సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యముంది. ఎగుమతులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. దీంతో బియ్యం ఎగుమతుల్లో రాష్ట్రం దూసుకుపోతోంది. ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా దేశాలకు రాష్ట్ర బియ్యం ఎక్కువగా ఎగుమతి అవుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2020 – 21)లో రాష్ట్రం నుంచి రూ.5,790 కోట్ల విలువైన 22.09 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగితే, ఈ ఆర్థిక సంవత్సరం (2021 – 22) మొదటి ఏడు నెలలకే (ఏప్రిల్ – అక్టోబర్) రూ.4,131.86 కోట్ల విలువైన 16.38 లక్షల టన్నులు ఎగుమతి చేసింది. 2019–20లో ఈ విలువ రూ.1,902.65 కోట్లు మాత్రమే. రెండేళ్లలోనే ఎగుమతులు రెండు రెట్లకు పైగా పెరిగాయి. ఈ ఏడాది రాష్ట్ర బియ్యం ఎగుమతులు 30 లక్షల టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
డీప్ వాటర్ పోర్టు ద్వారా కూడా
గతంలో కాకినాడ యాంకర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతి జరిగేది. దీంతో బియ్యం తీసుకెళ్లడానికి వచ్చిన ఓడలు దీర్ఘకాలం సముద్రంలోనే నిరీక్షించాల్సి వచ్చేది. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అహార సంక్షోభం తలెత్తింది. బియ్యానికి డిమాండ్ పెరిగింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖతో చర్చించి కాకినాడ డీప్ వాటర్ పోర్టు ద్వారా కూడా బియ్యం ఎగుమతికి అనుమతులు తీసుకొంది. ఇక్కడి నుంచి కూడా బియ్యం ఎగుమతులకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయి. గతంలో నెలకు 10 నుంచి 12 ఓడల ద్వారా ఎగుమతి చేయగలిగేవాళ్లమని, ఇప్పుడు 16 ఓడల వరకు ఎగుమతి చేస్తున్నామని కాకినాడ యాంకరేజ్ పోర్టు అధికారులు వెల్లడించారు. రెండేళ్ల క్రితం బియ్యం ఎగుమతి కోసం వచ్చిన ఓడ లోడింగ్‌కు కనీసం 30 రోజులు పట్టేదని, అది ఇప్పుడు 20 రోజులకు తగ్గిందని అధికారులు వెల్లడించారు.
10 శాతం వాటాపై దృష్టి
ప్రస్తుతం రాష్ట్ర ఎగుమతుల్లో 5 శాతం వాటాను కలిగి ఉన్న బియ్యం రానున్న రోజుల్లో 10 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోవడంతో కేంద్రం కూడా ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మన దేశం నుంచి బియ్యం (నాన్ బాసుమతి) 177.2 లక్షల టన్నుల ఎగుమతి అయింది. అది ఈ ఏడాది 200 లక్షల టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా ఆఫ్రికా దేశాలైన గునియా (17%), కోట్ డివోరి (15%), సెనెగల్ (12%) దేశాలతో పాటు బంగ్లాదేశ్, ఇతర ఆసియా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment