![AP Governor Biswabhushan Pays Tribute At National War Memorial Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/24/Harichandan.jpg.webp?itok=oIce9zjg)
ఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు ఆదివారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. అమరవీరులకు నివాళులు అర్పించిన గవర్నర్, జాతి సేవలో ప్రాణాలర్పించిన వీర యోధులను మననం చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 26,000 మందికి పైగా భారత సాయుధ దళాల సైనికులు దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడే క్రమంలో అసువులు బాసి అత్యున్నత త్యాగం చేశారు. వారి త్యాగ నిరతి కి గుర్తుగా జాతీయ యుద్ధ స్మారక చిహ్నం సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతుంది.
ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. స్మారక చిహ్నం పౌరుల్లో ఉన్నతమైన నైతిక విలువలు, త్యాగం, జాతీయ భావాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుందన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చోటు చేసుకున్న వివిధ సంఘర్షణలు, ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలు, మానవతా సహాయం, విపత్తు ప్రతిస్పందన కార్యకలాపాల సమయంలో మన సైనికులు చేసిన త్యాగాలకు ఇది సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు. స్మారక చిహ్నం లోతైన అనుభవాలకు ప్రతీక కాగా, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. గవర్నర్ హరిచందన్ జాతీయ యుద్ధ స్మారక చిహ్నం సందర్శన నేపథ్యంలో అక్కడి సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని నమోదు చేశారు.
గవర్నర్‌తో భేటీ అయిన ధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి గౌరవ ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. సమకాలీన రాజకీయ అంశాలను చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment