సాక్షి, అమరావతి: ఎక్కడైనా రాజధాని ప్రాంతం ప్రజలందరిదీ అవుతుందని, అయితే రాజధాని ప్రాంతంలో ఉండే రైతులు అమరావతి తమది మాత్రమేనంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. రాజధానిలో తాము మాత్రమే ఉండాలని, బయట వ్యక్తులెవరూ రాజధానిలో ఉండకూడదన్నట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఇతరులెవరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదంటూ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారానే వారి వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పారన్నారు. అందరిదీ కానప్పుడు అసలు అది రాజధాని ఎలా అవుతుందన్నారు. రాజధానిలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి సైతం ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా సీఆర్‌డీఏ చట్టానికి సవరణలు చేశామని, దీనికి గవర్నర్ సైతం ఆమోదం తెలిపారన్నారు.
ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం చట్ట సవరణకు సంబంధించి ప్రతిని మెమో రూపంలో తమ ముందుంచాలని అదనపు ఏజీని ఆదేశించింది. మానవ ధర్మాన్ని అనుసరించి తమకు న్యాయం చేయాలని రైతుల తరఫు న్యాయవాదులు కోరగా, న్యాయబద్ధత ఆధారంగానే కోర్టు వ్యవహరిస్తుందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గట్టిగా బదులిచ్చారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ తాము రాజ్యాంగ ధర్మం ప్రకారమే నడుచుకుంటామని పేర్కొంటూ తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాజధాని ప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల కేటాయింపు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2020లో జారీ చేసిన జీవో 107ను సవాలు చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన అప్పటి సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జీవో 107 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాలని ధర్మాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, ఎస్.ప్రణతి, కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ రాజధాని కోసం ఇచ్చిన భూములను ఇతరులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం చట్ట విరుద్ధమన్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులు అమల్లో ఉండగానే ఇళ్ల స్థలాల మంజూరు చేసే దిశగా చట్ట సవరణ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రాజధాని ప్రాంతంలో ఇతరులకు సైతం ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా చట్ట సవరణ చేశామన్నారు. చట్ట సవరణ ప్రతిని కోర్టు ముందుంచేందుకు గడువు కోరగా ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment