దావోస్‌లో సీఎం చంద్రబాబు
ఈవీ వాహనాల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు
ఏ దేశమెళ్లినా ఏపీ పారిశ్రామికవేత్తలే ఉంటున్నారు
భారత సేంద్రియ వ్యవసాయం ప్రపంచానికి వరం.. పేదరికం, అసమానతలను రూపుమాపాలి
ఇందుకు కార్పొరేట్ సంస్థలు బాధ్యత తీసుకోవాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు గ్లోబల్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇంధన సంస్కరణలు కూడా సుస్థిర అభివృద్ధికి ఒక ఉదాహరణ అని తెలిపారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా రెండవ రోజు మంగళవారం సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై ఆయన ప్రసంగించారు.
1999లో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో సాహసోపేతమైన విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయం సాధించానని చెప్పుకొచ్చారు. నాడు దేశం తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కోవడంతో పరిశ్రమలు మూసి వేయాల్సి వచ్చిందన్నారు. సుస్థిర లక్ష్యాలను సాధించేందుకు మిషన్ మూడ్ విధానంతో ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చాలనేది తన ఉద్దేశం అని చెప్పారు.
2030 నాటికి 500 మెగావాట్లు పునరుత్పాదక విద్యుత్‌ను, 500 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఇంధన రంగంలో 115 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను ఆకర్షించామన్నారు. భారతదేశ పునరుత్పాదక ఇంధన ఆశయాలను వేగంగా సాధించేలా జాయింట్ వెంచర్‌గా నెలకొల్పుతున్న 21 బిలియన్ డాలర్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ఇటీవల ప్రధాన మంత్రి విశాఖపట్నంలో శంకుస్థాపన చేశారని చెప్పారు.
ఏపీలో అదనంగా బయో ఫ్యూయల్ రంగంలో రిలయన్స్ రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోందని అన్నారు. కాస్ట్ ఆప్టిమైజేషన్, పర్యావరణ సమతుల్యతపై దృష్టి పెట్టి గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్, ఫ్యూయల్ మార్కెట్లకు ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా చేస్తున్నామని, కాకినాడ వంటి పటిష్ట ఓడరేవుల ద్వారా ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తమ విధానమని, పారిశ్రామిక వేత్తలకు, ఇంధన వ్యయాలను మరింత తగ్గించేలా నిరంతర పరిశోధనలు, అభివృద్ధికి తమ మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలనే విద్యుత్ ఉత్పత్తిదారులుగా చేసేలా రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి నెట్ జీరో లక్ష్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఏ దేశమెళ్లినా ఏపీ పారిశ్రామిక వేత్తలే ఉంటున్నారన్నారు. మానవ వనరుల లభ్యత ఏపీకి ప్లస్ పాయింట్ అని, భారతీయ పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహద పడుతున్నారని చెప్పారు.
2028 నుంచి భారత యుగం ప్రారంభమవుతుందని చెప్పారు. భారతదేశం అందించిన సేంద్రియ వ్యవసాయం ప్రపంచ సమాజానికి ఒక వరం అని చెప్పారు. పీ4 మోడల్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యాన్ని ఇటు పాలనలోనూ తీసుకువచ్చామని చెప్పారు. హరిత పారిశ్రామికీకరణ, డీప్టెక్ ఇన్నోవేషన్, సమ్మిళిత నాయకత్వంపై దృష్టి సారించామని చెప్పారు. పేదరికం, సమాజంలో అసమానతలను రూపు మాపడానికి కార్పొరేట్ సంస్థలు బాధ్యత తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment