కోవిడ్‌పై యుద్ధం.. అన్ని విధాలా సన్నద్ధం | Andhra Pradesh Govt made available emergency items Covid treatments | Sakshi
Sakshi News home page

కోవిడ్‌పై యుద్ధం.. అన్ని విధాలా సన్నద్ధం

Published Sun, Jan 30 2022 4:34 AM | Last Updated on Sun, Jan 30 2022 8:00 AM

Andhra Pradesh Govt made available emergency items Covid treatments - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 కేసుల నేపథ్యంలో నియంత్రణకు, చికిత్సలకు అవసరమైన అత్యవసర వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటికి అదనంగా చికిత్సలకు, వైద్య సిబ్బందికి అవసరమైన అత్యవసర వస్తువులను కొనుగోలు చేస్తోంది. దీంతో పాటు పెద్ద ఎత్తున ఆక్సిజన్, ఐసీయూ బెడ్లతో పాటు సాధారణ బెడ్లను అందుబాటులోకి తెచ్చింది. మరో పక్క 175 నియోజకవర్గాల్లో 186 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 28,342 బెడ్లను అందుబాటులో ఉంచింది.

ఇప్పటికే డాక్టర్లు, వైద్య సిబ్బందికి 5.21 లక్షల ఎన్‌–95 మాస్క్‌లను అందుబాటులో ఉంచగా, కొత్తగా మరో 25 లక్షల ఎన్‌–95 మాస్క్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 24.43 లక్షల సర్జికల్‌ మాస్క్‌లను అందుబాటులో ఉంచగా, కొత్తగా 50 లక్షల సర్జికల్‌ మాస్క్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 46.23 లక్షల గ్లౌజులు అందుబాటులో ఉండగా, అదనంగా మరో 30 లక్షల గ్లౌజులు కొనుగోలు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి 4.68 లక్షల పీపీఈ కిట్‌లను అందుబాటులో ఉంచారు. 9.02 లక్షల వీటీఎంలను అందుబాటులో ఉంచారు. ఏకంగా 8.78 లక్షల హోం ఐసొలేషన్‌ కిట్లను సిద్ధం చేశారు. 

చురుగ్గా ఫీవర్‌ సర్వే
కరోనాను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించడానికి 36వ విడత ఫీవర్‌ సర్వే ఇటీవల ప్రారంభించాం. సర్వే వేగంగా సాగుతోంది. అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాం. పాజిటివ్‌గా నిర్ధారణై హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్యంపై ఏఎన్‌ఎం, ఆశవర్కర్లు వాకబు చేస్తున్నారు. వారికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్నాం.
– డాక్టర్‌ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు


ఆందోళన వద్దు
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంది. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. వ్యాక్సిన్‌ వేసుకోని వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపైనే కొంత ప్రభావం ఉంటోంది. అయినా ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించాలి.  
– డాక్టర్‌ వినోద్‌ కుమార్, కరోనా వైద్య నిర్వహణ ప్రత్యేక అధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement