AP Budget Session 2021: CM YS Jagan Comments In Assembly - Sakshi
Sakshi News home page

ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్‌

Published Fri, May 21 2021 3:35 AM | Last Updated on Fri, May 21 2021 9:21 PM

AP Budget Session 2021: CM YS Jagan Comments In Assembly - Sakshi

చంద్రబాబు.. ఎల్లో మీడియా తరహాలో మేమూ విమర్శలు చేయగలం. కానీ సాధించేదేంటి? కోవిడ్‌ సమయంలో అందరూ కలిసి పని చేయాలి. వేలెత్తి చూపేకన్నా ఒకరినొకరం ప్రోత్సహించు కోవడం, ఒకరికి ఒకరం మద్దతు ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రజల మనోధైర్యాన్ని దెబ్బ తీసే వార్తలు రాయొద్దని ఎల్లో మీడియాను కోరుతున్నాం. నిలబడే ప్రాణాలను, ఆడే గుండెలను ఆపేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : ‘ప్రాణం విలువ తెలిసిన వాడిని కాబట్టే కోవిడ్‌ నుంచి ప్రజలను కాపాడేందుకు నిజాయితీగా పోరాడుతున్నాం. ఎంత ఖర్చు చేసైనా సరే కోవిడ్‌ వ్యాక్సిన్‌ తెప్పిస్తాం. ప్రజలందరికీ ఉచితంగా ఇప్పిస్తాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గురువారం ప్రకటించారు. ప్రభుత్వ కృషి ఫలితంగానే మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ చేరిందన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గురువారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన సూచన మేరకు కోవిడ్‌ మృతులకు సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రాణం విలువ బాగా తెలిసిన వాడిని కాబట్టే మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు గుండె పగిలిన కుటుంబాలకు అండగా ఉండేందుకు ఓదార్పు యాత్ర చేశానని చెప్పారు.

అధికారంలోకి రాగానే ప్రజలకు ప్రాణం పోసేలా ఆరోగ్య శ్రీని తీర్చిదిద్దానన్నారు. రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్లకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామని, వెయ్యి జబ్బులకే పరిమితమైన ఈ పథకాన్ని 2,400 జబ్బులకు అమలయ్యేలా విస్తరించామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 104, 108 వాహనానాలు 1180 కొనుగోలు చేశామన్నారు. వైద్య సదుపాయాలున్న ఈ వాహనాలు ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లోనే ‘కుయ్‌.. కుయ్‌.. కుయ్‌..’ అంటూ వచ్చేలా ప్రతి మండలానికి చేరవేశామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి 2 వేల మందికి హెల్త్‌ వర్కర్‌ను నియమించామని, ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు కడుతున్నామని తెలిపారు. అక్కడ 91 రకాల మందులు అందుబాటులో ఉంటాయని, 24 గంటలూ ఏఎన్‌ఎం ఉంటారని, ప్రతీ మండలానికి రెండు పీహెచ్‌సీలు.. ప్రతీ పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ఒక 104 వాహనం అనుసంధానమయ్యేలా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

 
ఆయువు నిలిపేలా ఆస్పత్రులు
ఊహించని విధంగా కోవిడ్‌ సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. గతేడాది మార్చిలో ఏపీలో తొలి కేసు నమోదైంది. అప్పట్లో కోవిడ్‌ పరీక్షల కోసం శాంపుల్స్‌ పూనెకు పంపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 150 లేబొరేటరీలు.. రోజూ లక్ష పరీక్షలు చేస్తున్నాయి. 
తొలి కోవిడ్‌ వేవ్‌ వచ్చినప్పుడు 261 ఆస్పత్రుల్లో కోవిడ్‌ రోగులకు వైద్య సేవలందిస్తే.. ఇవాళ 649కి పైగా ఆస్పత్రుల్లో వైద్య సేవలందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి  మహానగరం (టైర్‌ వన్‌ సీటీ) లేకుండా పోయింది. ఆదునిక వైద్యం టైర్‌వన్‌ సిటీల్లోనే లభిస్తోంది. ఈ వాస్తవాల్ని గ్రహించే నాడు–నేడు కార్యక్రమం ద్వారా అన్ని స్థాయిల ఆస్పత్రుల రూపు రేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నాం. 
కొత్తగా ప్రతి పార్లమెంట్‌ పరిధిలో బోధనాసుపత్రి, నర్సింగ్‌ కాలేజీ పెట్టబోతున్నాం. ప్రతి వ్యక్తి దగ్గరకు వైద్యాన్ని తీసుకెళ్లాలనే తపనతోనే ఇవన్నీ చేస్తున్నాం. మొదటి వేవ్‌ కరోనా సమయంలో 261 ఆస్పత్రుల్లో కోవిడ్‌ రోగులకు వైద్యం చేసేందుకు వీలుగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్నాం. ఇందులో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అక్కడ డాక్టర్లు, ఆక్సిజన్, మందులు అన్నీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 


649 ఆసుపత్రుల్లో 47,285 బెడ్స్‌ 
రెండో వేవ్‌లో 649 ఆస్పత్రులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. గత సెప్టెంబర్‌ నాటికి ప్రభుత్వం తీసుకున్న 261 ఆస్పత్రుల్లో 34,441 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 649 ఆసుపత్రుల్లో 47,285 బెడ్స్‌ అందుబాటులోకి తెచ్చాం. కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌లోనూ మెరుగైన వైద్యం, నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. మరో 52,471 బెడ్స్‌ అందుబాటులోకి తెచ్చాం. 
కోవిడ్‌ సెంటర్లలో 18 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేసి, అక్కడ పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం. కోవిడ్‌ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి, ఉచితంగా వైద్యం అందిస్తున్న రాష్ట్రం మనదేనేమో. ప్రతిరోజు 25 వేల మంది ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం పొందుతున్నారు.  


14 నెలల్లో రూ.2,229 కోట్లు ఖర్చు
గడిచిన 14 నెలల కాలంలోనే కోవిడ్‌ కోసం రూ.2,229 కోట్లు ఖర్చు చేశాం. బ్లాక్‌ ఫంగస్‌ వస్తోందని తెలిసిన వెంటనే ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది లేకుండా.. దాన్నీ ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇందుకోసం ఈ నెల 18వ తేదీన 17 ఆస్పత్రులను గుర్తించాం. కోవిడ్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు స్పెషలిస్టులు, డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లను 18,270 మందిని విధుల్లోకి దించాం.
104 నంబర్‌కు ఫోన్‌ చేస్తే కోవిడ్‌ సమాచారం ఇచ్చేలా చేశాం. ఈ నంబర్‌కు ఈ నెల 16వ తేదీ నాటికి 3.12 లక్షల కాల్స్‌ వచ్చాయి. ఇందులో 60,634 మందిని ఆస్పత్రుల్లో చేర్చారు. మరో 46,421 మందికి పరీక్షలు చేశారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్‌ రోగులకు.. 680 మంది స్పెషలిస్టులతో కలిపి 3,991 మంది డాక్టర్లు టెలీ మెడిసిన్‌ వైద్యం అందిస్తున్నారు.


ఆక్సిజన్‌ కోసం అనుక్షణం పరుగు
రాష్ట్రానికి ఆక్సిజన్‌ తెప్పించే ప్రక్రియలో ఏమాత్రం ఆలస్యం కాకూడదని.. రోజుకు నాలుగైదు ట్యాంకులను ఒరిస్సాకు ఎయిర్‌ లిఫ్ట్‌ చేస్తున్నాం. విదేశాల నుంచి ఆక్సిజన్, క్రయోజెనిక్‌ ట్యాంకర్లను తెప్పిస్తున్నాం. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్స్‌ ద్వారాను తెప్పిస్తున్నాం. ఆక్సిజన్‌ ఎన్ని వందల కిలోమీటర్లలో దొరుకుతుందన్నా.. ఎంత ఖర్చుకైనా సిద్ధపడి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాం. 
రాబోయే తరాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో 53 ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు నాంది పలికాం. మరో 50 క్రయోజెనిక్‌ ట్యాంకర్లు తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్న వాళ్లకు 5 నుంచి 10 లీటర్ల ఆక్సిజన్‌ అందించేలా 18,500 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల కొనుగోలుకు సిద్ధమయ్యాం. అవి కూడా ఈ నెలాఖరులో వస్తాయి.
10 వేల డి టైప్‌ సిలెండర్ల కొనుగోలుకు రూ.309 కోట్లతో ఆర్డర్‌ ఇచ్చాం. గ్రామ స్థాయి ఆశ వర్కర్ల దగ్గర్నుంచి నర్సులు, డాక్టర్లు, శానిటేషన్‌ పనివాళ్లు, కలెక్టర్లు అందరూ కష్టపడి పని చేస్తున్నారు కాబట్టే కోవిడ్‌ మరణాలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలో ఏపీ ఒకటి అని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. వీరందరికీ హ్యాట్సాఫ్‌.


అందరికీ లబ్ధి
బీసీలను బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా చేసేందుకు కట్టుబడి ఉన్నాం. రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, మధ్య తరగతి వర్గాల కోసం నిలబడ్డాం. సంక్షేమానికి రూ.93,708 కోట్లు ఖర్చు చేశాం. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా పంపాం. 
మరో రూ.31,714 కోట్లు పరోక్ష లబ్ధి ద్వారా ఇవ్వడం జరిగింది. మొత్తంగా రూ.1.25 లక్షల కోట్లు ప్రజలకు అందించాం. 
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని నేను భావిస్తాను. మా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఇదే చెబుతాను. మనమంతా ప్రజలకు సేవకులం అని గుర్తు పెట్టుకుని పని చేయాలి.

అనుభవం లేకున్నా.. హామీలన్నీ పూర్తి
నాది పెద్ద వయసు కాకపోవచ్చు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం లేకపోవచ్చు. కానీ, చిత్తశుద్ధితో, నిజాయితీగా పని చేస్తున్నా. కోవిడ్‌ కష్టాల్లోనూ 129 వాగ్దానాల్లో 107 పూర్తిగా అమలు చేశాం. మరో 14 వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 8 అమలు చేయాల్సి ఉంది. 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో 94.5 శాతం హామీలు పూర్తి చేశాం. పాలనలో కులం, మతం, రాజకీయం, వర్గం చూడలేదు. రాబోయే తరానికి మంచి జరగాలని చూస్తున్నాం.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశాం. శిథిలావస్తలో ఉన్న స్కూళ్ల రూపురేఖలు మార్చాం. మన ప్రభుత్వ స్కూళ్లలోనే ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చాం. ఇంగ్లిష్‌ మీడియం చదువులు, సీబీఎస్‌ఈ సిలబస్, గోరుముద్ద, ఇలా అనేక పథకాలతో విద్యా రంగం రూపురేఖలు మారుస్తున్నాం. అన్ని పథకాలలో అమ్మ ఒడి కూడా గొప్పది. 
అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, సున్నా వడ్డీ పథకం, 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లు కట్టించే కార్యక్రమం, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింప చేస్తూ చట్టం చేయడం.. ఇవన్నీ  రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ ఎదిగేందుకు తోడ్పడతాయి. ఇదీ అభివృద్ధి అంటే. పైసా లంచం ఇవ్వకుండా, సిఫార్సులు లేకుండా నేరుగా ఇంటి గడప వద్దకే వచ్చి, తలుపు తట్టి పథకాలను వర్తింప చేస్తుంటే దాన్ని అభివృద్ధి అంటారు. 
గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామంలోనే వార్డు, గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాము. ఆ గ్రామంలోనే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం. ఆ ఇళ్ల నుంచే వలంటీర్‌ను ఎంపిక చేసి, వారికి తోడుగా ఉండే వ్యవస్థను తీసుకువచ్చాం. 
62 శాతం మంది వ్యవసాయంపై బతికే రైతు బతుకు మార్చకుండా.. నాలుగు బిల్డింగ్‌లు కడితే అది అభివృద్ధి కాదు. అందుకే రైతుల చేయి పట్టుకుని అడుగులు వేస్తూ, విత్తనం మొదలు పంట అమ్ముకునే వరకు రైతుకు తోడుగా ఉంటున్నాం. 
అందుకే పంచాయతీ, మున్సిపల్‌.. తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దీవించారు. కుట్రలు చేసిన వాళ్లు పంచాయతీ కార్యాలయాల మీద నీలం, ఆకుపచ్చ రంగులు తుడిచి వేయగలిగారు కానీ, జనం గుండెల్లోని రంగులను మాత్రం తుడిచేయలేకపోయారు. చివరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు కూడా మొహం చెల్లని విధంగా ప్రతిపక్షాన్ని ప్రజలు తుడిచేశారు.

వ్యాక్సిన్‌ వాస్తవం ఇదీ
వ్యాక్సినేషన్‌పై కొంతమంది పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో 45 ఏళ్లు పైబడ్డ వాళ్లు 26 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 52 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ కావాలి. 18–45 ఏళ్ల మధ్య వాళ్లు 60 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 120 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ కావాలి. మొత్తం 172 కోట్ల డోస్‌లు అవసరం. 
కానీ భారత్‌లో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్‌ నెలకు 7 కోట్ల డోస్‌లు మాత్రమే. ఇందులో సీరం ఇన్‌స్టిట్యూట్‌ కోవీషీల్డ్‌ 6 కోట్ల డోసులు, భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ కోటి డోసులను తయారు చేస్తున్నాయి.   అందుకే ఇప్పటివరకు 18.44 (11 శాతం లోపు) కోట్ల మందికే వ్యాక్సినేషన్‌ జరిగింది. ఏపీలో 45 ఏళ్లు నిండిన వాళ్లు.. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో కలిపితే 1.48 కోట్లు ఉన్నారు. వీరికి రెండు డోసులు వేయడానికి 3 కోట్ల డోస్‌లు కావాలి. 18–45 ఏళ్ల లోపు వాళ్లు 2 కోట్ల మంది ఉన్నారు. వీళ్లకు 4 కోట్ల డోస్‌లు కావాలి. మొత్తంగా ఏపీకి 7 కోట్ల డోస్‌లు కావాలి. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చింది 76,29,580 డోసులు..అంటే 11 %లోపు. ూ    వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదంటూ, డబ్బులు ఖర్చు పెట్టడం లేదని రాజకీయ నిందలేçస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు కొడుకు వియ్యంకుడిదే. చంద్రబాబుకూ వాళ్లు బంధువులే. ఆ సంస్థ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో తెలిసి కూడా ఆరోపణలు చేయడం ఏమిటి? ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేస్తుంటే బాధేస్తోంది. 


పరిష్కారం వ్యాక్సినే
ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాక్సిన్‌ కోసం గ్లోబల్‌ టెండర్స్‌కు వెళ్లింది. జూన్‌ 3న బిడ్స్‌ వస్తాయి. గ్లోబల్‌ టెండర్లకు వెళ్లిన రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉంటుంది. కోవిడ్‌ను అడ్డుకునే పరిష్కారం వ్యాక్సినేషనే. గ్లోబల్‌ టెండర్లలో కంపెనీలు ముందుకు వస్తాయని, కేంద్రం ఆమోదం తెలుపుతుందని ఆశిస్తున్నాం. 

ఇదీ మా సంక్షేమ క్యాలెండర్‌
ఏప్రిల్‌ 2021 
జగనన్న వసతి దీవెన మొదటి విడత 
జగనన్న విద్యా దీవెన మొదటి విడత 
రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ 
(2019 రబీ)
పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ చెల్లింపులు 

మే 2021 
వైఎస్సార్‌ రైతు భరోసా మొదటి విడత. దాదాపు 50 లక్షల రైతులకు ఇచ్చాం.
మత్స్యకార భరోసా (వేట నిషేధ సబ్సిడీ, డీజిల్‌ సబ్సిడీ) ఇచ్చాం. 
వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా (2020 ఖరీఫ్‌) మే 25న ఇవ్వబోతున్నాం.


జూన్‌ 2021 
జగనన్న తోడు తొలి విడత
వైఎస్సార్‌ వాహనమిత్ర రెండో విడత
వైఎస్సార్‌ చేయూత మూడో విడత చెల్లింపులు 
జూన్‌ 8న జగనన్న తోడు బ్యాలెన్స్‌ ఇవ్వబోతున్నాం. ప్రతి మంగళవారం ఒక్కో కార్యక్రమం. జూన్‌ 8న జగనన్న తోడు, 15న వాహనమిత్ర, 22న చేయూత.


జూలై – 2021 
జగనన్న విద్యా దీవెన రెండో విడత 
వైఎస్సార్‌ కాపు నేస్తం 
విద్యా కానుక  


ఆగస్టు 2021 
రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు (2020 ఖరీఫ్‌).
ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్‌ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు.
వైఎస్సార్‌ నేతన్న నేస్తం.
అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు. 


సెప్టెంబర్‌ 2021 
వైయస్సార్‌ ఆసరా 


అక్టోబర్‌ 2021 
వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత 
జగనన్న చేదోడు (రజకులు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులు)


నవంబర్‌ 2021 
వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం. ఇది ఈ ఏడాది అమలు చేసే కొత్త పథకం. ఏటా రూ.15 వేలు చొప్పున సహాయం. అగ్ర వర్ణాల్లోని 45 ఏళ్లు దాటిన పేద అక్కలకు సహాయం.


డిసెంబర్‌ 2021 
జగనన్న వసతి దీవెన రెండో విడత 
జగనన్న విద్యా దీవెన మూడో విడత 
వైయస్సార్‌ లా నేస్తం 


జనవరి 2022 
పెన్షన్‌ నగదు పెంపు. ఈ నెల నుంచి నెలకు రూ.2,500. 
వైఎస్సార్‌ రైతు భరోసా మూడో విడత 
జగనన్న అమ్మ ఒడి 


ఫిబ్రవరి 2022 
జగనన్న విద్యా దీవెన నాలుగో విడత   


 

చదవండి: AP Budget 2021: ఏపీ బడ్జెట్‌ హైలైట్స్‌ ఇవే.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement