సాక్షి, అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, తక్షణం ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బుధవారం వేర్వేరుగా లేఖలు రాశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి తక్షణం రూ. వెయ్యి కోట్ల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. నష్టాన్ని అంచనా వేయడానికి త్వరగా ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌ను (కేంద్ర బృందాన్ని) రాష్ట్రానికి పంపాల్సిందిగా ఆయన కోరారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాథమిక అంచనా మేరకు వివిధ రంగాలకు రూ.6,054.29 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
196 మండలాల్లోని 1,402 గ్రామాలు, నాలుగు పట్టణాలు వరదలతో మునిగి పోయాయని, 1.43 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. 42,299 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని వివరించారు. బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి, దెబ్బ తిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి ఉదారంగా ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని విన్నవించారు. ఈ సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ఆ లేఖల్లో సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
225.5 శాతం అధిక వర్షపాతం
►రాష్ట్రంలో నాలుగు దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు నాలుగు రాయలసీమ జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 3.2 సెంటీమీటర్లకు గాను 11.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నవంబర్ 13వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య వర్ష ప్రభావిత జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 225.5 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
►చాలా చోట్ల ఒక్క రోజులోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నవంబర్ 19వ తేదీన అత్యధికంగా చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలో 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలంలో 19.3 సెం.మీ, అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో 17.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.
1,402 గ్రామాల్లో వరదలు
►టెంపుల్ టౌన్ తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లి, రాజంపేట తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమై సాధారణ జన జీవనానికి అంతరాయం కలిగింది. ప్రభావిత జిల్లాల్లో వరదలు ఎక్కువగా ఉండడంతో 17 ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, రెండు హెలికాప్టర్ల ద్వారా సహాయ రెస్క్యూ ఆపరేషన్లను చేపట్టాల్సి వచ్చింది.
►చాలా ముందుగా సహాయ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్ కానిస్టేబుల్ సహా 40 మంది మరణించారు. మరో 25 మంది గల్లంతయ్యారు. హైవేలపై భారీ వాహనాలు, బస్సులు, లారీలు నిలిచిపోయాయి.
►196 మండలాల్లోని 1,402 గ్రామాలు, 4 పట్టణాలు భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమయ్యాయి. 324 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 69,616 మందికి వసతి కల్పించాం. ఇప్పటికీ సహాయ శిబిరాలు కొనసాగుతున్నాయి.
రహదారులు, జల వనరులు, విద్యుత్ రంగానికి భారీ నష్టం
►వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల హైవేలు, నీటి పారుదల ట్యాంకులు, కాలువలు దెబ్బ తిన్నాయి. బుగ్గవంక వాగుకు భారీగా వరద నీరు చేరడంతో కడప నగరంలో పరిస్థితి అధ్వానంగా మారింది.
►పెన్నార్ బేసిన్‌లోని సోమశిల జలాశయానికి 48 గంటల్లో 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరడంతో నెల్లూరు నగరం, కోవూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలోని అన్నమయ్య రిజర్వాయర్‌కు గండి పడడంతో నందలూరు–హస్తవరం మధ్య రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతినింది. జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
►నెల్లూరు జిల్లాలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహించడంతో కోవూరు–నెల్లూరు మధ్య రహదారి నీటిలో మునిగిపోయింది. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బ తినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్న పంటల వ్యయంతో పాటు మౌలిక సదుపాయాల నష్టం రూ. 6,054.29 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేశాం.
► 1.43 లక్షల హెక్టార్లలో వరి, బెంగాల్ కందులు, పత్తి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, చెరకు పంటలకు నష్టం వాటిల్లింది. 42,299 హెక్టార్లలో అరటి, బొప్పాయి, పసుపు, ఉల్లి, కూరగాయలు మొదలైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment