధిక ప్రయోజనం చేకూర్చారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తూ పేదరికం నుంచి గట్టెక్కించడం, అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం, పరిపాలనలో సింహభాగం భాగస్వామ్యం కల్పించడం ద్వారా సమాజానికి వెన్నెముకలా బీసీలను తీర్చిదిద్దుతున్న అంశాన్ని సీఎం వైఎస్ జగన్ వివరించనున్నారు.
రానున్న రోజుల్లోనూ ఇదేరీతిలో ప్రయోజనం చేకూరుస్తామని భరోసా ఇవ్వనున్నారు. స్థానికసంస్థల్లో బీసీలకు 34 శాతం.. ఎస్సీ, ఎస్టీలతో కలిపి 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న తమ ప్రభుత్వం జీవో జారీచేస్తే.. దీనిపై టీడీపీ నేతలను పురిగొల్పి సుప్రీం, హైకోర్టుల్లో కేసులు వేయించి.. రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించేలా చంద్రబాబు కుట్ర చేసిన తీరును వివరించనున్నారు. రిజర్వేషన్లు తగ్గించేలా చేసి బీసీ వర్గాలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచినా.. స్థానికసంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 34 శాతం కంటే అధికంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తీరును గుర్తుచేయనున్నారు.
సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సీఎం వైఎస్ జగన్‌ల కటౌట్లు
సగర్వంగా తలెత్తుకునేలా పరిపాలన
టీడీపీకి బీసీలే వెన్నెముక.. బీసీలు లేనిదే టీడీపీ లేదు.. అంటూ మాయమాటలు చెప్పే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఉదంతాలను సీఎం వైఎస్ జగన్ మరోసారి గుర్తుచేయనున్నారు. తమ హక్కులు పరిరక్షించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానంటూ సచివాలయం సాక్షిగా చంద్రబాబు బెదిరించడాన్ని, ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగిన మత్స్యకారులను తాటతీస్తానంటూ చంద్రబాబు భయపెట్టిన తీరును గుర్తుచేయనున్నారు.
బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ సుప్రీంకోర్టు కొలీజియంకు చంద్రబాబు లేఖ రాయడాన్ని సీఎం వైఎస్ జగన్ ఎత్తిచూపనున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకపోవడాన్ని ఎత్తిచూపుతూ.. ఈ ముడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే.. అందులో నలుగురు బీసీలను తాము రాజ్యసభకు పంపడాన్ని గుర్తుచేయనున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో బీసీల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీస్తే.. తాము అన్నింటా సమున్నత గౌరవం వచ్చి బీసీలు సగర్వంగా తలెత్తుకునేలా పరిపాలిస్తున్న తీరును ముఖ్యమంత్రి వివరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment