ఎంసెట్ ఫలితాల సీడీలను విడుదల చేస్తున్న మంత్రి సురేష్, ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్–2020 ఫలితాలను శనివారం విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఎంసెట్‌కు 2,73,588 మంది దరఖాస్తు చేయగా 2,32,811 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,02,682 (87.05 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,56,953 మందిలో 1,33,066 (84.78 శాతం), అగ్రి మెడికల్‌లో 75,858లో 69,616 (91.77 శాతం) ఉత్తీర్ణులయ్యారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ ఎంసెట్‌ను గత నెల 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి ఈసారి రెండోసారి ఎంసెట్ నిర్వహించారు.
బాలికలదే పైచేయి
సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా ఉత్తీర్ణతా శాతాల పరంగా ఈసారి ఎంసెట్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఎంసెట్‌లో 1,13,618 మంది బాలికలు పరీక్ష రాయగా 1,01,232 (89.09 శాతం), 1,19,193 మంది బాలురుగాను 1,01,450 (85.11 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్ విభాగాల్లోనూ బాలికలే అగ్రస్థానంలో ఉన్నారు. ఇంజనీరింగ్‌లో బాలికలు 62,395 మందికి గాను 54,036 (84.60 శాతం) మంది, బాలురు 94,558 మందికి గాను 79,030 (83.57 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్‌లో బాలికలు 51,223 మందిలో 47,196 (92.13 శాతం) మంది, 24,635 మంది బాలురలో 22,420 (91 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో విశాఖ విద్యార్థి వావిలపల్లి సాయినాథ్‌కు, అగ్రి, మెడికల్ విభాగంలో గుంటూరుకు చెందిన గుత్తి చైతన్య సింధు మొదటి ర్యాంకులు సాధించారు. టాప్ టెన్‌ర్యాంకుల్లో ఇంజనీరింగ్‌లో 5, అగ్రి మెడికల్‌లో 2 ర్యాంకులు తెలంగాణ విద్యార్థులు సాధించారు. టాప్ ర్యాంకుల్లో బాలురే అత్యధికంగా దక్కించుకున్నారు.
ఇంజనీరింగ్ ఫీజులపై త్వరలో ఉత్తర్వులు: మంత్రి సురేష్
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులపై ఉన్నత విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని, దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించనుందని మంత్రి సురేష్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వంటి విపత్కర సమయంలోనూ ఉన్నత విద్యామండలి, కాకినాడ జేఎన్‌టీయూ అధికారులు ఎంసెట్‌ను సజావుగా నిర్వహించి ఫలితాలను విడుదల చేశారని చెప్పారు. ఫీజుల ఖరారు అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటిస్తుందన్నారు. నవంబర్ 1 నుంచి తరగతులను ప్రారంభిస్తామన్నారు. అకడమిక్ సమయాన్ని కోల్పోతున్నందున సిలబస్‌ను సర్దుబాటు చేస్తామని చెప్పారు. ఎంసెట్‌లో 2019లో 71.61 శాతం ఉత్తీర్ణత ఉండగా ఈసారి 87.05 శాతానికి పెరిగిందన్నారు.
ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 14నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకొనేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. నవంబర్ 2 నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లను ప్రారంభించాలని భావిస్తున్నామని వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఫలితాల విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యానియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు, ప్రొఫెసర్ టి.లక్ష్మమ్మ, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్, మండలి సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సప్లిమెంటరీ విద్యార్థులకు రెండో జాబితాలో ర్యాంకులు
ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఎంసెంట్ ర్యాంకులను ఖరారు చేశారు. ఆ పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారికి రెండో జాబితాలో ర్యాంకులను ప్రకటించనున్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీ తదితర బోర్డుల విద్యార్థులు తమ 12వ తరగతి ధ్రువపత్రాలను సమర్పించాలని ఉన్నత విద్యామండలి సూచించింది. దీనికి సంబంధించి ప్రత్యేక ప్రొఫార్మా విడుదల చేసింది. దాన్ని అనుసరించి మార్కులు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వారికి ఎంసెట్‌లో వచ్చిన మార్కులను ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. గతంలో మొత్తం విద్యార్థులకు ఒకేసారి ర్యాంకులు ప్రకటించే వారు. అయితే ఈసారి కోవిడ్ కారణంగా అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు జరగకపోవడం వల్ల వారందరూ పాస్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యార్థులంతా ఇంటర్ ఉత్తీర్ణులైనా వారు ఎంసెట్‌లో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకొని ర్యాంకును ఇస్తారు. అయితే ఇప్పుడు ప్రకటించిన ర్యాంకులు యథాతథంగా ఉంచుతూనే వారికి తదుపరి వచ్చే ర్యాంకులను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇతర బోర్డుల విద్యార్థులకూ ఇదే మాదిరి ర్యాంకులు ఇవ్వనున్నారు. ఎంసెట్ రెండో ర్యాంకుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు వివరించారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం నేపథ్యంలో ఏపీ అధికారులు ఫలితాల విడుదలలో తగిన చర్యలు తీసుకున్నారు.
ముంబై ఐఐటీలో చదువుతా..
ఎంసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో ఓపెన్ కేటగిరీలో 173వ ర్యాంక్ వచ్చింది. నాన్న రమేష్, అమ్మ పద్మజ ఇద్దరూ డాక్టర్లే. నన్ను నిరంతరం ప్రోత్సహించారు. టీచింగ్ ఫ్యాకల్లీ కూడా ఎంతో సహకరించారు. 10వ తరగతి వరకూ శ్రీకాకుళంలోని ప్రైవేట్ స్కూళ్లలో చదివాను. ఇంటర్ విశాఖలోని ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేశాను. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత లక్ష్యాన్ని ఎంచుకుంటాను.
– వావిలపల్లి సాయినాథ్, ఇంజనీరింగ్ ఫస్ట్ ర్యాంకర్
చాలా సంతోషంగా ఉంది..
ఎంసెట్‌లో రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించా. 160 మార్కులకు 155.48 మార్కులు వచ్చాయి. ఈనెల 5న వెలువడిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆలిండియా రెండో ర్యాంక్ వచ్చింది. అందులో 396కు 345 మార్కులు వచ్చాయి. ఈ ర్యాంక్ ఆధారంగా ముంబాయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నా. ఈ ఏడాది సాధించిన ఫలితాల పట్ల చాలా సంతోషంగా ఉంది.
– గంగుల భువన్‌రెడ్డి, ఇంజనీరింగ్ మూడో ర్యాంకర్
డాక్టరు కావాలనేదే లక్ష్యం
మా తాత డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం, తల్లిదండ్రులు కోటేశ్వరప్రసాద్, సుధారాణి డాక్టర్లే. వారిలా డాక్టర్ కావాలనేదే నా లక్ష్యం. నీట్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందన్న నమ్మకం ఉంది. ఇంటర్ విజయవాడలో ప్రైవేట్ విద్యాసంస్థలో చదివి 985 మార్కులతో సాధించాను. చదువును కష్టంలా భావించకుండా ఇష్టపడి చదివాను.
– గుత్తి చైతన్యసింధు, అగ్రి, మెడికల్ ఫస్ట్ ర్యాంకర్
న్యూరాలజిస్ట్ అవుతా..
నాన్న శ్రీనివాసరావు ప్రైవేటు కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకులు. అమ్మ సువర్చల గృహిణి. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆనందాన్నిచ్చింది. నీట్‌లో ర్యాంకు ద్వారా ఎయిమ్స్‌లో సీటు సాధించడం నా లక్ష్యం. లాక్‌డౌన్ విధించినది మొదలు సెప్టెంబర్ వరకు అధ్యాపకులు ఆన్‌లైన్‌లో చెప్పిన తరగతులకు హాజరయ్యాను. ఆన్‌లైన్‌లో 200 పరీక్షలు రాశాను. న్యూరాలజిస్ట్‌గా ఎదగాలనే ఆశయంతో ఉన్నాను.
– త్రిపురనేని లక్ష్మీసాయి మారుతి, అగ్రి,మెడికల్, సెకండ్ ర్యాంకర్
తల్లిదండ్రుల స్ఫూర్తితోనే..
నా తల్లిదండ్రులు డాక్టర్ ఆర్.వెంకట్, డాక్టర్ ఎం.రమాదేవి తిరుపతి రుయా ఆస్పత్రిలో పేద రోగులకు సేవలందిస్తున్నారు. వారి స్ఫూర్తితోనే ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించా. నీట్, ఎంసెట్‌కు శిక్షణ తీసుకుని పరీక్ష రాశా. తల్లిదండ్రుల తరహాలోనే వైద్యుడిగా రాణించి, సేవలందించాలన్నదే నా కోరిక. నీట్‌లోనూ మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నా.
– మనోజ్‌కుమార్, అగ్రి మెడికల్, మూడో ర్యాంకర్
Comments
Please login to add a commentAdd a comment