
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా చాలా గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ దహన, ఖనన సౌకర్యాలు లేక కొన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండటం దురదృష్టకరమని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. గౌరవంగా, హుందాగా జీవించడం రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగమని పేర్కొంది. ఇది జీవించి ఉన్నవారికే కాకుండా.. మృతదేహాలకు కూడా వర్తిస్తుందని తేల్చిచెప్పింది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో నొక్కి వక్కాణించిందని గుర్తు చేసింది.
ఈ అంశం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని.. కుల, మత, ప్రాంత, లింగ బేధాలతో సంబంధం లేకుండా మరణించిన వ్యక్తుల అంతిమ సంస్కారాలు వారి వారి కట్టుబాట్లు, విశ్వాసాల ప్రకారం జరిగేలా దహన, ఖనన వాటికలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలను ఆదేశించింది. గుంటూరు జిల్లా పెదకాకానిలో సర్వే నంబర్ 153లోని భూమిని ఎస్సీల శ్మశాన వాటికకు కేటాయించేందుకు సర్వే చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. ఒకవేళ ఆ భూమి కబ్జాకు గురైతే కబ్జాదారులను ఖాళీ చేయించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తాజాగా తీర్పు వెలువరించారు.
ఇదీ వివాదం...
గుంటూరు జిల్లా పెదకాకానిలో సర్వే నం.153లోని 0.95 సెంట్ల భూమిలో 0.71 సెంట్ల భూమిని హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించారు. మిగిలిన 0.24 సెంట్లను తమ శ్మశాన వాటికకు కేటాయించాలని ఎస్సీలు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీన్ని సవాల్ చేస్తూ గొట్టిముక్కల రామయ్య, మరికొందరు పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపారు. కోర్టు ఆదేశాల మేరకు పెదకాకాని తహసీల్దార్ కౌంటర్ దాఖలు చేశారు.
0.24 సెంట్ల ప్రభుత్వ భూమిని పిటిషనర్లు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. గత 50 ఏళ్లుగా ఎస్సీలు సదుపాయాలు లేక చెరువు కట్టపైనే అంతిమ సంస్కారాలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి.. ఐపీసీ సెక్షన్ 297 శ్మశాన వాటికల దురాక్రమణ నుంచి, అంతిమ సంస్కారాలు సక్రమంగా సాగించే విషయంలో తగిన రక్షణ కల్పిస్తోందన్నారు. శ్మశానాలకు భూమి కేటాయింపు, వాటి నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలపై ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment