విజయవాడలో ప్రిలిమినరీ పరీక్ష అభ్యర్థులకు సూచనలిస్తున్న పోలీసు అధికారులు
సాక్షి, అమరావతి: ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 411 ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 నగరాలు, పట్టణాల్లోని 292 కేంద్రాల్లో ప్రిలిమినరీ రాత పరీక్షకు 1,51,243 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించారు.
ప్రిలిమినరీ పరీక్ష ‘ప్రాథమిక కీ’ని సోమవారం ఉదయం 11గంటలకు తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని రాష్ట్ర పోలీసు నియామక మండలి తెలిపింది. అభ్యర్థులు ఆ ప్రాథమిక ‘కీ’ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రాథమిక కీ’పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ ఉదయం 11గంటలలోపు తమకు మెయిల్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది.
వెబ్‌సైట్‌లో పొందుపరిచిన నిర్ణీత ఫార్మాట్‌లోనే అభ్యంతరాలను తమకు మెయిల్ చేయాలని కూడా పేర్కొంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రెండు వారాల్లో వెల్లడిస్తామని, అభ్యర్థుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పోలీసు నియామక మండలి వెల్లడించింది.
► ప్రాథమిక కీ డౌన్‌లోడ్ చేసుకోడానికి వెబ్‌సైట్: slprb.ap.gov.in
► ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాలను నిర్ణీత ఫార్మాట్‌లో పంపాల్సిన మెయిల్ ఐడీ: CTSI& PWT @slprb.appolice.gov.in
Comments
Please login to add a commentAdd a comment