మళ్లీ మళ్లీ అవే అబద్ధాలా?  | Allegations of Purandeshwari on liquor | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ అవే అబద్ధాలా? 

Published Wed, Oct 11 2023 5:06 AM | Last Updated on Wed, Oct 11 2023 7:08 PM

Allegations of Purandeshwari on liquor - Sakshi

చంద్రబాబు నాయుడి కోసం ‘ఈనాడు’ రాతలను లేఖలుగా సంధిస్తున్న  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చిన్నచిన్న లాజిక్కులు కూడా మిస్‌ అవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్కిల్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న తన బావ చంద్రబాబు మెప్పుకోసం కొన్ని రోజులుగా రాష్ట్రంలో ‘మద్యంపై పోరాటం’ అంటూ ఆమె చేస్తున్న హంగామా అంతా చూస్తున్నదే.

తాజాగా దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ అందజేశారు. తమ పార్టీ ప్రభుత్వానికే ఇలా వినతి పత్రాలివ్వటమేంటని అంతా ఆశ్చర్యపోతున్నా... టీడీపీ సంక్షేమం కోసం పాటుపడుతున్న పురంధేశ్వరికి మాత్రం ఇవేమీ పట్టడం లేదు. లేఖలో ఆమె పేర్కొన్న కొన్ని అంశాలు ఎంత అసంబద్ధమైనవంటే... 

అనుమతులిచ్చిన చంద్రబాబును ప్రశ్నించరేం? 
రాష్ట్రంలో మద్యం నాణ్యతపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్న పురంధేశ్వరికి... దాన్ని తయారు చేస్తున్న డిస్టిలరీలకు అనుమతులిచ్చింది తన బావ చంద్రబాబు నాయుడేనని తెలియదా? ఒకవేళ తెలియకుంటే తెలుసుకోవాలి కదా? వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం 20 మద్యం డిస్టిలరీలుండగా... వాటిలో 14 డిస్టిలరీలకు అనుమతిచ్చింది చంద్రబాబు నాయుడే. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. అంతే తప్ప వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు.

పైపెచ్చు చంద్రబాబు నాయుడు అనుమతిచ్చిన డిస్టిలరీల్లో చాలావరకూ ఆయన హితులు, సన్నిహితులవే. వాళ్లు అప్పట్లో తయారు చేసిన మద్యాన్నే ఇప్పుడూ తయారు చేస్తున్నారు. మరి అప్పట్లో నాణ్యంగా ఉన్న మద్యం ఇప్పుడు ఎందుకు మారిపోయింది? ప్రభుత్వం మారింది కాబట్టా? ఇదెక్కడి తీరు పురంధేశ్వరి గారూ?! 

నాడు నాలుగు డిస్టిలరీలకే 70 శాతం ఆర్డర్లు.. 
పురంధేశ్వరి తన లేఖలో వాస్తవానికి సమాధి కట్టి వినిపించిన మరో అందమైన అబద్ధమేంటంటే... వైఎస్సార్‌ సీపీ నాయకులకు చెందిన డిస్టిలరీలకే ఎక్కువ మద్యం సరఫరా చేసే అవకాశమిస్తున్నారని. నిజం చెప్పాలంటే వైఎస్సార్‌సీపీ నేతలకు డిస్టిలరీలే లేవు. అన్నీ చంద్రబాబు నాయుడి హయాం­లో అనుమతులిచ్చిన ఆయన సన్నిహితులు, టీడీపీ నేతలవే. పైపెచ్చు చంద్రబాబు హయాంలో డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగేది. తమ వారికి చెందిన 4 డిస్టిలరీల నుంచే ఏకంగా 70 శాతం మద్యాన్ని కొనుగోలు చేసేవారు.

అంటే తనకు కావాల్సిన ఈ 4 డిస్టిలరీలకూ సగటున ఒక్కోదానికీ 17.5 శాతం ఆర్డర్లు ఇచ్చారు. మిగిలిన 16 డిస్టిలరీలకూ కలిపి 30 శాతం ఆర్డర్లు ఇచ్చారు. అంటే వీటికి సగటున 2 శాతంలోపే ఆర్డర్లు దక్కాయి. కానీ ఇంతటి అవినీతిని పురంధేశ్వరి ఎన్నడూ... ఏ పార్టీలో ఉన్నప్పుడూ ప్రశ్నించలేదు.  వాస్తవానికి ఇప్పుడు ప్రతి డిస్టిలరీకీ సమానంగా అవకాశం కల్పిస్తున్నారు.

దాదాపు 4 నుంచి 6 శాతం వరకు ప్రతి డిస్టిలరీకీ తయారీ ఆర్డర్లు ఇస్తున్నారు. ఇలా చేస్తున్నందుకే... ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చెందిన కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే జరుగుతున్నాయని ఒక నివేదిక కూడా ఇచ్చింది. కేంద్ర సంస్థే ఇలా చెప్పినపుడు... కేంద్రానికి పురంధేశ్వరి చేసిన ఫిర్యాదులో ఏ కొంచెమైనా అర్థం ఉన్నట్టా? 

సత్ఫలితాలనిస్తున్న దశలవారీ మద్య నియంత్రణ.. 
మద్యం విక్రయాలను ప్రభుత్వ అధీనంలో చేపట్టడం... షాపుల సంఖ్యను తగ్గించటం... విక్రయ వేళల్ని పరిమితం చేయటం... పర్మిట్‌ రూముల్ని రద్దు చేయటం... బెల్టు షాపుల్ని తొలగించటం... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2018–19లో మద్యం విక్రయాలు 3.84 కోట్లు కేసులు. అదే ఏడాది బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోయాయి. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక విక్రయాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి.

2022–23లో మద్యం విక్రయాలు 3.35 కోట్ల కేసులకు, బీర్లు 1.16 కోట్ల కేసులకు పరిమితమయ్యాయి. మద్యం తాగేవారు వెనుకంజ వేసేలా... రేట్లను షాక్‌ కొట్టేలా పెంచుతామని గత ఎన్నికల హామీల్లో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. దాన్ని అమలు చేశారు. రేట్లను పెంచటంతో పాటు అదనపు పన్నునూ విధించారు. ఇది కూడా మద్యం విక్రయాలు తగ్గటానికి కారణమే. 

నిధులు మళ్లించింది చంద్రబాబు కాదా? 
తెలుగుదేశం, ‘ఈనాడు’ బాటలోనే... రాష్ట్రంలో మద్యం విక్రయించగా వచ్చిన సొమ్ము ఖజానాకు కాకుండా ఇంకెక్కడికో తరలిపోతోందంటూ పురంధేశ్వరి సైతం గగ్గోలుపెట్టారు. రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది తలా రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారని నోటికొచ్చినట్లు చెప్పేశారు. ఇలా చూస్తే మద్యం అమ్మకాల ద్వారా సంవత్సరానికి రూ.57,600 కోట్లు రావాలని, కానీ రూ.32,600 కోట్లే చూపిస్తున్నారు కనక మిగతా రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లించేస్తున్నారని నమ్మశక్యం కాని కూతలు కూసేశారు.

నిజానికి కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక 2019–21 ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడ్డవారిలో మద్యం అలవాటు ఉన్నవారు 63.88 లక్షలమంది. వీరిలో రోజూ తాగేవారు సగటున 18.24 లక్షల మందే. మరి 80 లక్షల లెక్క ఎవరు చెప్పారు పురంధేశ్వరి గారూ? వాస్తవానికి ఈ ప్రభుత్వ హయాంలో తక్కువ మద్యం విక్రయిస్తున్నా ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ సొమ్ము సమకూరుతోంది.

కానీ చంద్రబాబు హయాంలో ఇప్పటికంటే చాలా ఎక్కువ మద్యాన్ని విక్రయించినా కూడా... ఇప్పటికన్నా తక్కువ మొత్తమే ఖజానాకు చేరేది. మరి నిధుల మళ్లింపు అప్పుడు జరిగినట్టా? ఇప్పుడు జరుగుతున్నట్టా? కాస్త ఆలోచన ఉండాలి కదా? చంద్రబాబును విమర్శించడానికి మనసు ఒప్పుకోకుంటే... ఇలాంటి పనికిమాలిన ఆరోపణలైనా చేయకుండా ఉండాలి కదా?.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement