‘ఆరోగ్య’ భరోసా | Above 7lakh people are treated free of cost with YSR Aarogyasri | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్య’ భరోసా

Published Mon, Sep 14 2020 3:29 AM | Last Updated on Mon, Sep 14 2020 7:52 AM

Above 7lakh people are treated free of cost with YSR Aarogyasri - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత వైఎస్సార్‌ ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీకి మెరుగులద్దుతూ ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... రాష్ట్రంలో దాదాపు కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. నికరంగా రాష్ట్రంలో దాదాపు 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ప్రయోజనం అందుతోంది. గత సర్కారు హయాంలో ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేయడానికి నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా భారీ బకాయిలు పెట్టేశారు. మరోవంక ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచకుండా... డాక్టర్లను నియమించకుండా... మందులు కొనకుండా వాటినీ దెబ్బతీశారు. మొత్తంగా ప్రజారోగ్యాన్ని దెబ్బతీయటంతో సామాన్యులు సైతం దిక్కులేక ప్రయివేటు ఆసుపత్రుల్ని ఆశ్రయించి ఆర్థికంగా చచ్చిపోయిన పరిస్థితిలో ఇప్పుడు స్పష్టంగా మార్పు కనిపిస్తోంది.  
 
అందరికీ ఆరోగ్య రక్ష... 
– వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వార్షిక ఆదాయం రూ.ఐదు లక్షల లోపు ఉన్న 1.42 కోట్ల మంది ఉచితంగా వైద్య చికిత్స పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. క్యూఆర్‌ కోడ్తో కూడిన వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డులను వీరందరికీ ఇంటివద్దే వలంటీర్ల ద్వారా అందచేసింది. తద్వారా రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకు ఆరోగ్య భరోసా లభించింది.  
 
నవంబర్‌ నుంచి రాష్ట్రమంతా.. 
చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ కేన్సర్‌ తదితర జబ్బులను కలిపి మొత్తం 2,200  వైద్య ప్రొసీజర్స్‌ను పథకంలోకి తెచ్చారు.  పశ్చిమగోదావరి జిల్లాలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఈ ఏడాది జూలై 16వ తేదీ నుంచి విజయనగరం, విశాఖపట్టణం, గుంటూరు, ప్రకాశం, వైఎస్‌ఆర్, కర్నూలు జిల్లాలకు విస్తరించారు.మిగతా ఆరు జిల్లాల్లో నవంబర్‌ నుంచి  
వర్తింప చేయనున్నారు. 
 
7.70 లక్షల మందికి ఉచితంగా చికిత్స 
– వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు అంటే 14 నెలల 13 రోజుల వ్యవధిలో 7,70,529 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్సలు అందించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1864.77 కోట్లు వ్యయం చేసింది. 
– ఆస్పత్రులకు గ్రీన్‌ చానల్‌లో చెల్లింపులు.. 
– గత సర్కారు హయాంలో ఆరోగ్యశ్రీకి బడ్జెట్‌లో కనీసం రూ.500 కోట్లు కూడా కేటాయించని దుస్థితి నెలకొనడంతోపాటు ఎన్నికల ముందు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రూ.680 కోట్ల మేర బకాయిలు పెట్టింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఈ బకాయిలను చెల్లించింది.  
– ఆరోగ్యశ్రీకి జవసత్వాలు కల్పించడంతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని 130 ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం వర్తింపచేస్తోంది. ఈసారి బడ్జెట్లో పథకానికి ఏకంగా రూ.2,100 కోట్లను కేటాయించారు. ఆసుపత్రులకు బిల్లులు చెల్లింపుల్లో జాప్యం జరగకుండా గ్రీన్‌చానల్‌ విధానం కిందకు తెచ్చారు.   
 
20 రోజుల్లోనే కార్డుల మంజూరు 
– వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులను  దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధించి అమలు చేస్తోంది. నిర్దిష్ట కారణం లేకుండా తిరస్కరించినా, గడువులోగా మంజూరు చేయకున్నా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. ఈ విధానం అమలులోకి వచ్చాక 29 వేల మంది దరఖాస్తు చేసుకోగా 22 వేల మందికి కార్డులు మంజూరయ్యాయి.   
– అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో కూడిన హెల్ప్‌ డెస్క్లను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశా>లు జారీ చేసింది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్య సేవల నాణ్యతను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. 
 
అర్హులకు 20 రోజుల్లోనే మంజూరు.. 
“దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోగా అర్హులకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేస్తాం. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తెచ్చాం. వలంటీర్లు కార్డులను లబ్ధిదారుల ఇంటివద్దే అందచేస్తారు’ 
– డాక్టర్‌ఏ.మల్లికార్జున(డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు  సీఈవో )     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement