అలో... ఒరే బీమా.. యినిపిత్తందా.. నేన్రా ఎంకటేశులు మామను. మీయమ్మ దెగ్గిర నంబరు తీసుకుని కొట్టాన్రా.. మీ అయ్య అంజిగాడు ఎలచ్చన్లలో పోటీ సేత్తాడట.. ఓరయ్యా నువ్వే వచ్చి సెప్పాల్రా ఆడికి.. అంటూ ఎంకటేశు నోకియా ఫోన్ పగిలిపోయేలా చెప్పిన మాటలకు మరునాడే భీముడు ఊళ్లో దిగిపోయాడు.. ఆ ఊళ్లో ఎప్పుడూ ఏకగ్రీవమే.. ఇప్పుడు సర్పంచ్ పదవికి ఒకరు పోటీ చేస్తున్నారని తెలియడం.. అది కూడా తన తండ్రేనని అర్థం కావడం భీముడి రాకకు కారణం.
భీముడు ఇంటికి వచ్చేటప్పటికి ఆంజనేయులుగా మారిపోయిన అంజి తరమాను చారు, కర్రపెండలం కూరేసుకుని కుమ్ముతున్నాడు.. ఒంటిపై ఖద్దరు చొక్కా జిగేల్మంటోంది.. సంతకం రాదు గానీ జేబులో ఖరీదైన పెన్నొకటి కనిపిస్తోంది.. అది చూడగానే అర్థమైపోయింది భీముడికి ఈ అగాయిత్యపు ఆలోచన తన తండ్రిది కాదని.. కొడుకు, బామ్మర్ది కలిసి అంజిగాడి ఎదురుగా బాసింపట్టేసుక్కూర్చున్నారు.. భార్య పాపమ్మ మాత్రం పెద్ద హీరోల సినిమాల్లో పని మనిషిలా వంట గది దాటి బయటకు రాలేదు.. మాటలు మొదలయ్యాయి.. మామా అల్లుళ్లను చూడగానే అంజి చాలాసేపటికి మైకు దొరికిన యాంకర్లా మొదలెట్టేశాడు..
అంజి : ఒరే.. మీరొందుకొచ్చారో నాకు తెలుసున్రా. మామా అల్లుల్లు కలిపి ఉరెట్టుకున్నా.. నేను దిగుతానంటే... దిగుతానంతే..
భీముడు: అదికాదయ్యా.. ఊరంతా ఎప్పుడూ ఒకే మాట కదా.. నువ్వే ఇలాగ సేత్తే ఎలాగ..
ఎంక: బావా.. మొన్నటి వరకు బాగున్నావు కదా.. యిప్పుడెందుకీ ఉతపాతం ఆలోసనొచ్చింది నీకు.
అంజి : మీకు సమాదానం సెప్పడమేట్రా.. నేను దిగి తీరుతానంతే..
భీముడు: మాసం కిందట నాతో ఫోన్‌తో మాట్లాడినప్పుడు.. నువ్వీ ఊసే ఎత్తనేదు.. యిప్పుడేటైంది..
ఎంక: మాసం కిందటంతావేట్రా.. పది రోజులు ముందు బావా నేను గొప్పులు తవ్వడానికెల్లినప్పుడు.. ఎలచ్చన్లొత్తన్నాయి బావా.. అంటే యిప్పుడెందుకొత్తన్నాయి.. అన్నాడు. ఇంతలోపే ఏటైపోనాదో..
అంజి : అన్నాన్రా.. ఇంకో వంద అంటాన్రా.. నా ఇట్టంరా. ఏమిరా నేను సర్పంచ్ కాకూడదా.. అంజి గాడిగానే ఉండిపోవాలా.. ఆంజనేయులు గారూ అనిపించుకోకూడదా..
ఎంక : అబ్బా.. సర్పంచ్ అవుతావా.. ఏది ఈ కాగితం మీద సర్పంచ్ అని రాసి సూపించు. తర్వాత పెసిడెంటు అవుదువు గానీ..
అంజి : నా రాతే మారిపోతుంతే.. ఇంకా రాయడమెందుకు రా..
భీముడు: రాత మారిపోవడమేటి.. ఏటి మాటాడతన్నావు.. అసలు ఈ మాటలు నీవి కావే..
అంజి : కన్న తండ్రి బాగుపడుతుంతే సూడలేని కొడుకుని నిన్నే సూత్తన్నాన్రా దొంగ నా ...
భీముడు: నీ బాగు తర్వాత.. ఊరి బాగు మాటేటి.. వాసన్న మంచోడు.. సదువుకున్నోడు.. అందరికీ దగ్గరైనోడు.. ఆ మనిషికి యతిరేకంగా నీవు పోటీకి దిగడమేటి..
అంజి : వాసుగాడితోటి నాకేం తగువు నేదు.. పెజాసామ్యంలో ఎవుడైనా పోటీకి దిగొచ్చు.. నేను దిగుతున్నాను.. అంతే..
ఎంక: అబ్బనాయినా పెజాసామ్యమా.. బావా పెద్ద పెద్ద మాటలొత్తన్నాయి.. ఎక్కడ నేర్సావు..
అంజి : ఒకే నీకు లాగ నాకేటీ రాదనుకున్నావేట్రా.. నీకు మీయప్పకు ఉప్పెంతయ్యాల..కారమెంతయ్యాల తప్ప ఇంకేం తెలుసున్రా..
ఎంక: ఓసోస్.. మూడురోజుల కిందట మెరకీదోడితో రాత్రి నీ నేస్తరికం సూసాను బావా..ఒరే అల్లుడు ఆ మెరకీదోడి మాటలే మీ అయ్య నోటి నుంచొత్తన్నాయిరా.. యిప్పుడు గుర్తొచ్చింది నాకు..
భీముడు: అదా కదా.. అయ్యా.. మెరకీదోడి మాయలో పడ్డావా.. సెప్తానిను.. ఏకగీవమైతే ఊరికి డబ్బులొత్తాయి.. నాలుగు మంచి పనులు సేసుకోవచ్చు.. ఆ పనులు జరిగితే వాసన్నకు పేరొత్తాది కదా.. దాన్ని సెడగొట్టడానికి నిన్ను వాడుకుంతన్నారు..
అంజి : నాకన్నీ యెరుకేరా.. నేను దిగుతానంతే..
భీముడు: అయ్యా.. ఐదు సంవచ్చరాల కిందట రాజి మామ గుర్తున్నాడా నీకు.. మెరకీదోడి తోనే తిరిగేవోడు.. డబ్బాశ సూపించి, మందు పోసి ఎలచ్చన్లలో దిగాలని రెచ్చగొట్టాడు.. తర్వాత ఏమైందో తెలుసును కద నీకు.. ఊరోల మాట యినలేదని రాజి మామను అందరూ స్సీ.. అన్నారు. ఆ తర్వాత మెరకీదోడు రాజిమామను పట్టించుకున్నాడా.. లేదే.. అయ్యా.. ఇది ఆల్ల రాజకీయం. తుపాకీ మన బుజం మీద పెడతారు. తూటా ఆలు పేలుత్తారు.. పాపం ఆల్లది.. సిచ్చ మనకి..
అంజి : (అంతా అర్థమైనట్టుంది) నిజమేన్రా.. నాకూ డబ్బులిచ్చాడు..
ఎంక: బుడ్డీల సంగతి సెప్పు..
అంజి : యిచ్చాడ్లేరా.. నాలుగిత్తే మూడైపోనాయి.. ఒక్కటే ఉంది..
భీముడు: సరే అయిందేదో అయిపోనాది.. నామినేసన్ ఏత్తే ఎనక్కు తీస్కో.. ఊరు బాగుంతే మనమూ బాగుంతాం కదరయ్యా..
అంజి : ఖద్దరు చొక్కా తీసేస్తూ.. నిజమేన్రా.. ఆడి మత్తులో పడిపోనాను.. మీరిద్దరూ మత్తు దింపేనారు కదా.. నేనూ దిగిపోతాన్లే.. అంటూ ఒప్పుకునే సరికి.. తలుపు వెనకే ఉండి అంతా వింటున్న మెరకీదోడు.. మరో బకరా గాడి కోసం ఊరి మీద పడ్డాడు. – ఇచ్ఛాపురం రూరల్
సెల్ఫీ దిగితే ఓటు రద్దు
సీతంపేట: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ దిగడం ఫ్యాషనైపోయింది. ఇదే అలవాటుతో పొరపాటుగా పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగితే వేసిన ఓటు చెల్లకుండా పోతుంది. ఎన్నికల సంఘం ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 49(ఎం) మేరకు ఓటు రహస్యాన్ని బహిర్గతం చేయరాదు. దీన్ని అతిక్రమించి ఓటు వేస్తూ సెల్ఫీ దిగి ఇతరులకు షేర్ చేస్తే ఎన్నికల సంఘం ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17(ఎ) మేరకు ఆ ఓటును రద్దు చేస్తారు.
నోటా ఉందండోయ్..
ఎల్.ఎన్.పేట: ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే క్రమంలో పోటీలో నిలిచిన వ్యక్తులు ఓటర్లకు నచ్చకపోయినా, వా రిపై ఓటర్లకు పూర్తి విశ్వాసం లేకపోయినా వారికి వ్యతి రేకంగా ఓట్లు వేసేందుకు నోటా గుర్తును అమల్లోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు సార్వత్రిక (సాధారణ) ఎన్నికల్లో మాత్రమే అమలవుతున్న నోటా గుర్తు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ(స్థానిక) ఎన్నికల్లోనూ అమలు చేసేలా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు సన్నాహాలు చే స్తున్నారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన తర్వాత వచ్చే బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తుకు చోటు లభిస్తుంది. నోటా గుర్తు బ్యాలెట్ పేపర్లలో కిందన ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థుల మెజార్టీ చాలా తక్కువగా ఉంటుంది. వార్డుల్లోను పోటీ పడుతున్న వ్యక్తులకు కొన్ని చోట్ల 200 కంటే తక్కువ ఓట్లే ఉంటాయి. ఈ క్రమంలో నోటాకు పడే ఓట్లు అభ్యర్థుల విజయావకాశాలపై అధిక ప్రభావం చూపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment