Andhra Pradesh: ఆరోగ్యానికి భరోసా ‘కార్డు’ | Andhra Pradesh Tops In Digital Health Mission With Health card | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఆరోగ్యానికి భరోసా ‘కార్డు’

Published Sun, Aug 28 2022 5:06 AM | Last Updated on Sun, Aug 28 2022 8:39 AM

Andhra Pradesh Tops In Digital Health Mission With Health card - Sakshi

2023 జూలై 1.. సుబ్బారావుకు జ్వరమొచ్చింది. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌కు వెళ్లి హెల్త్‌ కార్డు ఇచ్చాడు. అందులో ఉన్న నంబరును హెల్త్‌ ప్రొవైడర్‌ కంప్యూటర్‌లో ఎంటర్‌ చేశాడు. ‘ప్రతి ఏటా ఇదే సీజన్‌లో మీకు జ్వరం వస్తోంది. మీకు కొన్ని మందులు బాగా పనిచేస్తున్నాయి. యాంటీబయాటిక్స్‌ మీ ఒంటికి పడటంలేదు. అందువల్ల ఇతర మందులు వాడాలి. మీ వయసు పెరుగుతున్నందున ఆహారంలో మార్పులు చేసుకోవాలి’ అంటూ హెల్త్‌ ప్రొవైడర్‌ చెబుతున్న వివరాలతో సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాలన్నీ కొత్తగా వచ్చిన ఈయనకు ఎలా తెలిశాయబ్బా అనుకుని అదేమాట అడిగేశాడు. మీ హెల్త్‌ అకౌంటులో మీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. మీరు గతంలో ఏ జబ్బులకు గురయ్యారు, వాటికి ఏం ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు? మీకు ఏ మందులు బాగా పనిచేస్తాయి? ఇలాంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేయటం వల్ల సకాలంలో సరైన చికిత్స చేసేందుకు వీలవుతోంది అని ఆయన వివరించాడు. 
– సాక్షి ప్రతినిధి, అమరావతి

ఆరోగ్య రంగంలో వినూత్న పథకాలతో దూసుకుపోతున్న మన రాష్ట్రం డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ అమలుకు చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్ళి నిర్దిష్ట ఫార్మాట్‌లో వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఈ నమోదు ప్రక్రియ 66.8 శాతం పూర్తయింది. హెల్త్‌ మిషన్‌కు ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేయడంలోనూ ఏపీ ముందంజలో ఉంది. రాష్ట్రం నుంచి 69,683 హెల్త్‌ రికార్డులను డిజిటల్‌ హెల్త్‌ అకౌంట్స్‌తో అనుసంధానం చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఈ మిషన్‌ ద్వారా ప్రోగ్రామ్‌ మేనేజర్లు, నియంత్రణాధికారులు, అసొసియేషన్లు, ఎన్‌జీవోలు,  వైద్యులు, మందుల, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, హెల్త్‌ ఇన్సూరెన్సు కంపెనీలు, ల్యాబ్‌లు, మందుల దుకాణాలు, థెరపీ సెంటర్లు, హాస్పిటల్స్, క్లినిక్స్‌.. అన్నింటినీ అనుసంధానం చేయటం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించటం ముఖ్య ఉద్దేశం. 

డిజిటల్‌ హెల్త్‌ కార్డు 
ఆధార్‌ కార్డులానే ప్రతి ఒక్కరికీ 14 అంకెలతో ఉన్న డిజిటల్‌ హెల్త్‌ కార్డు ఇస్తారు. ఇది రెఫరల్‌ సిస్టంలో బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు పీహెచ్‌సీలో ఒక డాక్టర్‌ వద్దకు వెళ్లినప్పుడు టెస్టులు చేసి కొన్ని లక్షణాలు కనుక్కుంటారు. దీన్ని సాధారణంగా ప్రిస్క్రిప్షన్‌లో రాస్తారు. అదే హెల్త్‌ అకౌంటు ఉంటే.. అందులో వివరాలన్నీ పొందుపరుస్తారు. మరో డాక్టర్‌ వద్దకు వెళ్లినప్పుడు రక్త పరీక్షలు, స్కానింగ్, ఇతరత్రా పరీక్షలు మళ్లీ  చేయాల్సిన అవసరం ఉండదు. రోగి ఐడీ నంబర్‌ కంప్యూటర్‌లో నమోదు చేయగానే వివరాలన్నీ వస్తాయి. టెలి–కన్సల్టేషన్‌ ద్వారా ఆరోగ్య సేవలను పొందేందుకు సైతం ఇది అనుకూలం.

ఇతర వైద్య నిపుణుల సలహా సంప్రదింపులకు, బీమా క్లియరెన్సు, క్లెయిముల పరిష్కారం, అత్యవసర సమయాల్లో పేషెంటును ఆధునిక వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులకు తక్షణమే తరలించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఆరోగ్య డేటా, ల్యాబ్‌ రిపోర్టులు, చికిత్స వివరాలు, అందించిన ఆరోగ్య సదుపాయాలు, డిశ్చార్జి సమ్మరీలను అకౌంటులో ఎప్పటికప్పుడు జత చేస్తుంటారు. రోగి తన ఆరోగ్య సమాచారం రహస్యంగా ఉంచాలని భావిస్తే.. అకౌంటును బ్లాక్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అవసరమైనప్పుడు మళ్లీ ఓపెన్‌ చేసుకోవచ్చు. 


ఆస్పత్రుల అనుసంధానమూ ముఖ్యమే 
ప్రజలందరికీ హెల్త్‌ ఐడీలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను, అక్కడ పనిచేసే డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది, స్టాఫ్‌ నర్సులను కూడా డిజిటల్‌ మిషన్‌ పరిధిలోకి తేవాలి. ప్రతి డాక్టరుకూ ప్రత్యేక లాగిన్‌ ఐడీ ఉంటుంది. ఆ ఐడీ ద్వారా పేషెంట్‌ ఐడీని కంప్యూటర్‌లో నమోదు చేస్తే అతని ఆరోగ్య వివరాలు వస్తాయి.

మన రాష్ట్రంలో 13,346 ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌లో చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌ తర్వాత మన రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఆసుపత్రులు ఈ పథకంతో అనుసంధానమైనట్లు వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను పూర్తిస్థాయిలో దీని పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రంలో లేదా దేశంలో ఎక్కడికి వెళ్లినా రోగికి అత్యంత మెరుగైన, కచ్చితమైన వైద్యం సత్వరమే అందుతుంది. 

మన ఆరోగ్య విధానం ఇలా.. 
మన రాష్ట్రంలో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌.. అంటే ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రాథమిక వైద్యం లభిస్తుంది. అక్కడి నుంచి పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కు రెఫర్‌ చేస్తారు. పీహెచ్‌సీ నుంచి సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్య కేంద్రం)కు, అక్కడి నుంచి ఏరియా ఆస్పత్రికి, జిల్లా ఆస్పత్రికి.. చివరగా బోధనాసుపత్రికి రెఫరల్‌ సిస్టం పనిచేస్తుంది. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లో మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్, పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్, సీహెచ్‌సీలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా బృందం, ఏరియా ఆస్పత్రిలో వీటికి అదనంగా ఆర్థోపెడిక్స్, జనరల్‌ మెడిసిన్‌ వంటివి, జిల్లా ఆస్పత్రిలో సుమారు 16 రకాల స్పెషాలిటీ డాక్టర్లు, బోధనాసుపత్రిలో 32 విభాగాల స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు. రాష్ట్రంలో దాదాపు 95 శాతం మందికి ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్‌ ఉంది.  

హెల్త్‌ డేటాలో మనమే నం.1 
ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించటం, వాటిని డిజిటలైజ్‌ చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉంది. ఇదంతా మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతోనే సాధ్యమైంది. ప్రజల ఆరోగ్య వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటం వల్ల వారికి వైద్యం అందించే విషయంలో ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయం తెలుసు కాబట్టే మన ముఖ్యమంత్రి గ్రామగ్రామానికి హెల్త్‌ క్లినిక్‌లు తీసుకొచ్చారు. కొత్తగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలూ నిర్మిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే వైద్యానికి సంబంధించిన అన్ని దశలనూ పటిష్టపరుస్తున్నారు.

అన్ని ఆసుపత్రుల్లోనూ హెల్త్‌ ఐడీలు, రికార్డులు భద్రపరిచేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారానూ క్షేత్రస్థాయిలో అందరి హెల్త్‌ డేటా సేకరిస్తున్నారు. మనకు సరిపడా వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఉన్నారు. వీరందరి సహకారంతో మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్‌ చేయగలుగుతున్నాం. ఈ విభాగంలో మనమే ముందున్నామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అభినందనలు తెలిపింది. ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఈ విషయంలో మన ప్రభుత్వానికి అవార్డులు కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఎకనమిక్స్‌ టైమ్స్‌ ప్రకటించిన అవార్డు కూడా ఇలాంటిదే.
– విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement