సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కమిషనర్ ఆదేశాలను ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దుచేయాలని కోరుతూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. అజయ్‌జైన్ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ఎస్‌ఈసీ ఉత్తర్వులవల్ల పెన్షన్లు, నిత్యావసరాల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు నిలిచిపోతుందన్నారు.
వలంటీర్లకు రాజకీయాలతో సంబంధంలేదని, వారు స్వచ్ఛంద సేవకులని వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లపై ఫిర్యాదులు వచ్చాయని, అందువల్ల మున్సిపల్ ఎన్నికల్లో వారు పాల్గొనకుండా ఉత్తర్వులిచ్చామని ఎస్‌ఈసీ చెబుతున్నారని.. వాస్తవానికి వలంటీర్లపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని శ్రీరామ్ తెలిపారు. నిర్దిష్టమైన ఆరోపణలుంటే చర్యలు తీసుకోవచ్చునని, అంతేతప్ప మొత్తం వలంటీర్ల వ్యవస్థనే స్తంభింపజేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని ఆయన వివరించారు. వలంటీర్ల వ్యవస్థ వచ్చిన తరువాత గ్రామస్థాయిలో సంక్షేమ పథకాల అమలులో వేగం పెరిగిందని ఏజీ తెలిపారు.
వలంటీర్లు ప్రతీనెలా మొదటి తేదీన లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నారని.. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఆదేశాలవల్ల పెన్షన్ అందజేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తనకు ఎలాంటి ఆదేశాలైనా ఇచ్చే అధికారాలున్నట్లు ఎన్నికల కమిషనర్ భావిస్తున్నారని, ఈ భావన సరికాదన్నారు. ఉద్యోగం నుంచి తొలగిస్తానని కూడా కమిషనర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారని, వాస్తవానికి వలంటీర్ల తొలగింపు అధికారం కమిషనర్‌కు లేదన్నారు. ఒకటో తేదీ పెన్షన్ మంజూరు చేసే రోజు అని, అందువల్ల పెన్షన్ మంజూరులో జోక్యం చేసుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, రేపు చూద్దామని తెలిపారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి పిటిషన్
ఇదిలా ఉంటే.. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు ముగిసే వరకు వార్డు వలంటీర్లను వారి విధుల నుంచి దూరంగా ఉంచేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఈ వ్యాజ్యంపై కూడా జస్టిస్ సోమయాజులు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
పురపాలక ఎన్నికలపై పిల్ కొట్టివేత
గత ఏడాది పురపాలక ఎన్నికలు నిలిచిపోయిన దశ నుంచే ఇప్పుడు ఆ ఎన్నికలను ప్రారంభిస్తూ ఎన్నికల కమిషనర్ గత నెల 15న జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇందులో తాము ఏ రకంగా జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ తెలుగు రాష్ట్రాల కామన్‌మెన్ ఫోరం కన్వీనర్ జీవీ రావు హైకోర్టులో పిల్ వేశారు. కాగా, పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌లో జోక్యానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం, అప్పీల్‌ను భౌతికంగా ఫైలింగ్ చేస్తేనే విచారిస్తామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment