సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో తమ ముందు హాజరు కావాలన్న ఆదేశాలను వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పాటించకపోవడంతో ఆమెకు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. ఈ కేసులో అధికారులు తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని పేర్కొంది. ఈ కేసు తీర్పును ఈ నెల 23కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. పట్టు పరిశ్రమల శాఖలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న పిటిషనర్ల సేవలను 1993 నుంచి క్రమబద్ధీకరించాలని గతేడాది ఫిబ్రవరి 28న హైకోర్టు ఆదేశించింది.
అందుకనుగుణంగా పెన్షనరీ ప్రయోజనాలను వర్తింపచేయాలని సూచించింది. అయితే ఈ తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ 17 మంది విశ్రాంత ఉద్యోగులు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలంటూ పలువురు అధికారులకు గతంలో ఆదేశాలిచ్చారు. ఈ మేరకు వారు బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే పూనం మినహా మిగిలిన అధికారులు హాజరయ్యారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ రికార్డుల్లో లేకపోవడంతో పూనంకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
స్వయంగా హాజరుకండి: సీఎస్‌కు హైకోర్టు ఆదేశం
ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు వ్యవహారంలో హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 24న స్వయంగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఉపాధి పనులకు సంబంధించి విజిలెన్స్ విచారణ పూర్తయిందా? లేదా? అనేదానిపై స్పష్టతనివ్వాలని కోరింది. విజిలెన్స్ విచారణ పూర్తయినట్లు కేంద్రానికి చెప్పి.. విచారణ జరుగుతోందని తమకు చెప్పడం కోర్టును తప్పుదోవ పట్టించడమే అవుతుందని పేర్కొంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోవాలని భావిస్తున్నామని.. కాబట్టి సీఎస్ హాజరుకు ఆదేశాలిస్తున్నట్లు జస్టిస్ బట్టు దేవానంద్ చెప్పారు.
పూనంకు ఎన్‌బీడబ్ల్యూ
Published Thu, Sep 16 2021 4:09 AM | Last Updated on Thu, Sep 16 2021 4:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment