కోర్టు ముందు హాజరు కావడానికి నామోషీనా? | AP High Court Serious On Officials Of Electricity Department | Sakshi
Sakshi News home page

కోర్టు ముందు హాజరు కావడానికి నామోషీనా?

Jan 6 2023 10:13 AM | Updated on Jan 6 2023 10:13 AM

AP High Court Serious On Officials Of Electricity Department - Sakshi

సాక్షి, అమరావతి: అధికారులు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావడం నామోషీగా ఎందుకు భావిస్తున్నారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సింగిల్‌ జడ్జిలు ఆదేశాలు జారీ చేయగానే, వాటిని సవాలు చేస్తూ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసే ధోరణి పెరిగిపోయిందని ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఈ తీరు సరైనది కాదంది. వ్యక్తిగత హాజరు శిక్షేమీ కాదని, జడ్జేమీ ఉరి తియ్యరని, ఆ అధికారం తమకు లేదని వ్యాఖ్యానించింది. ఫలానా అధికారి కోర్టు ముందు హాజరయ్యారని పత్రికల్లో రావడం పరువు తక్కువగా భావిస్తున్నందునే అప్పీళ్లు దాఖలు చేస్తున్నట్లుందని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడమేగాక, ఉత్తర్వుల కాపీని తీసుకునేందుకు నిరాకరిస్తూ కోర్టునుద్దేశించి కింది స్థాయి అధికారులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సీపీడీసీఎల్‌) సీఎండీ, చీమకుర్తి సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ), ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ), మరికొందరు అధికారులను వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సింగిల్‌ జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యానికి నిరాకరించింది. సింగిల్‌ జడ్జి ఆదేశాలను సవాలు చేస్తూ సీపీడీసీఎల్‌ చీమకుర్తి ఎస్‌ఈ తదితరులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. సింగిల్‌ జడ్జి ముందు హాజరై, అన్నీ అక్కడే చెప్పుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన వీఎల్‌ గణపతి గ్రానైట్స్‌ విద్యుత్‌ బిల్లులు బకాయి పడటంతో సీపీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. దీనిపై ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీపై ఆధారపడి పలువురు జీవనం సాగిస్తున్నందున విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాలని దీనిని విచారించిన జస్టిస్‌ బట్టు దేవానంద్‌ డిసెంబర్‌ 16న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యాజ్యం ఈ నెల 3న మరోసారి విచారణకు రాగా.. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని, అంతేగాక కోర్టు ఆదేశాల కాపీని కూడా తీసుకోలేదని, పైపెచ్చు కోర్టునుద్దేశించి అనుచిత వ్యా ఖ్యలు చేశారని గణపతి గ్రానైట్స్‌ న్యాయవాది తెలిపారు. ఆ వ్యాఖ్యల సీడీని న్యాయమూర్తి ముందుంచారు.  

కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఈ కోర్టు భావిస్తున్నప్పటికీ, వారి వాదన కూడా వినడం సమంజసమని, ఈ నెల 6న కోర్టు ముందు హాజరు కావాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సీపీడీసీఎల్‌ చీమకుర్తి ఎస్‌ఈ తదితరులు సీజే ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. అధికారుల తరపున వీఆర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గణపతి గ్రానైట్స్‌ సంస్థ రూ.48 లక్షల వరకు బిల్లులు బకాయి పడినందునే విద్యుత్‌ సరఫరా నిలిపేశామన్నారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు గడువు ఉందన్నారు. వాదనలు విన్న ధ ర్మాసనం.. కోర్టు పట్ల అధికారుల సంభాషణను దృష్టిలో పెట్టుకుని వారి తీరును ఆక్షేపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement