అమరావతి: ప్రజలకు క్యాన్సర్ నివారణ, చికిత్స అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి క్రిష్ణబాబు అన్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ దినం సందర్భంగా ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాకథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ళ క్రితం సాంక్రమిక వ్యాధులతో(సీడీ) ప్రజలు ఎక్కువగా మరణించే వారని, మారిన జీవన శైలి, పరిస్థితుల్లో ఇప్పుడు అసాంక్రమిక వ్యాధుల(ఎన్సీడీ) కారణంగా ఎక్కువ మంది మృత్యువాత పడుతున్న విషయాన్ని గమనించాలన్నారు. సాంక్రమిక వ్యాధులకు సంబంధించి అత్యాధునిక వైద్య చికిత్సలు, ఔషధాలు అందుబాటులోకి రావటంతో ఆ మరణాల సంఖ్యగణనీయంగా తగ్గిందన్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల మార్పు కారణంగా సోకుతున్న క్యాన్సర్, మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బీపీ) వంటి అసాంక్రమిక వ్యాధులతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్నారు.
20 ఏళ్ల క్రితం ఈ మరణాల సంఖ్య 30 శాతం లోపు వుండగా, ఇప్పుడది 60 శాతానికి పైగా పెరిగిందన్నారు. ఇందుకు ముఖ్యంగా జన్యుపరమైన కారణాల కంటే మన జీవన శైలి లో మార్పే కారణమని ఆయన స్పష్టం చేశారు. ప్రాణాంతకమైన అలవాట్ల వల్ల నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటికి ఎక్కువగా గురవుతున్నారన్నారు . క్యాన్సర్ వ్యాధుల కారణంగా 9 శాతం మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని తాజా అంచనాల ద్వరా తెలుస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏటా దాదాపు 35 వేల మందికి పైగా క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారన్నారు. మరో 70 వేల మంది కొత్తగా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. ఈ వ్యాధికి ప్రస్తుతం మన వద్ద ఉన్న చికిత్సా విధానాలు కేవలం జీవన కాలాన్ని పెంచటానికి తప్ప, వ్యాధి నివారణకు, వ్యాధిని తగ్గించటానికి పనికిరావటం లేదన్నారు. భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధికి పూర్తి స్థాయి చికిత్స అందుబాటులోకి వస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గత ఏడాది క్యాన్సర్ చికిత్సకు రూ..430 కోట్లు ఖర్చు చేశామని క్రిష్ణబాబు వెల్లడించారు. నెట్‌వర్క్ ఆస్పత్రులలో క్యాన్సర్‌ను ప్రధాన వ్యాధిగా చేర్చి అనేక వైద్య విధానాలను ప్రవేశపెట్టామని, దేశంలో మరెక్కడా లేని విధంగా స్టేజ్ 1 నుండి స్టేజ్ 4 వరకూ పాలియేటివ్ కేర్ వంటి వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు వ్యాధి బారి నుండి సాంత్వన కలిగించే ప్రయత్నం చేశామన్నారు. వ్యాధిగ్రస్తులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించటంతో పాటు స్టేజ్ 4 దాటిన వారికి గౌరవ ప్రదమైన మరణాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పించామన్నారు.
ఈ అంశాలపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారుగా నియమించారని, ఆయన సహకారంతో క్యాన్సర్ వ్యాధికి సమగ్ర చికిత్సనందించేందుకు అనువైన ప్రణాళిక రూపొందిస్తున్నామని క్రిష్ణబాబు వెల్లడించారు. అదే విధంగా మన రాష్ట్రంలో వున్న 11 వైద్య కళాశాలల్లో క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు రూ.400 కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. క్యాన్సర్ సోకిన తరువాత మనం చేసేది ఏమీ లేనప్పటికీ జీవన నాణ్యత, ప్రమాణాలను పెంచేందుకు అనువైన చికిత్సను అందించగలుగుతున్నామని చెప్పారు.
చదవండి: పచ్చ పార్టీ.. పచ్చ కుట్రలు.. ఎల్లో మీడియా ఫేక్ స్టోరీలతో శునకానందం..
Comments
Please login to add a commentAdd a comment