‘తిరుపతి’ పోలింగ్‌కు సర్వం సిద్ధం | All Set To Tirupati LokSabha By Election Polling | Sakshi
Sakshi News home page

‘తిరుపతి’ పోలింగ్‌కు సర్వం సిద్ధం

Published Fri, Apr 16 2021 4:29 AM | Last Updated on Fri, Apr 16 2021 4:34 AM

All Set To Tirupati LokSabha By Election Polling - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నిబంధనలను పటిష్టంగా పాటిస్తూ ఏప్రిల్‌ 17న జరిగే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియడంతో 17న జరిగే పోలింగ్‌ కోసం చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిత్తూరు, నెల్లూరు జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్షించారు. పలు సూచనలు చేశారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని పోలింగ్‌ సమయాన్ని పెంచడంతోపాటు పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నామని చెప్పారు.

సాధారణంగా ప్రతీ 1,500 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేస్తామని, కానీ కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతీ 1,000 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో అదనంగా 477 సహా మొత్తంగా 2,410 పోలింగ్‌బూత్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్‌కు ముందు 48 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయని, పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలవద్ద కోవిడ్‌ వ్యాప్తిని నిరోధించే విధంగా శానిటైజేషన్, మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచడంతోపాటు ఎండ వేడిని తట్టుకునేలా టెంట్లు, మంచినీటి సౌకర్యం వంటి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 80 ఏళ్లు దాటినవారు, అంగవైకల్యమున్న వారిని ఓటు వేయడానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

కేంద్ర బలగాలతో బందోబస్తు..
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చిత్తూరు జిల్లాలోని మూడు, నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, మొత్తం 17,11,195 మంది ఓటర్లు ఉండగా, అందులో 8.38 లక్షలమంది పురుష ఓటర్లు, 8.71 లక్షలమంది మహిళా ఓటర్లు ఉన్నారని విజయానంద్‌ తెలిపారు. 466 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ కేంద్ర బలగాలతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో 10,796 మంది ఎన్నికల సిబ్బంది, 13,827 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. 23 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలతో బందోబస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రం ఎక్కడుందో ఓటరు తెలుసుకునే విధంగా తొలిసారిగా ‘మే నో పోలింగ్‌ స్టేషన్‌’ (mayknowpolling station) పేరిట ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఓటర్‌ ఐడీ కార్డు నంబర్‌ నమోదు చేయడం ద్వారా పోలింగ్‌స్టేషన్‌ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వాహనాల తనిఖీలను కేంద్ర బలగాలకు అప్పగించామని చెప్పారు. వలంటీర్లను ఎన్నికల సంబంధిత కార్యక్రమాల్లో వినియోగించకూడదని విజయానంద్‌ స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement