భాషాభివృద్ధికి తెలుగు, సంస్కృత అకాడమీ విశేష కృషి
మార్కెట్‌లోకి 10.37 లక్షల ఇంటర్, 3 లక్షల పోటీ పరీక్షల పుస్తకాలు
రెండేళ్లలో రూ. 21 కోట్ల విలువైన పుస్తకాలను ముద్రించిన అకాడమీ
చంద్రబాబు హయాంలో అకాడమీ విభజనను గాలికి వదిలేశారు
తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక అకాడమీ ప్రచురణలను మార్కెట్‌లోకి తీసుకొచ్చి నట్టు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి, ఉన్నత విద్యకు అవసరమైన విజ్ఞాన సంపదను అందించేందుకు అకాడమీ విశేష కృషి చేస్తోందన్నారు. గురువారం వడ్డేశ్వరంలోని ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి అకాడమీ విభజన పూర్తయిన తర్వాత ఏపీలో సేవలు ప్రారంభించిన రెండేళ్లలో రూ. 21 కోట్ల విలువైన 13.37 లక్షల పుస్తకాలను ముద్రించామన్నారు.
డీఎస్సీ, బీఈడీ, టెట్, ఏపీపీఎస్సీతో పాటు వివిధ రకాల పోటీ పరీక్షల సిలబస్‌తో 67 రకాల పుస్తకాలకు సంబంధించి 3 లక్షల కాపీలను మార్కెట్‌లోకి విడుదల చేశామన్నారు. వీటితో పాటు 10.37 లక్షల ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాలను ముద్రించడం ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ధరకు స్టడీ మెటీరియల్స్ అందించామన్నారు.
ఆంగ్లం, ఇతర భాషల ద్వారా వాడుకలోకి వచ్చి న పదాలకు త్వరలోనే తెలుగు పదజాలాన్ని రూపొందిస్తామన్నారు. తెలుగు–సంస్కృతం–ఆంగ్లం కలగలిపిన త్రిభాషా పదకోశాన్ని (డిక్షనరీ) ముద్రిస్తామన్నారు. డిగ్రీ, పీజీ పాఠ్యప్రణాళికలకు తగ్గట్టుగా పుస్తకాలను ముద్రిస్తామన్నారు. ఇకపై అకాడమీ ప్రతి ముద్రణను తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రవేశపెడుతుందన్నారు.
బాబు స్వార్థానికి అకాడమీ బలి
చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు తెలుగు అకాడమీ తీవ్రంగా నష్టపోయిందని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హయాంలో తెలుగు అకాడమీ విభజనను పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. అనంతరం కోర్టుకు వెళ్లి ఉమ్మడి అకాడమీ విభజన పూర్తి చేసి ఏపీ వాటా కింద రూ. 140 కోట్లు సాధించామన్నారు. కానీ, చంద్రబాబు అకాడమీ ప్రచురణలకు పాతరేసి నారాయణకు పాఠ్యపుస్తకాల ముద్రణను కట్టబెట్టడం ద్వారా భారీ రేట్లకు విక్రయించి రూ. కోట్లు దండుకున్నారని మండిపడ్డారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియా అకాడమీ సేవలపై విషం చిమ్ముతోందన్నారు. తిరుపతి నుంచే తెలుగు, సంస్కృత అకాడమీలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. విజయవాడ కేంద్రంలో ఎక్కువ ముద్రణాలయాలు ఉండటంతో ప్రింటింగ్ ఉద్యోగులు మాత్రమే స్థానిక కార్యాలయంలో సేవలందిస్తున్నారన్నారు. త్వరలోనే తిరుపతిలో ఎస్వీ వర్సిటీ స్థలంలో తెలుగు, సంస్కృత అకాడమీ శాశ్వత భవనం నిర్మాణాన్ని చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment