సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో ఎక్కడైనా అరగంటలోనే కోవిడ్ రోగులకు పడకలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ఉప ముఖ్య మంత్రి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. బుధవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి హోమ్ ఐసొలేషన్, క్వారంటైన్ సెంటర్లలో ఉన్న రోగులతో జూమ్ యాప్ ద్వారా ముఖాముఖి మాట్లాడారు. ఇతర జిల్లాలతో పోల్చితే తూర్పు గోదావరి జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటానికి గల కారణాలను పరిశీలించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చామన్నారు. అనంతరం రాజమహేంద్రవరం, కాకినాడల్లో అధికారులతో సమీక్షించి మాట్లాడారు.
► కరోనా పరీక్షల్లో దేశంలోనే రాష్ట్రం టాప్‌లో ఉంది. పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తుండటం వల్లే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పరీక్షలు రోజుకు 6 వేలు పైనే నిర్వహిస్తున్నారు.
► ఇప్పటికే ఈ జిల్లాలో 6 కరోనా ఆసుపత్రులున్నాయి. వీటి సంఖ్య 9కి పెంచుతున్నాం. కోవిడ్ కేర్ సెంటర్‌లో 3 వేల నుంచి 4 వేల బెడ్లున్నాయి. వీటికి అదనంగా ఐదు కోవిడ్ కేర్ సెంటర్‌లతో ఐదువేల బెడ్‌లు ఏర్పాటు చేస్తున్నాం.
► సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి వెళితే వైద్యం నిరాకరిస్తే చర్యలు తప్పవు. వైద్యం అందక మరణిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
► దేశంలోనే అత్యుత్తమ వైద్యం రాష్ట్రంలో అందుతుంటే చంద్రబాబు మాత్రం రాజకీయం చేస్తున్నారు. సమీక్షలో మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
కరోనా రోగులకు అరగంటలోనే పడకలు
Published Thu, Jul 30 2020 3:58 AM | Last Updated on Thu, Jul 30 2020 7:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment