సాక్షి, అమరావతి: సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ఏపీ రవాణా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకే సినిమా టికెట్లను విక్రయించడం, నిర్దేశిత ఆటలతోనే సినిమాలు ప్రదర్శించడం, పన్ను ఎగవేతను అడ్డుకోవడమే ఈ విధానం లక్ష్యమన్నారు.
ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు ఉద్దేశించిన ‘ఏపీ సినిమాల (నియంత్రణ– సవరణ) బిల్లు’ను అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకు ముందు చర్చ సందర్భంగా బిల్లు ఉద్దేశాలను మంత్రి పేర్ని నాని వివరించారు. ప్రేక్షకుల ఆదరణ ను కొందరు అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని ప్రస్తావించారు. ఒక్కో టిక్కెట్‌పై ఇష్టారాజ్యంగా రూ.300 నుంచి రూ.500 వరకు అధికంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. రోజుకు 4 ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సినా చట్ట విరుద్ధంగా 6 – 8 షోలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఇక ఆటలు సాగవు..
చిత్ర పరిశ్రమలో కొందరు మాకు ఎదురు ఉండకూడదు.. ఏచట్టాలూ మమ్మల్ని ఆపలేవు అన్నట్లు వ్యవహరిస్తున్నారని మంత్రి నాని పేర్కొన్నారు. ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రభుత్వం ఆన్‌లైన్ విధానం ద్వారా టిక్కెట్లు విక్రయించే వ్యవస్థ తేవాలని నిర్ణయిం చిందన్నారు. బస్సులు, రైలు టికెట్ల మాదిరిగా సినిమా టిక్కెట్లను కూడా మొబైల్ ఫోన్లు, ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని వివరించారు.
గంట ముందు థియేటర్‌లో కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అయితే అక్కడ కూడా ఆన్‌లైన్ విధానంలోనే థియేటర్ల యజమానులు టిక్కెట్లు విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు ఆన్‌లైన్ విధానాన్ని సమర్థిస్తున్నారని మంత్రి తెలిపారు. కాగా, సమాజ హితం కోసం స్వచ్ఛంద సంస్థలు థియేటర్ యాజమాన్యాలతో కలసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే బెనిఫిట్ షోలకు అవకాశం ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment