నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్ | Adityanath Das as the new CS | Sakshi
Sakshi News home page

నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్

Published Wed, Dec 23 2020 3:11 AM | Last Updated on Wed, Dec 23 2020 9:49 AM

Adityanath Das as the new CS - Sakshi

ఆదిత్యనాథ్‌ దాస్‌ , నీలం సాహ్ని

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కేడర్‌కు చెందిన 1987 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్‌ నీలం సాహ్ని ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఆదిత్యనాథ్‌ దాస్‌ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.
 
సాగునీటి శాఖలో సుదీర్ఘ అనుభవం.. 
ఆదిత్యనాథ్‌ దాస్‌ సుదీర్ఘకాలం సాగునీటి శాఖ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999 – 2001 వరకు వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. 2006 నుంచి 2007 వరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి డైరెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016 వరకు సాగునీటి శాఖ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్నారు. కేంద్ర సర్వీసులో కూడా ఆయన పలు బాధ్యతలు నిర్వర్తించారు. 

సీఎం ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని 
ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న సీఎస్‌ నీలం సాహ్ని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమితులు కానున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాబినెట్‌ ర్యాంకు హోదాలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాష్ట్ర పునర్విభజన అంశాలు, పరిపాలన సంస్కరణలు, గ్రామ, వార్డు సచివాలయాలు, జిల్లాల పునర్విభజన, ల్యాండ్‌ సర్వే టైట్లింగ్‌ చట్టం, కోవిడ్‌ 19, ఆరోగ్యం తదితర బాధ్యతలను ఆమె నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

జలవనరుల శాఖకు శ్యామలరావు 
మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావు  జలవనరుల శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించే వరకు శ్యామలరావు జలవనరుల శాఖ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ హోదాలో కొనసాగుతారు. పోస్టింగ్‌ కోసం నిరీక్షిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మి మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న కె.సునీత సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న బి.రాజశేఖర్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు. రాష్ట్ర ఎస్సీ సహకార ఆర్థిక కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను కె.సునీతకు అప్పగించారు. ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement