అనంతపురంలో జరిగిన సామాజిక న్యాయభేరి సభకు భారీగా హాజరైన ప్రజలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం/నంద్యాల/కర్నూలు (రాజ్‌విహార్): ‘రాష్ట్రంలో సామాజిక న్యాయం గురించి చెప్పడంకాదు.. చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది. ఎన్నికల వేళ ఓట్లు అభ్యర్థించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మర్చిపోయే వారికి మనం ఎప్పటికీ అవకాశం ఇవ్వొద్దు. ఇప్పుడు వెనుకబడిన వర్గాలు, కులాలకు రాజ్యాధికారం వచ్చింది. దీన్ని కాపాడుకోవాలంటే ముప్పై ఏళ్లు మనం జగన్‌ను కాపాడుకుని సీఎంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది’.. అని రాష్ట్ర మంత్రులు ఆకాంక్షించారు.
సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ముగింపు సభ ఆదివారం అనంతపురం ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించారు. కిక్కిరిసిన జనాల మధ్య జరిగిన ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ సభలో మంత్రులు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం అంటే ఏమిటో జగన్ చేసి చూపించారన్నారు.
‘గతంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలా రాజ్యాధికారంలో సామాజిక న్యాయం జరిగిన దాఖలాలు చూశామా? ఆంధ్రప్రదేశ్‌లో మినహా ఇలాంటి విప్లవాత్మక మార్పులు ఎక్కడైనా చూశామా? బీసీ, ఎస్సీ వర్గాలు ముఖ్యమంత్రులుగా పాలిస్తున్న రాష్ట్రాల్లో సైతం ఇలా సామాజిక న్యాయం అమలుకావట్లేద’ని మంత్రులు అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఏనాడైనా ఇంతమంది వెనుకబడిన వర్గాలు, కులాలకు మంత్రి పదవులు వచ్చాయా అని వారు ప్రశ్నించారు. సామాజిక న్యాయం దశ దిశలా ఆచరణలో ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమేనని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు ఉండేలా కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉందని మంత్రులు ఆకాంక్షించారు. సభలో పాల్గొన్న మంత్రులు ఏమన్నారంటే..
అనంతపురంలో బస్సు యాత్ర సందర్భంగా వేదికపై మంత్రులు
తరతరాలుగా ఎందుకు చేయలేకపోయారు? : ధర్మాన
పేదల ఖాతాల్లోకి డబ్బు వెళ్తోందని కొంతమంది బాధపడుతున్నారు. అవసరాలు తీర్చడంవల్లే కదా వారి పిల్లలు చదువుకుంటున్నారు. గతంలో ప్రభుత్వాలు ఇలాంటివి తీర్చలేక పోవడంవల్లే కదా కులాల మధ్య అసమానతలు పెరిగి వివాదాలు వస్తున్నాయి. ఇప్పుడు సీఎం రాష్ట్రమంతా తిరిగి, పాదయాత్ర చేసి, పరిస్థితులను అధ్యయనం చేసి వారి ఆకలి బాధలను గుర్తించి ఖాతాల్లో నగదు వేస్తున్నారు.
గతంలో వెనుకబడిన వర్గాల సంఖ్యకు తగ్గ అధికారం ఎప్పుడైనా ఉండేదా? రాజ్యాధికారం వస్తేనే కదా ఆయా కులాల, వర్గాల అవసరాలు తీరేది. పథకాలు ఇవ్వడమే కాదు.. వాటిని గౌరవంగా ఇచ్చారా, లేదా అనేది ముఖ్యం. ఆ గౌరవం ఇక్కడ సామాజికవర్గాలకు దక్కింది. ఈ వర్గాలన్నీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరముంది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆర్థిక అసమానతలు లేకుండా చేయడంవల్లే రాష్ట్రంలో తీవ్రవాదం తగ్గింది.
అప్పట్లో పసుపు చొక్కా వేసుకున్న వారికే లబ్ధి : చెల్లుబోయిన
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పసుపు చొక్కా వేసుకున్న వారికే లబ్ధి జరిగేది. ఇప్పుడు కులం, మతం, వర్గం, పార్టీల రహితంగా పథకాలు అందుతున్నాయి. బాబు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తే.. జగన్ రాజ్యాధికారం ఇచ్చారు. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌వల్లే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు పెద్ద చదువులు చదువుకోగలిగారు. వెనుకబడిన కులాలు, వర్గాల వారిని ఇక్కడలా ఎక్కువ సంఖ్యలో మంత్రులుగా తీసుకున్నది దేశ చరిత్రలో ఎక్కడా లేదు.
మన తలరాతలు మార్చింది జగనన్నే : గుమ్మనూరు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మంత్రి పదవులిచ్చి వారి తలరాతలు మార్చడమే కాదు.. సంక్షేమ పథకాల ద్వారా మనందరి తలరాతలు మార్చింది ఒక్క జగనన్నే. ఏ కుటుంబంలోనైనా తండ్రి ఆస్తి ఇస్తానని చెప్పి మాట తప్పి ఉండొచ్చుగానీ, జగన్ ఎక్కడా మాట తప్పలేదు. ప్రతి అర్హుడికి సెంటున్నర స్థలం ఇచ్చారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు మనం బలి కాకూడదు. మహానాడులో బాలకృష్ణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి మన బీసీ సోదరులంతా హిందూపురంలో బాలకృష్ణనూ ఓడించాలి. భవిష్యత్తులో జగన్‌పై నోరుజారొద్దని బాలకృష్ణను హెచ్చరిస్తున్నా.
ప్రతి ఇంట్లో సంక్షేమ క్యాలెండర్ : అంజాద్ బాషా
సాధారణంగా ఇంట్లో క్యాలెండర్‌ను తేదీలను చూసుకోవడానికే వాడతారు. కానీ, ఇప్పుడు ప్రతి ఇంట్లో జగనన్న సంక్షేమ క్యాలెండర్ ఉంది. ఎప్పుడు ఏ పథకానికి సంబంధించిన డబ్బు వస్తుందో చూస్తున్నారు. నవరత్నాల ద్వారా రూ.1.48 లక్షల కోట్లు పేదలకు పంచిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే. ఇలాంటి క్యాలెండర్ ఏ రాష్ట్రంలోనూ లేదు. జగన్ పాలనను చూసి చంద్రబాబుకు కడుపు మండుతోంది. వెనుకబడిన వర్గాలకు ఈ పాలన పండుగలా ఉంది.
జగన్‌కు ప్రజలే మీడియా : ఉషశ్రీ చరణ్
అంబేడ్కర్, ఒక జ్యోతిబాపూలేకు పర్యాయ పదం ఎవరున్నారూ అంటే మన జగనన్నే. దేశచరిత్రలో 70 శాతానికి పైగా మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చింది ఆయనే. టీడీపీ మహానాడులో మహిళా నేతలు తొడలు కొట్టారు. వారికి విచక్షణలేదు. నేను బీసీని.. కురుబ కుటుంబంలో పుట్టినా నాకు మంత్రి పదవి వచ్చింది. ఒక ఎస్సీ మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఇదంతా కేవలం జగన్‌వల్లే సాధ్యమైంది. చంద్రబాబు వద్దు.. జగనన్న ముద్దు అనేదే మన నినాదం కావాలి. టీడీపీకి ఎల్లో మీడియా ఉంది. కానీ జగన్‌కు ప్రజలే మీడియా.
జగన్‌కు అండగా నిలుద్దాం : నారాయణస్వామి
దశాబ్దాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అన్ని విధాలా అణగదొక్కారు. తొలిసారిగా సీఎం జగన్ వారికి మంత్రి పదవులే కాదు, రాజకీయంగా అన్ని రకాల పదవులూ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. స్థానిక సంస్థల పదవుల్లోనూ బడుగు, బలహీన వర్గాల వారికే ఎక్కువగా ఇచ్చారు. చివరకు విజయవాడ మేయర్ పదవి జనరల్‌కు రిజర్వ్ అయినా బీసీకిచ్చి ఆ వర్గాల పట్ల చిత్తశుద్ధి చాటుకున్నారు. అందుకే మనమంతా ఆయనకు రుణపడి ఉండాలి.
సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం
వాళ్లు ఏపీలో కలవాలనుకుంటున్నారు : ఆర్. కృష్ణయ్య
నేను ఈమధ్య కర్ణాటక వెళ్లా. అక్కడి వారు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలనను మెచ్చి.. వారిని ఈ రాష్ట్రంలో కలపాలని కోరారు. వారూ మన పథకాలు కావాలని కోరుకుంటున్నారు. ఆంధ్ర సరిహద్దుల్లోని తమిళనాడు వాసులూ ఇదే చెబుతున్నారు. టీడీపీ బీసీల పార్టీ అని చంద్రబాబు చెప్పుకుంటారు. కానీ, ఆయన ఏనాడూ వారి కోసం పనిచేయలేదు. ఎప్పుడూ ప్రజలను ఓట్ల కోణంలోనే చూస్తారు. కానీ, జగన్ అలా కాదు. బడుగు, బలహీన వర్గాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఇందుకు ధైర్యం కావాలి. అందుకే జగన్‌కు అందరం ఎప్పుడూ అండగా నిలవాలి.
నీకా ధైర్యం ఉందా బాబూ? : జోగి
చంద్రబాబూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రివర్గంలో 70 శాతం పదవులు ఇస్తానని చెప్పే దమ్ముందా నీకు? 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నువ్వు, ఏనాడైనా ఆ వర్గాల బాగును పట్టించుకున్నావా? సీఎం జగన్ ఈ మూడేళ్లలోనే సంక్షేమం కింద రూ.1.42 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. వీరిలో 80 శాతానికి పైగా బడుగు, బలహీనవర్గాల వారున్నారు. అందుకే మన సీఎంను చూసి, ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటలో నడవాలని చూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment