( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతులకు అనేక రకాలుగా మేలు చేస్తుంటే ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ మండిపడ్డారు. రైతులకు అవసరమైన అన్నిరకాల సేవలను సత్వరమే అందించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన రైతుభరోసా కేంద్రాలతో లక్షలాది మంది రైతులు లబ్ధిపొందుతున్నారని ఆయన తెలిపారు. ఆదివారం ‘ఈనాడు’లో ‘రైతుకు భరోసా ఏది’.. శీర్షికతో ప్రచురించిన వార్తను తీవ్రంగా తప్పుబట్టారు.
చదవండి: Cyclone Sitrang: తుపానుగా మారిన వాయుగుండం
ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా పలు దేశాలు రాష్ట్రంలోని ఆర్బీకేలను మోడల్‌గా తీసుకుని అమలుచేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేసి వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి నాణ్యమైన ఉత్పాదకాలు అందించడంతో పాటు రైతులకు అవసరమైన విజ్ఞానాన్ని వాటి ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. అలాగే ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
♦ఆర్బీకేల ద్వారా 42.22 లక్షల మంది రైతులకు రూ.157.97 కోట్ల విలువైన 23.74 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను, 18.28 లక్షల మంది రైతులకు రూ.744.25 కోట్ల విలువైన 6.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేశాం.
♦1.5 లక్షల మంది రైతులకు రూ.14.01 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను కూడా అందించాం.
♦ఎరువుల లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా ఖర్చుల కోసం ఒక్కో బస్తాకు రూ.20 ఆదా అవుతోంది. ఆ లెక్కన గడిచిన రెండేళ్లలో పంపిణీ చేసిన 6.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా ద్వారా రైతులకు రూ.27 కోట్లు ఆదా అయింది.
♦ఆర్బీకేల్లో 6,321 మంది వ్యవసాయ, 2,356 ఉద్యాన, 378 మంది పట్టు, 4 వేల మందికి పైగా పశు సంవర్థక, 756 మంది మత్స్య సహాయకులు పనిచేస్తుండగా, మిగిలిన పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా చర్యలు చేపట్టాం.
♦9,277 మంది బ్యాంకు సహాయకులను ఆర్బీకేలకు అనుసంధానం చేసి గ్రామస్థాయిలోనే ఎక్కడికక్కడ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం.
♦ఆర్బీకేల ద్వారా 1.59 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను 18.18 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం.
♦4.75 లక్షల కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను జారీచేసి రూ.3,595 కోట్ల రుణాలను పంపిణీ చేశాం.
♦34,550 మంది రైతులతో కమ్యూనిటీ హైరింగ్ గ్రూపులను ఏర్పాటుచేసి రూ.240.67 కోట్ల సబ్సిడీతో యంత్ర పరికరాలు అందించాం.
..ఇలాంటివెన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నా ‘ఈనాడు’ పత్రిక వాటిని పట్టించుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురించడం తగదని హరికిరణ్ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment