సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఈ వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. దీనిపై సోమవారం ఒక బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి వచ్చిన 263 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి పరిశీలనలో ఉంచామని, వారిలో 50 మందిని ఇంటిలోనే ఉంచి పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మిగతా 211 మంది 28 రోజుల పరిశీలనా కాలాన్ని పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 24్ఠ7 కంట్రోల్ రూమ్ (ఫోన్ నం: 0866–2410978, టోల్ ఫ్రీ నంబర్లు: 1100, 1902) ఏర్పాటు చేశామని, వైద్యులను అప్రమత్తం చేయడంతో పాటు ప్రతి జిల్లాలోని బోధనాసుపత్రి, జిల్లా ఆస్పత్రుల్లో బాధితులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ వైరస్ పలు దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య సలహాలను పాటించాలని కోరారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- జలుబు, దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మాస్కు ధరించి తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి వైద్యులను సంప్రదించాలి.
- తుమ్ములు లేదా దగ్గు వస్తున్నప్పుడు రుమాలు గానీ లేదా టిష్యూ పేపర్‌తో ముక్కు/నోటిని కప్పి ఉంచుకోవాలి.
- చేతులను తరచుగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
- విదేశాల నుంచి వచ్చిన వారు వైరస్ లక్షణాలున్నా లేకపోయినా ఖచ్చితంగా 28 రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉండాలి.
- ఇతర కుటుంబ సభ్యులతో కలవకూడదు.
- వైద్య పరిశీలనలో ఉన్న వారి వద్దకు సందర్శకులను అనుమతించ కూడదు.
- అవసరమైతే తప్ప జన సమ్మర్థం ఉండే బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు.
- ఏదైనా సమాచారం అవసరమైతే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలి.
కోవిడ్‌పై ఆందోళన వద్దు
ఏలూరు టౌన్/తిరుపతి తుడా: కోవిడ్–19 (కరోనా) వైరస్ విషయంలో రాష్ట్ర ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయం నుంచి వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కోవిడ్‌పై సమీక్షించి, అప్రమత్తం చేశారు. తెలంగాణలో కోవిడ్ కేసులు నమోదు కావటంతో రాష్ట్రంలో ముందస్తు చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్‌ను నియమించామని, విశాఖపట్నంలోని చెస్ట్ హాస్పిటల్‌ను నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేశామని వెల్లడించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రులు, బోధనాస్పత్రుల్లో ప్రత్యేకంగా ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు చేయటంతోపాటు, వెంటిలేటర్లు, మాస్క్‌లు, మందులు ఏర్పాటు చేశామన్నారు. కాగా కోవిడ్‌పై ఐదు జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేసిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌తో హెల్త్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్ తిరుపతిలో సోమవారం సమీక్షించారు. సోషల్ మీడియాలో వదంతులను ప్రజలెవరూ నమ్మవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment