సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే అంశంపై ఉన్నత స్థాయి కమిటీతో అధ్యయనం చేయిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ ప్రతినిధులతో చర్చించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఇటీవల తెలుగు సినీ రంగ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌ను కలిసినప్పుడు పలు అంశాలపై చర్చించారని చెప్పారు.
ఇందులో భాగంగా సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే అంశాన్ని పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారన్నారు. ఈ మేరకు త్వరలోనే సీఎం సమక్షంలో సినీ రంగ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేలా సీఎం జగన్ అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఇందులో భాగంగా కోవిడ్ సమయంలో పలు రాయితీలను కూడా ప్రకటించారని గుర్తు చేశారు. ఆన్‌లైన్ సినిమా టికెట్ల విక్రయంతో పన్ను ఎగవేతకు, బాక్ల్ టికెట్ దందాకు చెక్ పెట్టొచ్చన్నారు. అనధికార షోలు, టికెట్ ధర నియంత్రణతో ప్రజలు తక్కువ రేటుకే వినోదం అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని థియేటర్లను అనుసంధానం చేస్తూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నామన్నారు.
ప్రతిపక్షాలది రాద్ధాంతం..
సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలన్న ప్రభుత్వ ఆలోచనపై ప్రతిపక్షంలో మేధావులుగా భావించేవారు కూడా నానా రాద్ధాంతం చేస్తుండటంపై పేర్ని నాని మండిపడ్డారు. ఈ అంశం గత రెండు దశాబ్దాలుగా నడుస్తోందన్నారు. 2002లోనే ఆన్‌లైన్ సినిమా టికెట్లపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2003లో విజయవాడకు చెందిన విశ్వ మీడియా ఎంటర్‌ప్రైజెస్, 2004లో విశాఖకు చెందిన గెలాక్సీ ఎంటర్‌ప్రైజెస్‌లు ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయానికి ముందుకు వచ్చాయన్నారు. 2006లో అప్పటి ప్రభుత్వం ఆన్‌లైన్ టికెట్ల విక్రయంపై గెజిట్ కూడా విడుదల చేసిందని చెప్పారు. 2009లో గెలాక్సీ ఎంటర్‌ప్రైజెస్‌కు అనుమతి ఇచ్చినా ఈ ప్రక్రియ మొదలుకాలేదన్నారు.
ఈ అంశంపై 2017లో టీడీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని నియమించిందని గుర్తు చేశారు. మళ్లీ అదే ఏడాది హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (ఎఫ్‌డీసీ) ఎండీ, తెలుగు సినీ పరిశ్రమ చైర్మన్, తదితరులుతో కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. 2018లో కమిటీ ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. తమ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 22న ఆర్థికశాఖ కార్యదర్శి, ఎఫ్‌డీసీ చైర్మన్, ఏపీటీఎస్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాక కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ప్రభుత్వం ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకం చేపట్టాలని భావిస్తోందన్నారు. కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం సబబు కాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment