గ్రామాల్లో ‘మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు’ | AP Government Will Set Up Multipurpose Facility Centers In Villages | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో ‘మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు’

Published Fri, Feb 26 2021 3:01 AM | Last Updated on Fri, Feb 26 2021 11:02 AM

AP Government Will Set Up Multipurpose Facility Centers In Villages - Sakshi

సాక్షి, అమరావతి: ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెటింగ్‌ చేసుకోలేక అన్నదాతలు పడుతున్న వెతలకు త్వరలో తెరపడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారులైనా రైతు నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా వీటిని తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో మార్కెటింగ్‌ శాఖ ఏర్పాట్లను వేగవంతం చేసింది. 

మార్కెటింగ్‌ వ్యవస్థ బలోపేతం..
గ్రామాల్లో పండించిన పంటను స్థానికంగా విక్రయించేలా ఆర్బీకేల సమీపంలో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటవుతాయి. రూ.2,718.11 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటయ్యే ఈ కేంద్రాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.264.2 కోట్లు ఖర్చు చేయనుండగా కేంద్రం రూ.74 కోట్లు సబ్సిడీగా అందించనుంది. రూ.2,361.1కోట్లను అగ్రి ఇన్ఫర్‌ ఫండ్‌ (ఏ.ఐ.ఎఫ్‌) కింద వడ్డీ ఉపసంహరణ స్కీమ్‌ ద్వారా ఒక శాతం వడ్డీకి నాబార్డు రుణం రూపంలో అందించనుంది. రైతు కమిటీల ద్వారా కొనుగోలు చేసే కొన్ని రకాల పరికరాలకు సంబంధించి రూ.18.9 కోట్లు లబ్ధిదారుల వాటా కింద భరించాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల కోసం ఆర్బీకేల సమీపంలో 50 సెంట్ల నుంచి ఎకరం స్థలాన్ని సమీకరిస్తున్నారు. గ్రామస్థాయిలో మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో పంటకోతకు ముందు, తర్వాత రైతులకు మౌలిక సదుపాయాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఈఎఫ్‌ఎఆర్‌ మార్కెట్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఇదీ..
దళారీల బెడద లేకుండా పంట ఉత్పత్తులను రైతులు నేరుగా కళ్లాల నుంచి విక్రయించుకునే అవకాశం ఇ–మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా కల్పించనున్నారు. దీనిద్వారా ప్రతి రైతును అఖిల భారత మార్కెట్‌కు అనుసంధానిస్తారు. గిట్టుబాటు ధర లభించే వరకు ఈ సెంటర్లలో నిల్వ చేసుకుని తమకు నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఏ గ్రామంలో ఏ ఉత్పత్తులు పండిస్తున్నారు? సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు? నాణ్యత ఎలా ఉంది? దిగుబడి ఎంత? తదితర అంశాలను ఈ ప్లాట్‌పామ్‌ ద్వారా వ్యాపారులు సైతం తెలుసుకోవచ్చు.

త్వరలో టెండర్లు
ఆర్‌బీకేలకు అనుసంధానంగా మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే వచ్చే నెలలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా టెండర్లను పిలవబోతున్నాం. ముందుగా జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపి ఆ తర్వాత టెండర్లను పిలుస్తాం. మార్చిలో ఈ ప్రక్రియ పూర్తి చేసి ఏప్రిల్‌లో పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వీటిని దశలవారీగా 2022 అక్టోబర్‌ నాటికి పూర్తి చేయాలని సంకల్పించాం’
– ప్రద్యుమ్న, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌

మౌలిక సదుపాయాలివే
ప్రధానంగా రూ.1,637.05 కోట్లతో 4,277 డ్రై స్టోరేజ్, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్స్, రూ.331.80 కోట్లతో ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం 60 అధిక నిల్వ సామర్థ్యం కలిగిన గిడ్డంగులు, రూ.188.73 కోట్లతో 1,483 కలెక్షన్‌ సెంటర్లు (ధాన్యం సేకరణ కేంద్రాలు), కోల్డ్‌ రూమ్స్‌ (శీతల గిడ్డంగులు), టర్మరిక్‌ బాయిలర్స్‌/పాలిషర్స్, రూ.378.24కోట్లతో 7,950 ప్రైమరీ ప్రాసెసింగ్‌ ఎక్విప్‌మెంట్‌ (ధాన్యం శుద్ధి పరికరాలు), రూ.60.86 కోట్లతో 10,687 ఎస్సాయింగ్‌ ఎక్విప్‌మెంట్‌ (ధాన్యం నాణ్యత పరీక్షించే సామగ్రి), రూ.108.92 కోట్లతో 10,678 ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్‌ ఎక్విప్‌మెంట్‌ (ధాన్యం కొనుగోలు సామగ్రి) కొనుగోలు చేయనున్నారు. కళ్లాల నుంచే ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌ చేసుకునేందుకు రూ.12.51 కోట్లతో ‘ఇ–మార్కెటింగ్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌’తెస్తున్నారు. 

చదవండి: (సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఏపీ ఆతిథ్యం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement