సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నూతన విధానం సత్ఫలితాలనిస్తోంది. ఈ నూతన విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించింది. దాని ఆధారంగా ఔషధ నియంత్రణ మండలి హోల్‌సేల్, రిటెయిల్ మందుల దుకాణాలు, మందుల తయారీ కంపెనీలలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం, శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లలో విశ్లేషించడం పకడ్బందీగా జరుగుతోంది.
నాణ్యత తక్కువ ఉండే నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్‌ఎస్‌క్యూ) మందులను తయారు చేస్తున్న సంస్థలు, విక్రయిస్తున్న మందుల దుకాణాలపై చర్యలు తీసుకుంటోంది. దీని ఫలితంగా ఎన్‌ఎస్‌క్యూ మందులు రాష్ట్రంలో తగ్గిపోతున్నాయి. నాణ్యమైన మందులు ప్రజలకు లభిస్తున్నాయి. ఎన్‌ఎస్‌క్యూ మందులలో జాతీయ స్థాయికంటే రాష్ట్రస్థాయి సగటు తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా సగటున 4 శాతం ఎన్‌ఎస్‌క్యూ మందులు బయటపడుతుండగా, రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు నెలాఖరు వరకు విశ్లేషించిన నమూనాల్లో 2.5 శాతం లోపు మాత్రమే ఎన్‌ఎస్‌క్యూ నమోదు ఉంది.
తనిఖీ ఎక్కడ చేయాలో యాప్ చెబుతుంది
ఔషధ నియంత్రణ మండలి డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు గతంలో వారి అభీష్టం మేరకు మందుల షాపులు, తయారీ యూనిట్లను ఎంపిక చేసుకొని తనిఖీలు చేసేవారు. ఈ విధానానికి చెక్ పెడుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో నూతన విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. తనిఖీలు, శాంపిళ్ల సేకరణలో అధికారుల జోక్యాన్ని తగ్గించి ర్యాండమ్‌గా చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కంప్యూటర్ ఎయిడెడ్ సెలక్షన్ ఆఫ్ ఇన్‌స్పెక్షన్ యాప్‌ను రూపొందించింది.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు వారి పరిధిలోని ఏ షాప్‌లో తనిఖీ చేయాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో అలర్ట్ వెళుతుంది. వెంటనే వారు యాప్ సూచించిన షాపు, తయారీ యూనిట్‌లో తనిఖీలు చేసి, ఆ నివేదికలను యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. శాంపిల్స్ సేకరణలో 10కి పైగా ప్రమాణాలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)ని రూపొందించారు. ఈ ఎస్‌వోపీకి అనుగుణంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపాలి. దీనిద్వారా తనిఖీలు, శాంపిళ్ల విశ్లేషణ పకడ్బందీగా జరిగి, నాణ్యత తక్కువుండే మందుల తయారీ తగ్గుతోంది. తద్వారా ప్రజలకు మేలు జరుగుతోంది.
3370 నమూనాలు విశ్లేషణ
రాష్ట్రంలో 353 మందుల తయారీ యూనిట్లు, 213 బ్లడ్ బ్యాంక్‌లు, 132 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు, 44,973 హోల్‌సేల్, రీటెయిల్ మందుల షాపులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ నెలాఖరు మధ్య ఔషధ నియంత్రణ విభాగం మందుల షాపుల్లో 17,051 తనిఖీలు చేసింది. బ్లడ్ బ్యాంకులలో 289, మందుల తయారీ యూనిట్లలో 505 తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలు 3,370 నమూనాలను సేకరించి విశ్లేషించగా 2.49 శాతం అంటే 84 నమూనాలు ఎన్‌ఎస్‌క్యూగా తేలింది. ఈ ఘటనల్లో కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.
చదవండి: ఎన్నికల ఏడాది 2023.. త్రిపుర నుంచి తెలంగాణ దాకా...
వీలైనన్ని ఎక్కువ శాంపిళ్లు సేకరణ
వీలైనన్ని ఎక్కువ శాంపిళ్లు సేకరించి, వాటిని విశ్లేషించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పక్కాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. దీంతో సత్ఫలితాలు వస్తున్నాయి. శాంపిళ్ల విశ్లేషణలో ఎన్‌ఎస్‌క్యూగా తేలినప్పుడు కేసులు నమోదు చేసి బాధ్యులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది 77 కేసులు నమోదు చేయగా, వాటిలో 36 కేసుల్లో ముద్దాయిలకు కోర్టు శిక్ష విధించింది. మిగిలిన కేసుల్లో పై కోర్టులను ఆశ్రయించి బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం.
– రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్
Comments
Please login to add a commentAdd a comment