విజయవాడ, సాక్షి: మరో రెండు రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, కేంద్ర కేబినెట్‌లో బెర్తుల కోసం ఢిల్లీ పర్యటనతో బిజిబిజీగా గడిపిన చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ కూర్పు కోసం కసరత్తులు ముమ్మరం చేయబోతున్నారు. టీడీపీతో పాటు మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు ఏయే శాఖలు కట్టబెట్టాలో అనేదానిపై ఆ పార్టీల నేతలతో ఇవాళ్టి నుంచే మంతనాలు కొనసాగించే ఛాన్స్ కనిపిస్తోంది.
అయితే.. ప్రధాన మిత్రపక్షం జనసేన నాలుగు మంత్రి పదవులకు తగ్గకూడదనే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు.. డిప్యూటీ సీఎం పోస్ట్ కోసం పవన్‌కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారంటూ తాజాగా ఓ జాతీయ మీడియా వెబ్‌సైట్ కథనం ఇచ్చింది. ఆదివారం మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకారానికి భార్యతో సహా వెళ్లిన పవన్ ఈ మాట అన్నారని సదరు వెబ్‌సైట్ ప్రచురించగా.. దానిని బాబు అనుకూల మీడియా సైతం తాజాగా ధృవీకరించడం విశేషం.
డిప్యూటీ సీఎం పదవితో పాటు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలన్నది పవన్ ప్రధాన డిమాండ్‌గా తెలుస్తోంది. జనసేన కోటాలో సీనియర్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. నాదెండ్ల మనోహర్, పులవర్తి అంజిబాబు, మండలి బుద్ధ ప్రసాద్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, అరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, వర ప్రసాద్ లు మంత్రి పదవుల రేసులో ప్రధానంగా ఉన్నారు. మరోవైపు.. చిరు, నాగబాబులతో పవన్‌కు సిఫార్సులు వెళ్తున్నాయనే ప్రచారం ఒకటి నడుస్తోంది. ఈ ఊహాగానాల లెక్కన జనసేనలో పవన్‌తో పాటు ముగ్గురికి మంత్రులుగా అవకాశం దక్కనుందన్నమాట.
మరోవైపు.. కొత్త మంత్రి వర్గంలో చోటు కోసం బీజేపీ సైతం కొన్ని షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం టీడీపీకి రెండు కేబినెట్ పోస్టులు ఇచ్చింది బీజేపీ. అలాగే.. ఇక్కడా అదే ఫార్ములా పాటించాలని టీడీపీ అధినేతను కోరినట్లు సమాచారం. దీంతో బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.
బీజేపీ తరఫున బీసీ కోటాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌కు ఆ అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఇక మరో మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ తప్పదనే చర్చ మొదలైంది. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లలో ఎవరికో ఒక్కరికే ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు.. పార్థసారథి(ఆదోని), ఆదినారాయణ రెడ్డి(జమ్మలమడుగు)లు సైతం ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక చంద్రబాబు టీడీపీ కోటాలోనూ పేర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సీనియర్లను అసంతృప్తిపర్చకుండా కేబినెట్‌ను రూపకల్పన చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment