సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి దీనికి సంబంధించిన నోటీసులను అందజేశారు. 41 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్ (సీఆర్‌పీసీ) కింద నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి.
సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపుకు సంబంధించి చంద్రబాబుపై అధికారులు కేసు నమోదు చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్‌పూలింగ్‌లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు సీఐడీ అధికారులు. వాస్తవంగా దళితులకు కేటాయించిన ఈ భూములను రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల కొనుగోళ్లను వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌లో క్రమబద్దీకరణ చేయడానికి అనుమతించారు. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను, సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి.
రాజధాని అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అన్నీ ఇన్నీకావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు, అన్యాయం అయిపోయారు. అధికారపార్టీనేతల లాఘవానికి వీళ్లు బలైపోయారు. ఒక పథకం ప్రకారం చవకగా తమ భూములను అమ్ముకునేలా చేశారు. రాజధాని ప్రాంతంలో అసైన్ఢ్ భూములకు ఎలాంటి ప్లాట్లు రావని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. అసైన్డ్ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగారు. బలవంతంగా వాటిని కొనుగోలుచేశారు.
దీనికోసం సబ్‌రిజిస్ట్రార్లపై అధికారపార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తీసుకు వచ్చారు.
తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్నవాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీఓలు జారీచేశారు. ఇలా అసైన్డ్‌భూములను కొనుగోలుచేసి, వాటిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉండటం విశేషం. అసైన్డ్‌భూములను తక్కువకు కొనుగోలుచేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైనవారు ఉన్నట్టు రికార్డుల్లో వెలుగుచూసింది.
నారాలోకేష్ సన్నిహితుడు కొల్లి శివారం 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారాలోకేష్ సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను చేజిక్కించుకున్నారు. నారాలోకేష్ వద్ద ఉండే మరో వ్యక్తి బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలను అసైన్డ్ దారులనుంచి తక్కువకే లాక్కున్నారు. మొత్తంగా 338. 887 ఎకరాల అసైన్డ్ భూములను ఈ రకంగా తక్కువకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు.
Comments
Please login to add a commentAdd a comment