సాక్షి, తాడేపల్లి: ఆంధ్రపదేశ్ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. బుధవారం సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ‘వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’లో భాగంగా సర్వే ఆఫ్ ఇండియాతో ఎంవోయూ కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సర్వే ఆఫ్ ఇండియాతో ఈ ఒప్పందం జరిగింది. అనంతరం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ పై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకోవటం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి సమగ్ర సర్వే చేస్తుందని, దేశంలో తొలిసారిగా ఇంత పెద్దస్థాయిలో సర్వే చేస్తున్నామని తెలిపారు. ఇంటి స్థలం, పొలం, స్థిరాస్తులపై ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత రెండేళ్ల పాటు అబ్జర్వేషన్‌లో అదే గ్రామ సచివాలయంలో పెడతామని వెల్లడించారు. ఆ టైటిల్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని చెబుతున్నామని తెలిపారు. రెండేళ్ల తర్వాత టైటిల్‌కు శాశ్వత భూహక్కు లభించండతోపాటు టైటిల్ ఖరారు చేస్తుందన్నారు. ఆ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు. చదవండి: మూడు రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన
వందేళ్ల తర్వాత
ఈ సర్వే వందేళ్ల తర్వాత జరుగుతోందని, ఈ వందేళ్లలో సబ్‌డివిజన్లు, పంపకాలు క్షేత్రస్థాయిలో నమోదుకాని పరిస్థితి ఉందన్నారు. వాటన్నింటినీ రికార్డుల్లోకి ఎక్కించి, రాళ్లు కూడా వేస్తామని చెప్పారు. తర్వాత యూనిక్ ఐడెంటింటీ నంబర్‌తో కార్డు కూడా ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే కార్డులో క్యూర్‌ఆర్ కోడ్ ఉంటుందని, హార్డ్‌కాపీ కూడా ఇస్తారని సీఎం జగన్ తెలిపారు. ల్యాండ్ పార్సిళ్లు, మ్యాపులు కూడా గ్రామంలో అందుబాటులో ఉంచుతామని, రికార్డులన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేస్తామని పేర్కొన్నారు. విలేజ్ హాబిటేషన్స్, టైన్స్‌కు సంబంధించిన మ్యాపులు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సర్వే రికార్డులు ఉంటాయని తెలిపారు. చదవండి: ఏలూరు బాధితులకు సీఎం జగన్ బాసట
అన్ని సేవలు ఒకచోటే
రిజిస్ట్రేషన్, రెవిన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇంటిగ్రేటెడ్ రెవిన్యూ సర్వీసులు, రిజిస్ట్రేషన్‌తో పాటు అందుబాటలోకి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎక్కడా కూడా ఇంత పెద్ద స్థాయిలో సర్వే ఎప్పుడూ జరగలేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు తీరిపోతాయని తెలిపారు. భూ వివాదాలు సమసిపోయి గ్రామాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుందని, న్యాయమైన చట్టబద్ధమైన హక్కలు లభిస్తాయని సీఎం జగన్ తెలిపారు. కుటుంబాలు, వారి వారసులకు మంచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు.
బృహత్తర కార్యక్రమం
ఇలా మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి 70 బేస్ స్టేషన్లు పెడుతున్నామని, సర్వే ఆఫ్ ఇండియా నెట్‌వర్క్‌లో ఇవి భాగం అవుతాయని వెల్లడించారు. కచ్చితమైన కొలతలు ఉంటాయని, ఎర్రర్ అత్యంత సూక్ష్మ స్థాయిలో రెండు సెంటీ మీటర్లకు అటు ఇటుగా ఉంటుందని అన్నారు. అత్యాధునిక సదుపాయాలు, కార్స్ టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్లు వాడుతుమని చెప్పారు. 1.26 లక్షల చదరపు కిలోమీటర్లు సర్వే చేస్తున్నారని తెలిపారు. 5వేల రెవిన్యూ గ్రామాల్లో ఈ సర్వే మొదటి విడత డిసెంబర్ 21న ప్రారంభమై.. జులై 2021 వరకూ కొనసాగుతుందన్నారు. ఆగస్టు 2021 నుంచి 6500 రెవిన్యూ గ్రామాల్లో రెండో విడత ప్రారంభమై.. 2022 ఏప్రిల్ వరకూ కొనసాగుతుందని చెప్పారు. మిగిలిన గ్రామాల్లో జులై 2022 నుంచి జనవరి 2023 వరకూ కొనసాగి అప్పటితో సర్వే పూర్తవుతుందన్నారు. మొదటి విడత పూర్తైన తర్వాత రెండో విడత ప్రారంభం అయ్యేలోపే సంబంధిత గ్రామ సచివాలయాలను సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివాదాలు పరిష్కరించడానికి అదే సమయంలో మొబైల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 660 మొబైల్ మెజిస్ట్రేట్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సిబ్బంది నియామకం
అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తామని, అందుకోసం 14వేల సర్వేయర్లును ప్రభుత్వం నియమించిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వీళ్లు ఉంటారని, వీరందరికీ కూడా శిక్షణ జరుగుతోందన్నారు. 9400 మంది ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. జనవరి 26 వరకు మిగిలిన వారికి ట్రైనింగ్ పూర్తవుతుందని తెలిపారు.
కలెక్టర్లు-బాధ్యత
వీటన్నింటినీ కలెక్టర్లు దగ్గరుండి చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ట్యాండ్ టైటిలింగ్ అథారిటీని రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని, సర్వే సన్నద్దతపై కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో ట్రైబ్యునల్స్ ఏర్పాటు సాగాలన్నారు. అప్పిలేట్ ట్రైబ్యునల్స్‌ను కూడా రిటైర్డ్ న్యాయమూర్తులతో ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిని వెంటనే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులను ఆదేశించారు. డ్రోన్స్ ద్వారా సర్వే మొదలుపెట్టే సమయానికి గ్రామాల సరిహద్దులు, వాటి మార్కింగ్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి మండలంలో ఒక డ్రోన్ టీం, డాటా ప్రాససింగ్, రీ సర్వే టీంల ఏర్పాటుపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు.
ప్రజల్లో అవగాహన కలిగించాలి
సర్వే వల్ల జరిగే మంచి ఏంటి ఏమిటి? లాభాలు ఏంటన్న దానిపై ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. పూర్తిగా ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. గ్రామ, వార్డు వాలంటీర్ల సహాయంతో ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేయండని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభం అయ్యిందని, దాన్ని సమర్థవంతంగా చేసేలా చూడాలని, డిసెంబర్ 14 నుంచి 19 వరకూ గ్రామ సభలు కూడా నిర్వహించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. వారికి కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదన్న బాధతో ఎల్లోమీడియా సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసి, సమర్థవంతంగా ముందుకు సాగేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరిష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సర్వే కార్యక్రమంలో తమను భాగస్వాములను చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఇలాంటి సర్వే చేపట్టడం తొలిసారని చెప్పారు. ఏపీ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఐదు నిమిషాల్లోనే కొలిచి ల్యాండు రికార్డులు వస్తాయని తెలిపారు. 2–3 సెంటీమీటర్ల అటు ఇటుగా కచ్చితత్వం ఉంటుందని పేర్కొన్నారు. సమగ్ర సర్వే అన్నది దార్శనికతతో కూడిన కార్యక్రమం అని తెలిపారు. ప్రపంచంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామని, వందేళ్ల తర్వాత మళ్లీ ప్రస్తుతం సమగ్ర సర్వే జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌తో పాటు, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా, లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment