సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద వైఎస్సార్– జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అన్ని వసతులతో పేదల కాలనీలను ఆదర్శంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 17,005 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలను రెండు దశల్లో చేపడుతున్న విషయం తెలిసిందే. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్‌ల ఆధ్వర్యంలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు రూ.32,909 కోట్లు ఖర్చు చేయనుంది. మౌలిక వసతుల కల్పన పనులకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయి. తొలి దశలో ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిన 10 వేల లేఅవుట్‌లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.24 వేల కోట్లు ఖర్చు చేయనుంది.
విశాలమైన రోడ్లు.. ఇంటర్నెట్ సదుపాయం..
► కాలనీల్లో ఇళ్ల సంఖ్య, లేఅవుట్ విస్తీర్ణాన్ని బట్టి 20, 30, 40 అడుగుల రోడ్లు నిర్మించనున్నారు. 40 అడుగుల రోడ్లు నిర్మించిన చోట రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేస్తారు.
► 1,500 లోపు ఇళ్లు ఉన్న కాలనీలో సీసీ డ్రైన్లు, ఆపైన ఇళ్లు ఉన్న చోట అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వర్షపు నీరు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేస్తారు.
► కాలనీలో 550 ఇళ్ల లోపు ఉన్న చోట ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్, 550 ఇళ్లు పైబడి ఉంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్ చేపట్టనున్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీ కోసం కూడా చర్యలు తీసుకోనున్నారు.
నాణ్యత పట్ల ప్రత్యేక శ్రద్ధ
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు సన్నాహాలు చేస్తున్నాం. డీపీఆర్‌లు పూర్తయ్యాయి. డీపీఆర్‌లు సమర్పించడం, నిధుల సమీకరణ, ఇతర పనులు చేపడుతున్నాం. నాణ్యతపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం.
– ఎం.శివప్రసాద్, మౌలిక వసతుల ప్రత్యేక అధికారి, గృహ నిర్మాణ శాఖ
వచ్చే ఏడాది డిసెంబర్‌లో పనులు పూర్తి
ఇళ్ల నిర్మాణ అవసరాలకు వీలుగా బోర్లు, మోటార్లు, విద్యుత్ కనెక్షన్లు, నీటి నిల్వ వసతులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.1200 కోట్లు ఖర్చు పెట్టింది. శాశ్వత మౌలిక వసతుల కల్పనకు రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి నిధుల సమీకరణ, టెండర్‌లు పిలవడం, ఇతర సాంకేతిక పరమైన పనులు పూర్తి చేస్తాం. 2022 డిసెంబర్ నెలాఖరుకు తొలి లేఅవుట్‌లలో మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం.
– అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్
Comments
Please login to add a commentAdd a comment