చంద్రగిరి (తిరుపతి జిల్లా): తిరుచానూరులో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. వసంతోత్సవాలకు అవరోధాలు కలగకుండా సకల దేవతలను కోరుతూ మంగళవారం రాత్రి పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు అంకురార్పణ నిర్వహించారు.
అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. యాగశాలలో సిద్ధంగా ఉంచిన నవపాళికలలో పుట్టమన్ను నింపి, అందులో నవధాన్యాలు వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టడంతో వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల సందర్భంగా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యానవనంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, రాత్రి 7.30 గంటలకు తిరువీధోత్సవం నిర్వహించనున్నారు.
రేపు స్వర్ణరథోత్సవం
వసంతోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం 7.45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వసంతోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. వసంతోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు.
స్నపన తిరుమంజనం జరిగే మండపం చుట్టూ చల్లదనం కోసం వట్టివేళ్లతో తెరలను ఏర్పాటు చేశారు. భక్తులను ఆకట్టుకునేలా రంగోళి, అమ్మవారి చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలు, విద్యుత్ దీపాలంకరణతో ఉద్యానవనం నూతన శోభను సంతరించుకుంది. అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment