AP Govt Finalized Probation Of Village Ward Secretariat Employees, Details Inside - Sakshi
Sakshi News home page

AP Probation: లక్ష ఇళ్లలో పెద్ద పండుగ

Published Sun, Jun 26 2022 1:54 AM | Last Updated on Sun, Jun 26 2022 10:55 AM

AP Govt finalized probation of village ward secretariat employees - Sakshi

గుంటూరులో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న సచివాలయ ఉద్యోగులు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు చేయడంతో పాటు వారికి 2022 జనవరిలో ప్రకటించిన పే రివిజన్‌(11 పీఆర్సీ) ప్రకారం పే స్కేళ్లను నిర్ధారిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు లక్ష మంది ఉద్యోగులు ప్రొబేషన్‌ ఖరారుకు అర్హత పొందుతారని అధికారులు తెలిపారు. తద్వారా వారి జీతాలు దాదాపు రెట్టింపు కానున్నాయి.

గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల కేటగిరీ ఉద్యోగులు పని చేస్తుండగా, ప్రొబేషన్‌ ఖరారైన గ్రేడ్‌–5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీల పే–స్కేలును రూ.23,120 – 74,770గా నిర్ధారించారు. వీరి వేతనం డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకుని రూ.29,598 ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల పే–స్కేలును రూ. 22,460– 72,810గా నిర్ధారించారు. అంటే, ఆ కేటగిరి ఉద్యోగుల డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకొని రూ.28,753 ఉంటుంది.



గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి 8 శాతం హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌ ప్రకారం ఈ వేతనాలు అందుతాయి. పట్టణ ప్రాంతాలలో పని చేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ స్లాబు మేరకు ఆయా చోట్ల పని చేసే ఉద్యోగులకు మరికొంత అధిక వేతనం దక్కుతుంది. పెరిగిన వేతనాలు జూలై 1 నుంచి (అంటే ఆగస్టు 1న ఉద్యోగుల చేతికి అందే జీతం) అమలులోకి రానున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో  పేర్కొంది. సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం రూ.15 వేలు వేతనం పొందుతున్న విషయం విదితమే.



2022 పే– రివిజన్‌కే సీఎం జగన్‌ ఆమోదం 
2018లో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు నాటికి సచివాలయ ఉద్యోగుల కేడర్‌ లేదు. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిటీ కూడా ప్రొబేషన్‌ ఖరారు అనంతరం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యగులకు ఉద్యోగ నోటిఫికేషన్‌లో పేర్కొన్న 2015 పే రివిజన్‌ ప్రకారమే వేతనాలు చెల్లించాలని సిఫార్సు చేసింది. ఈ ఏడాది జనవరి విడుదలైన పీఆర్సీ జీవోలలోనూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పే – స్కేలును నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం ఉదహరించారు.



ఆ ప్రకారం.. గ్రేడ్‌ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీల వేతనం డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకున్న తర్వాత కూడా రూ.19,241 ఉంటుంది. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల వేతనం డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకున్న తర్వాత కూడా రూ.18,691 ఉంటుంది. అయితే ఈ పాత పే – స్కేళ్లకు బదులుగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మాదిరే 11 పీఆర్సీ (2022 పే రివిజన్‌) ప్రకారం లెక్క కట్టి కొత్త పే – స్కేళ్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి వేతనం దాదాపు రూ.10 వేలు పెరిగింది.

కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా అర్హుల జాబితాలు 
ప్రభుత్వం ప్రొబేషన్‌ ఖరారు ఉత్తర్వులు విడుదల చేసిన చేసిన నేపథ్యంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో 26 జిల్లాల్లో వేర్వేరుగా ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ జారీ చేసిన జీవో నెంబరు 5 జతచేసి.. కమిషనర్‌ షాన్‌మోహన్‌ వివిధ శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి, డిపారెంట్‌ టెస్టు ఉత్తీర్ణత, ఎటువంటి నేర చరిత్ర లేదన్న పోలీసు రిపోర్టులకు అనుగుణంగా జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్‌ ఖరారుకు అర్హులైన ఉద్యోగుల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా 19 రకాల కేటగిరి ఉద్యోగులకు సంబంధించి ఆయా జిల్లాల్లో కేటగిరీ వారిగా అర్హుల పేర్లతో కూడిన జాబితాలతో వేర్వేరుగా ప్రోసీడింగ్స్‌ జారీ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.   

ప్రొబేషన్‌ డిక్లేర్‌ చరిత్రాత్మకం 
రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు లక్షన్నర నూతన ఉద్యోగాలు సృష్టించి శాశ్వత ఉపాధి కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కే సాధ్యమైంది. సీఎం ఇచ్చిన మాట మేరకు పరీక్ష పాస్‌ అయిన వారందరి సర్వీసులు క్రమబద్ధీకరిస్తూ, వారికి కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం. ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చరిత్రాత్మకం. లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు.     
– ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) 
అనంతపురం జిల్లా గుత్తి 11వ వార్డు సచివాలయంలో గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డితో కలసి సంతోషం పంచుకుంటున్న సచివాలయ ఉద్యోగులు 

 
కొత్త పీఆర్సీ ప్రకారం సంతోషం 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.  
– కాకర్ల వెంకటరామి రెడ్డి, గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌.  
 
థ్యాంక్యూ సీఎం సార్‌.. 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌ చేసిన మేలు మరవలేనిది. థ్యాంక్యూ సీఎం సార్‌. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందిస్తాం.     
– జాని పాషా, మనోహర్, బి.శ్వేతా, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌. 

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌కు సంబంధించి జీఓ విడుదల చేసినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. చెప్పిన మాట చెప్పినట్లు అమలు చేశారు. లక్షలాది మంది కుటుంబాల్లో సంతోషం నింపినందుకు ధన్యవాదాలు.     – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు 
– గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నేతలు సాయినాథ్‌రెడ్డి, అర్లయ్య, సమీర్‌ హుస్సేన్, సల్మాన్‌ బాషా, రాజశేఖర్‌బాబు  
కాకినాడ మూడో డివిజన్‌ సురేష్‌నగర్‌లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్న సచివాలయ ఉద్యోగులు  

మాలో సీఎం ధైర్యాన్ని నింపారు  
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆశలను నెరవేరుస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ ఒకేసారి లక్ష మంది ప్రొబేషన్‌ ఖరారు చేసినందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి, ప్రభుత్వానికి హృదయ పూర్వక ధన్యవాదాలు.  
– అంజన్‌రెడ్డి, బత్తుల అంకమ్మరావు, బి.ఆర్‌.ఆర్‌.కిషోర్, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ 
 
మరింత ఉత్సాహంగా పని చేస్తాం  
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అందరి తరఫున ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అర్హులైన కుటుంబాలకు పారదర్శకంగా అందించడంలో కీలక పాత్ర పోషిస్తాం.  
– గునిపే రాజేష్, షేక్‌ అబ్దుల్‌ రజాక్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం.    


 


 


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement