కోస్తా తీరంలో పారిశ్రామిక కెరటాలు | AP Development With Harbors, Ports, Industrial Parks | Sakshi
Sakshi News home page

కోస్తా తీరంలో పారిశ్రామిక కెరటాలు

Published Sun, Mar 13 2022 2:39 AM | Last Updated on Sun, Mar 13 2022 8:31 AM

AP Development With Harbors, Ports, Industrial Parks - Sakshi

సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని వ్యవసాయ, పోర్టు ఆధారిత పరిశ్రమలను ఆకర్షించేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. కోస్తాంధ్ర పరిధిలోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లాలు, సముద్ర తీర ప్రాంతాలు కావడంతో అందుకు అనుగుణంగా పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లాలో పండే పంటల ఆధారంగా ప్రతి నియోజకవర్గ పరిధిలో సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న 3 పోర్టులకు అదనంగా మరో రెండు పోర్టులు, ఏడు ఫిషింగ్‌ హార్బర్లను అభివృద్ధి చేస్తోంది. పోర్టులకు సమీపంలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రెండు భారీ పారిశ్రామిక పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 

రూ.40 వేల కోట్లకుపైగా పెట్టుబడులు... 
సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోస్తాంధ్ర జిల్లాల్లో గణనీయమైన పారిశ్రామిక పురోగతి కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇప్పటికే రూ.6,008 కోట్ల విలువైన పెట్టబడులు కార్యరూపం దాల్చి ఉత్పత్తి ప్రారంభించగా మరో రూ.34,532 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో 18 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించిన వాటిలో కిసాన్‌ క్రాఫ్ట్, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, అశోక్‌ లేలాండ్, తారకేశ్వర టెక్స్‌టైల్స్, వెంకటేశ్వర పేపర్‌ ప్రోడక్ట్స్‌ తదితర సంస్థలున్నాయి. ఈ 18 యూనిట్లు రూ.2,971 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా 11,181 మందికి ఉపాధి లభించింది. ఇదే సమయంలో 13,134 ఎంఎంఎస్‌ఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా రూ.3,037 కోట్ల పెట్టుబడులతో పాటు 78,905 మందికి ఉపాధి లభించింది.

భారీ సంస్థల ఆసక్తి
కోస్తాంధ్రాలో పోర్టు ఆధారిత వాణిజ్యం కోసం భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. సుమారు 35 యూనిట్లు రూ.34,532 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. వివిధ దశల్లో ఉన్న యూనిట్లు అందుబాటులోకి వస్తే 72,319 మందికి ఉపాధి లభిస్తుంది. జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌ నెల్లూరు జిల్లాలో రూ.7,500 కోట్లతో ఉక్కు తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,404.36 కోట్లతో శ్రావణ్‌ షిప్పింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్, రూ.2,700 కోట్లతో గ్రాసిం ఇండస్ట్రీస్, నెల్లూరు జిల్లాలో రూ.7,942 కోట్లతో ఏపీ పవర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ, కాకినాడ వద్ద రూ.5,000 కోట్లతో కృష్ణా  గోదావరి ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ లాంటి భారీ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కాకుండా భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ ఒక్కటే తూర్పు గోదావరి జిల్లాలో రూ.78,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.

కోస్తాంధ్ర అభివృద్ధి ప్రణాళిక ఇలా..
పంట ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఆహార రంగంలో ప్రముఖ సంస్థలతో కలసి ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద రూ.100 కోట్లతో  అభివృద్ధి చేసిన మెగా ఫుడ్‌ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనిపక్కనే ఏపీఐఐసీ కూడా మరో 50 ఎకరాల్లో ఫుడ్‌ పార్కును అభివృద్ధి చేసింది. ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేసుకున్న సంస్థలు మెగా ఫుడ్‌ పార్కులోని కోర్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. 

క్రిస్‌ సిటీ.. నిమ్జ్‌..
విశాఖ చెన్నై కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద తొలిదశలో 2,500 ఎకరాల్లో రూ.1,500 కోట్లతో క్రిస్‌ సిటీ పేరుతో పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం టెండర్ల స్థాయిలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే పనులు ప్రారంభించనుంది. ప్రకాశం జిల్లాలో 14,390 ఎకరాల్లో నిమ్జ్‌ను అభివృద్ధి చేయడంతో పాటు దొనకొండ వద్ద డిఫెన్స్, ఏరో స్పేస్‌ యూనిట్లను నెలకొల్పేలా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నారు. సుమారు రూ.3,820 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్ల అభివృద్ధితోపాటు  మచిలీపట్నంలో రూ.4,000 కోట్లతో, రామాయపట్నంలో రూ.3,650 కోట్లతో పోర్టులను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే రామాయపట్నం టెండర్లు ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. మచిలీపట్నం పోర్టుకు మారిటైమ్‌ బోర్డు టెండర్లు పిలుస్తోంది.

ఇంత భారీ వ్యయం ఇదే తొలిసారి
రాష్ట్రంలోని తీరప్రాంతాన్ని వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల అభివృద్ధికి సుమారు రూ.25,000 కోట్లు వ్యయం చేయనుంది. ఈ స్థాయిలో ఓ రాష్ట్రం ఇంత భారీ వ్యయం చేయనుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే 4 ఫిషింగ్‌ హార్బర్ల పనులు మొదలు కాగా మరో 5 హార్బర్లకు టెండర్లు పిలిచాం. ఏపీ మారిటైమ్‌ బోర్డు నిర్మిస్తున్న 9 ఫిషింగ్‌ హార్బర్లు, 3 పోర్టులు అందుబాటులోకి వస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది.    – మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్‌ బోర్డు

ప్రభుత్వ ప్రోత్సాహంతో..
సాగు ఖర్చులను తగ్గించేలా పరికరాల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో నెల్లూరు జిల్లాలో కిసాన్‌ క్రాఫ్ట్‌ యూనిట్‌ ఏర్పాటు చేశాం. ఏటా 75,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటైంది. ట్రెంచింగ్, సీడింగ్, ఇరిగేటింగ్, హార్వెస్టింగ్‌ లాంటి పలు పరికరాలను అమర్చుకొని వినియోగించుకునేలా ఇంటర్‌ కల్టివేటర్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటి వరకు వీటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుండగా ఇక ఆ అవసరం ఉండదు. తయారీ యూనిట్‌తో పాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మేం అభివృద్ధి చేసిన ఉత్పత్తులకు 12 పేటెంట్లు లభించాయి.     – అంకిత్‌ చిటాలియా, సీఈవో, కిసాన్‌ క్రాఫ్ట్‌

పెను మార్పులు..
తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం తర్వాత రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయి. హార్బర్ల నిర్మాణం ద్వారా మత్స్యకార మహిళలకు నిజమైన చేయూత అందుతుంది.
– ప్రసాదరావు, ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఎకనామిక్స్‌ ఆచార్యులు

మాట నిలబెట్టుకున్నారు..
ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా మత్స్యకార సమ్మేళనంలో మాకు ఇచ్చిన మాట మేరకు హార్బర్ల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. మినీ హార్బర్‌ కోరితే ఏకంగా మేజర్‌ హార్బర్‌ చేపట్టడం మత్స్యకారుల అభ్యున్నతిపై ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. 50 వేల మత్స్యకార కుటుంబాలకు మేలు జరుగుతుంది.    
– కారే శ్రీనివాసరావు, మత్స్యకార నాయకుడు, తూ.గో.

వలస వెళ్లక్కర్లేదు
కుటుంబ పోషణ కోసం కర్నాటక, గుజరాత్‌లోని ఫిషింగ్‌ హార్బర్లలో చేపల బోట్లలో కూలీలుగా పని చేస్తున్నాం. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం ద్వారా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు.    
– కొమారి రాజు, మత్స్యకారుడు, తుమ్మలపెంట, కావలి, నెల్లూరు జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement