చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు
ఖాకీల వల్లే నా బిడ్డ బలవన్మరణం
నేను ఎవరి ప్రలోభాలకు లొంగలేదు.. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా
క్రాంతికుమార్ తండ్రి, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘‘పోలీసులే భక్షకులవుతున్నారు. నా బిడ్డ బలవన్మరణానికి కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులే కారణం’’ అని పేరుపోగు క్రాంతికుమార్ తండ్రి, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు విమర్శించారు. క్రాంతికుమార్ మరణానికి కారణమైన సీఐ నాగరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో పేరుపోగు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
‘‘నేనొక సామాజిక ఉద్యమకారుడిని. సామాజిక సమస్యలపై అనేక పోరాటాలు చేశాను. ప్రజల హక్కులు, దళిత హక్కుల కోసం పోరాడాను. నా బిడ్డకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. గత నెల 21న ఉదయం 10.30 గంటల సమయంలో కృష్ణలంక పోలీసులు నా కుమారుడి ఇంటికి వచ్చారు. సీఐ రమ్మంటున్నారు. పోలీసు స్టేషన్‌కు రావాలని పిలిచారు. నా బిడ్డ భయపడి రానని చెప్పాడు. ‘‘సీఐ నన్ను చంపేస్తాడు’’ అని పోలీసులతో అన్నాడు. ‘‘నువ్వు వచ్చినా.. రాకపోయినా జరిగేది అదే’’ అని పోలీసులు బెదిరించారు.
పోలీసులు పక్క ఇంట్లో ఉన్న నా భార్య వద్దకు వెళ్లి మీ అబ్బాయిని బయటకు రమ్మని చెప్పండని కోరారు. నా భార్య అక్కడికి వెళ్లి కొడుకును బయటకు రమ్మని చెప్పగా .. ‘‘వద్దమ్మ నేను బయటకు వస్తే చంపేస్తారు’’ అని భయపడుతూ నా కొడుకు చెప్పాడు. తర్వాత పోలీసులు వెళ్లిపోయారు. అనంతరం 11 గంటల సమయంలో నా కొడుకు గుళికల మందు తాగాడు. వెంటనే అక్కడే ఉన్న నా భార్య తలుపులు తీయాలని కోరగా తలుపులు తీశాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ వెంటనే హెల్ప్ హాస్పిటల్‌కు తరలించాం. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాం.
అదే రోజు రాత్రి హాస్పిటల్‌లో మరణించాడు. ఆత్మహత్య చేసుకున్నాడేమోనని తొలుత అనుకున్నాం. కానీ అతని ఫోన్ వెతకగా సెల్ఫీ వీడియో బయటపడింది. దీనిపై సీపీకి ఫిర్యాదు చేశాం. దీంతో సీపీ వారం గడువు కావాలని కోరారు. ఆ తర్వాత పోలీసులు రాయబారానికి వచ్చారు. నేను నా కొడుకు మరణంపై ప్రైవేటు కేసు వేయడానికి సిద్ధమయ్యా.’’ అని వెంకటేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు.
మా అబ్బాయి ఒక్కడే కాదు...
పోలీసుల మీద నమ్మకం కోల్పోయానని పేరుపోగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ‘‘మా అబ్బాయి ఒక్కడే కాదు. అతని కంటే ముందే సాయికృష్ణ అనే అతన్ని కూడా పోలీసులే గోళ్లు పీకి లాకప్ డెత్ చేసిన విషయం బయట పడింది. దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో నేను ప్రైవేటు కేసు వేసేందుకు సిద్ధమై లాయర్లను కలుసుకున్నా. ఈ క్రమంలో గురువారం నా కుమారుడు వీడియో బయటకు వచ్చింది. నేనైతే వీడియో బయటికి పంపలేదు. కానీ క్రాంతి చనిపోయే ముందు తన స్నేహితులకు ఆ వీడియో పంపాడు. వారి ద్వారా బయటకు వచ్చింది. నా కొడుకు రౌడీషీటరే. కాదనను. సాయికృష్ణ, నా బిడ్డ క్రాంతికుమార్ వీరికంటే ముందు ఇంకా అనేక మంది సీఐ వేధింపుల బారిన పడ్డారు.’ అని వెంకటేశ్వరరావు మండిపడ్డారు.
స్వప్రయోజనాల కోసం ఇన్‌ఫార్మర్లుగా మారుస్తున్నారు
‘‘పోలీసులే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నేర చరిత్ర ఉన్న వారిని ఇన్‌ఫార్మర్లుగా మార్చుకొని పోలీసులు తమ వ్యక్తిగత స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. పోలీసులు చెప్పినట్లు చేయకుంటే వారం వారం స్టేషన్‌కు రావడం లేదన్న పేరుతో కొట్టి వేధిస్తున్నారన్నారు. నా బిడ్డ ఇవన్నీ నాకు చెప్పుకోలేక పోయాడు. ఒకటి రెండు సందర్భాల్లో నా దృష్టికి తీసుకొచ్చాడు. ప్రతిసారీ పోలీసులు ఇంటికి రావడం వల్ల నా బిడ్డ భయపడిపోయాడు. సెల్ఫీ వీడియోలోనూ నేను ఎస్సీ మాదిగగా పుట్టడమే తప్పా అంటూ ఆవేదన చెందాడు. సీఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి. అతడిని తక్షణమే అరెస్టుచేయాలి. కఠినంగా శిక్షించాలి’’ అని వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నా బిడ్డలా ఎవరూ బలి కాకూడదు
‘‘నా బిడ్డ ఆత్మహత్యపై నేను వెంటనే ఏమీ మాట్లాడలేదు. అంత్యక్రియలు, ఆ తర్వాత కార్యక్రమాలన్నీ అయ్యాక స్పందించాలనుకున్నా. దీంతో నేను ప్రలోభాలకు లొంగిపోయానని వార్తలు వచ్చాయి. నేనెవ్వరికి లొంగిపోలేదు. నా బిడ్డ మరణంపై న్యాయ పోరాటం చేస్తా. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి కూడా స్పందించాలి. నేను కోరుతున్నది ఒక్కటే . ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలి. నా బిడ్డలా ఏ వ్యక్తి బలికాకూడదు.’’ అని పేరుపోగు వెంకటేశ్వరరావు కన్నీరుమున్నీరయ్యారు.


