ఏపీ నెట్‌వర్క్: దాదాపు రూ.45 కోట్ల విలువ చేసే ఖరీదైన భూమిని అనంతపురంలో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ సైతం చేసిన వ్యవహారానికి ‘స్పందన’ కార్యక్రమం ద్వారా అడ్డుకట్ట పడింది! అధిక వడ్డీల ఎరతో 40 మంది ఉద్యోగుల నుంచి రూ.25 కోట్లు వసూలు చేసిన ఓ మహిళ బెదిరింపులకు ‘స్పందన’ సత్వరమే తెర దించింది. అధిక ఫీజులు వసూలు చేసి తల్లిదండ్రులను, తిండి పెట్టకుండా చదువుల పేరుతో పిల్లలను కాల్చుకు తింటున్న కార్పొరేట్ కాలేజీల దురాగతాల బారి నుంచి ‘స్పందన’ భరోసా కల్పిస్తోంది.
ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమం అనూహ్య ఫలితాలనిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేస్తోంది. అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందకపోవడం, ఎవరికైనా అన్యాయం జరిగిన సందర్భాల్లో ఫిర్యాదుచేస్తే చాలు విచారించి నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాలు, సచివాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమం బాధితులకు కొండంత భరోసానిస్తోంది.
స్పందన (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ సహకారంతో స్పందన పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. దీంతోపాటు ఏడాది పొడవునా ఏ సమయంలోనైనా వివిధ అంశాలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు వేర్వేరు టోల్‌ఫ్రీ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.
పని తీరు ఇలా...
కేవలం ఫిర్యాదులను స్వీకరించటంతో సరిపెట్టకుండా సమస్యల పరిష్కారానికి కచ్చితమైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ‘స్పందన’లో స్వీకరించే ప్రతి ఫిర్యాదుకూ వైఎస్‌ఆర్ (యువర్ స్పందన రిక్వెస్ట్) నెంబరు కేటాయిస్తారు. ఫిర్యాదులను వర్గీకరించి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపుతారు. వాటిపై విచారణ జరిపి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటారు. ఒకవేళ ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందకుంటే ఆ విషయాన్ని తెలియజేస్తే అధికారులు మరోసారి క్షుణ్నంగా పరిశీలిస్తారు.
5.85 లక్షల ఫిర్యాదులు పరిష్కారం..
2021 ఏప్రిల్ 1 నుంచి 2022 డిసెంబరు 6వ తేదీ వరకు స్పందనలో 6,14,529 ఫిర్యాదులు నమోదు కాగా 5,85,613 పరిష్కారమయ్యాయి. 28,916 ఫిర్యాదులు విచారణలో ఉన్నాయి.
కేస్ స్టడీలు...
రూ.45 కోట్ల భూమిపై కన్ను..
అనంతపురం వక్కలం వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకట సుబ్బయ్యకు రాచానపల్లి సర్వే నెంబర్ 127లో 14.96 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని విలువ రూ.45 కోట్లకు పైమాటే. ఖరీదైన ఈ భూమిని కాజేసేందుకు అంపగాని శ్రీనివాసులు, సత్యమయ్య, హనుమంతాచారి, వేణుగోపాల్, రమేష్, రామ్మోహన్‌రెడ్డి ఓ ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ సృష్టించారు. టీచర్స్ కాలనీకి చెందిన వడ్డే రాముడు ఆధార్ కార్డును వెంకట సుబ్బయ్య పేరుతో నవీకరించారు. తండ్రి పేరు, అడ్రస్, చివరకు ఫోన్ నంబర్ మార్చేసి సత్యమయ్యకు విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అనంతరం దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవేందర్‌రెడ్డికి ఎకరం రూ.కోటి చొప్పున విక్రయించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. అడ్వాన్స్ కింద ఈ ముఠా రూ.1.05 కోట్లు వసూలు చేసింది. వెంకటసుబ్బయ్య కుమారులు వెంకటరమణ, నందకిషోర్ ఆగస్టు మొదటి వారంలో అనుమానంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీకి దరఖాస్తు చేయడంతో అసలు బాగోతం వెలుగు చూసింది. ఆగస్టు 7న స్పందన కార్యక్రమంలో దీనిపై ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేయడంతో విచారించి ఆగస్టు 24న నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అధిక వడ్డీల ఎర...
అధిక వడ్డీల ఎర వేసి రూ.1.5 కోట్లు కాజేసి బెదిరిస్తున్న ఓ మహిళపై నవంబరు 31న న్యాయవాది గుంటుపల్లి చంద్రశేఖర్ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దాదాపు 40 మంది ఉద్యోగుల నుంచి నిందితురాలు మొత్తం రూ.25 కోట్లు వసూలు చేసి మోసగించినట్లు వెల్లడైంది. ఈ కేసును నల్లపాడు పోలీసులు విచారిస్తున్నారు. బ్యాంకు రుణం ఇíప్పిస్తానంటూ రూ.లక్షల్లో వసూలు చేసిన గుంటూరు శ్రీనగర్‌కు చెందిన మరో మహిళ మోసాలపైనా స్పందనలో ఫిర్యాదు అందటంతో అరండల్‌పేట పోలీసులు విచారణ చేపట్టారు.
నకిలీ ఎన్‌వోసీల గుట్టు రట్టు..
ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్ రియల్‌ఎస్టేట్ వ్యాపారులతో కలసి నకిలీ ఎన్‌ఓసీలు సృష్టించిన వైనం ఇది. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు 513 సర్వే నంబరులో శంకరరెడ్డికి చెందిన 12 ఎకరాల భూమికి ఎన్‌ఓసీ ఇప్పించేందుకు మనోజ్‌తో పాటు రాయల శ్రీనివాసులు, దండు వెంకటనాయుడు రూ.2.50 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా రూ.1.32 కోట్లను తీసుకున్నారు. స్థానిక మండల తహశీల్దార్ శ్రీనివాసులుతో పాటు సబ్‌రిజిస్ట్రార్ త్రినాథ్, డిప్యూటీ తహశీల్దార్ గురుప్రసాద్, ఎస్‌ఐ రాంప్రసాద్‌కు లంచం ఇచ్చి అక్రమ మార్గాల్లో పని పూర్తి చేశారు. అనంతరం వాటాల పంపకంలో తేడా రావడంతో ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌పై దండు వెంకటనాయుడు, రాయల శ్రీనివాసులు స్పందనలో ఫిర్యాదు చేశారు. పోలీసు దర్యాప్తులో బాగోతం బయటపడింది. ప్రధాన నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఎస్‌ఐ రాంప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్ గురుప్రసాద్ పరారీలో ఉన్నారు. çసస్పెండైన కూడేరు తహశీల్దార్ శ్రీనివాసులుతో పాటు సబ్ రిజిస్ట్రార్ త్రినాథ్ ఊచలు లెక్కిస్తున్నారు.
‘కార్పొరేట్’ వేధింపులపై..
నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించడంతోపాటు రోజూ 16 గంటలు గదుల్లోనే ఉంచడం, నాసిరకం భోజనంపై ‘స్పందన’లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధ్యాపకులు చావబాదిన ఘటనలపైనా విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవలే అనంతపురంలో నారాయణ కళాశాలను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.5 లక్షల జరిమానా విధించారు. అద్దె కట్టకుండా, ఇల్లు ఖాళీ చేయకుండా పదేళ్లుగా యజమానిని ఇబ్బంది పెడుతున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారం కూడా ఇటీవల ‘స్పందన’ ఫిర్యాదు ద్వారానే బహిర్గతమైంది. బాధితులకు న్యాయం చేసేందుకు పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఒకరి భూమి మరొకరికి రిజిస్ట్రేషన్..
ఒకరి భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంపై చిత్తూరుకు చెందిన బాలగురునాథం స్పందనలో ఫిర్యాదు చేయగా కలెక్టర్ హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించారు. సబ్‌రిజిస్ట్రార్, రెవెన్యూ శాఖ సిబ్బంది కొందరు ముఠాగా ఏర్పడి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రూ.కోట్లు విలువ చేసే స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తేలింది. స్థల యజమానికి తెలియకుండా మరొకరి పేరిట అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాను అక్టోబర్ 8వ తేదీన చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో తహసీల్దార్ ఐ.సుబ్రహ్మణ్యం, చిత్తూరు సబ్‌రిజిస్ట్రార్ శ్రీధర్‌గుప్తా, వీఆర్‌వోలు ధనుంజయ, శివనారాయణ, కె.బాబు హస్తం ఉన్నట్లు వెల్లడైంది.
దొంగ పాస్ పుస్తకాలతో...
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం సీఎం.కండ్రిగ గ్రామానికి చెందిన రైతు రఘు తన భూమికి రెవెన్యూ సిబ్బంది నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించడంపై నవంబర్ 7న కలెక్టర్ హరి నారాయణన్‌కు ఫిర్యాదు చేశారు. రఘుకు చెందిన 4.08 ఎకరాల భూమిని కాజేసేందుకు అదే మండలంలో పనిచేసే వీఆర్‌వో సుబ్రహ్మణ్యం తన కుమార్తె పేరుతో దొంగ పాసుపుస్తకాలను సృష్టించినట్లు విచారణలో వెల్లడైంది. అక్రమాలకు పాల్పడిన వీఆర్‌వోపై క్రమశిక్షణ చర్యలు చేపట్టి బాధిత రైతు రఘుకు కలెక్టరేట్ అధికారులు న్యాయం చేశారు.
చెరువునే మింగిన పచ్చ తిమింగలం
శ్రీకాకుళం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాబ్జీ)కి చెందిన భూబాగోతం స్పందన ఫిర్యాదుతోనే వెలుగు చూసింది. ఎచ్చెర్ల పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కృష్ణ బంద చెరువును పూడ్చి ప్లాట్లుగా విక్రయిస్తున్నట్లు స్పందనలో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఇక్కడ సెంటు స్థలం రూ.5 లక్షలు పలుకుతోంది. ఐదెకరాల చెరువు ఆక్రమణకు గురైనట్లు విచారణలో తేలడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
స్పందన టోల్‌ఫ్రీ నంబర్లు..
1902 : నవరత్నాలు పథకాలతో సహా అన్ని రకాల ఫిర్యాదులకు
14500 : ఇసుక, ఎక్సైజ్ విభాగంపై ఫిర్యాదులకు
14400 : అధికారుల అవినీతిపై ఫిర్యాదులకు
1907 : వ్యవసాయ రంగం, రైతుభరోసాకు సంబంధించిన ఫిర్యాదులు
14417 : పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, నాడు–నేడు పనులు, టాయిలెట్ల నిర్వహణ, టీచర్ల హాజరుపై ఫిర్యాదులకు..
శాఖల వారీగా స్పందన ఫిర్యాదుల పరిష్కారం ఇలా..
ప్రభుత్వ శాఖ ఫిర్యాదుల సంఖ్య పరిష్కరించినవి
రెవిన్యూ(సీసీఎల్‌ఏ)–154215–142103
గ్రామ, వార్డు సచివాలయాలు–83600–82795
పంచాయతీరాజ్–59878–57307
మున్సిపల్ పరిపాలన–42481–41795
పోలీస్–37019–35992
హౌసింగ్ కార్పొరేషన్–26760–26419
వ్యవసాయం–25223–24353
ఇతర శాఖల ఫిర్యాదులు–1,85,353–1,74,849.
Comments
Please login to add a commentAdd a comment