
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వేసిన పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
ఆ పిటిషన్‌కు విచారణార్హతే లేదు : సీఐడీ పీపీ
చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. ఈ మేర ఆయన దాఖలు చేసిన పిటిషన్‌కు అసలు విచారణార్హతే లేదన్నారు. సీఆర్‌సీపీ సెక్షన్ 437, సెక్షన్ 439 కింద బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని.. అయితే, ఈ సెక్షన్ల కింద మధ్యంతర బెయిల్ ఇవ్వడమన్న ప్రశ్నే తలెత్తదన్నారు. ఈ సెక్షన్లలో ఎక్కడా కూడా మధ్యంతర బెయిల్ ప్రస్తావనేలేదని ఆయన తెలిపారు.
మధ్యంతర బెయిల్ తమ హక్కు అన్నట్లు చంద్రబాబు న్యాయవాదులు వాదిస్తున్నారని.. ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న వ్యక్తి మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఎంతమాత్రం సరికాదన్నారు. తాము ఇప్పటికే పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేశామని, అందులో కౌంటర్లు దాఖలు చేయాలని ఈ కోర్టు ఆదేశించినా చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేయలేదని వివేకానంద కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పైపెచ్చు హైకోర్టును ఆశ్రయించి, ఈ కోర్టు (ఏసీబీ కోర్టు) కౌంటర్ కోసం ఒత్తిడి చేస్తోందన్నట్లు హైకోర్టుకు చెప్పి, పోలీసు కస్టడీ పిటిషన్‌లో ఈ కోర్టు (ఏసీబీ కోర్టు)ను ముందుకెళ్లకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు తెచ్చారని తెలిపారు.
వాస్తవానికి పోలీసు కస్టడీ పిటిషన్‌లో తామే కౌంటర్ కోసం ఒత్తిడి చేశామే తప్ప, ఈ కోర్టు ఎవరినీ ఒత్తిడి చేయలేదన్నారు. హైకోర్టు ఉత్తర్వులతో తమ పోలీసు కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారించలేని పరిస్థితిలో ఉండటంతో, దానిని అడ్డంపెట్టుకుని బెయిల్ కోసం పిటిషన్ వేసి మధ్యంతర బెయిల్ కోరుతున్నారని వివేకానంద తెలిపారు. వాస్తవాలను కోర్టు ముందుంచాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చెబుతున్నామన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని విచారణను వాయిదా వేయాలని వివేకానంద కోరారు.
మధ్యంతర బెయిల్‌పై విచారణ సబబేనా?
అనంతరం.. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ప్రధాన బెయిల్ కౌంటర్ దాఖలు చేసి, వాదనలు విని దాన్నితేల్చేలోపు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ సమయంలో న్యాయస్థానం స్పందిస్తూ.. సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఇదే సమయంలో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ తమ ముందు పెండింగ్‌లో ఉందని, ఈ పరిస్థితుల్లో బెయిల్‌పై విచారణ జరపడంపై స్పష్టత కావాలని తేల్చిచెప్పింది.
పోలీసు కస్టడీ పిటిషన్‌లో ముందుకెళ్లకుండా హైకోర్టు ఉత్తర్వులున్నాయని గుర్తుచేసింది. అందువల్ల ఈ దశలో మధ్యంతర బెయిల్‌పై వాదనలు వినడం సబబా? కాదా? అన్న సందేహం కలుగుతోందని ఏసీబీ తెలిపింది. కానీ, మధ్యంతర బెయిల్‌పై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ఏసీబీ కోర్టుకుందని దమ్మాలపాటి తెలిపారు.
హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాం కాబట్టి, మధ్యంతర బెయిల్‌పై కింది కోర్టు విచారణ జరపకూడదన్న నిషేధం ఏదీలేదన్నారు. న్యాయస్థానం స్పందిస్తూ.. మంగళవారం హైకోర్టులో విచారణ జరుగుతున్నందున, క్వాష్ పిటిషన్‌లో విచారణ తరువాత హైకోర్టులో వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఈ బెయిల్‌పై తదుపరి విచారణ జరుపుతామని స్పష్టంచేస్తూ విచారణను 19కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment