సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం విధానంపై ప్రస్తుతానికి ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కూడా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే బార్ లైసెన్సుల మంజూరు కొనసాగించవచ్చని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యంపై విధాన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం, వాటి రద్దు చాలా అరుదుగా జరుగుతుందని, మధ్యంతర ఉత్తర్వుల జారీ కూడా అంత సులభంగా ఉండదని ధర్మాసనం తెలిపింది. కొత్త మద్యం పాలసీ, నిబంధనలను సవాలు చేస్తూ దాదాపు 535 మంది బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, ఒ.మనోహర్‌రెడ్డి, ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2017లో ఐదేళ్లకు ప్రభుత్వం బార్ లైసెన్సులు మంజూరు చేసిందని, వీటి కాల పరిమితి ఈ ఏడాది జూన్ 30తో ముగిసిందని చెప్పారు.
కొత్త విధానం అమలుకు లైసెన్సుల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించిందని తెలిపారు. కొత్త విధానంలో దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలుగా నిర్ణయించారని, ఇది నాన్ రిఫండబుల్ అని వివరించారు. ముఖ్యమైన ప్రాంతాలకు, శివారు ప్రాంతాలకు ఒకే రకమైన లైసెన్సు ఫీజు చెల్లించాలని, ఇది అన్యాయమని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ‘అలా అయితే దరఖాస్తు చేసుకోకండి. ఎవరూ బలవంతం చేయడంలేదుగా? ఇందులో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘన లేదు. మీకు లాభసాటి కాదనుకుంటే ఆగిపోండి. మద్యం వ్యవహారాల్లో సమానత్వపు హక్కు ఏంటి? అందరికీ సమాన అవకాశాలు ఎలా సాధ్యం’ అంటూ ప్రశ్నించింది.
మద్యం వ్యాపారంలో ఏ వ్యాపారీ నష్టపోరు
కొత్త పాలసీలో 3 స్టార్, 5 స్టార్ హోటళ్లు, పర్యాటక కేంద్రాల్లోని బార్లను 2017 నిబంధనల ప్రకారం కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించిందని, మిగిలిన బార్లను లైసెన్స్ కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చెబుతోందని న్యాయవాదులు చెప్పారు. ఇది వివక్షేనని అన్నారు. అది వివక్ష కిందకు రాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత అన్ని విషయాలను పరిశీలిస్తామంది. తమ లైసెన్సులు కూడా 2017 నిబంధనల ప్రకారం కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. లేని పక్షంలో లైసెన్సులు రాని వారంతా రూ.10 లక్షలు నష్టపోతారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, మద్యం వ్యాపారంలో ఏ వ్యాపారీ నష్టపోరని వ్యాఖ్యానించింది.
తదుపరి విచారణ సమయంలో అన్నీ పరిశీలిస్తాం
కొత్త విధానం ప్రకారం లైసెన్సుల మంజూరు బుధవారం నుంచి ప్రారంభమవుతుందని, ఆ ప్రక్రియను ఖరారు చేయకుండా ఆదేశాలివ్వాలని న్యాయవాదులు కోరగా.. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. మద్యం ఆరోగ్యానికి హానికరమే కాక, మత్తును కూడా ఇస్తుందని, అందువల్ల ఇందులో తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. సీనియర్ న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ, రెస్టారెంట్లు లేని వారు కూడా దరఖాస్తు చేస్తున్నారని, నిబంధనల ప్రకారం ఇలాంటి వారు అనర్హులని, వారిని అడ్డుకునే దిశగా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. తదుపరి విచారణ సమయంలో ఈ విషయాలన్నీ పరిశీలిస్తామని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment