AP: Global Investors Summit 2023, Grand Arrangements in Vizag - Sakshi
Sakshi News home page

గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు.. కేంద్రమంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లు

Published Thu, Mar 2 2023 3:11 PM | Last Updated on Thu, Mar 2 2023 4:04 PM

AP Vizag Global Investors Summit 2023 Grand Arrangements - Sakshi

విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి వచ్చే అతిథులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీవీఐపీలు, వీఐపీల కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లలో దాదాపు 800 గదులని సిద్దం చేశారు. జీఐఎస్ కి వచ్చే దేశ విదేశీ ప్రతినిధులు సంఖ్య పెరుగుతుండగా వాహనాలు, వసతులకు డిమాండ్ ఏర్పడింది.

సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఏపీలో సుధీర్ఘమైన తీరప్రాంతం, విస్తృతమైన వనరులు దేశంలో ఎక్కడా లేని విధంగా 70శాతం మానవ వనరులు, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్‍కి 35 మంది టాప్ ఇండస్ట్రీయలిస్టులు... 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్‌లు తరలిరానున్నారు. 

రెండు రోజుల సమ్మిట్ కోసం‌ఇప్పటికే 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే స్పందన ఏ స్ధాయిలో ఉందో అర్ధం‌చేసుకోవచ్చు. దీంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన వసతి, రవాణా సౌకర్యాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమ్మిట్‌లో పాల్గొవడానికి అంబానీ, అదానీ, మిట్టల్, బజాజ్, ఆదిత్య బిర్లా, జీఎంఆర్ తదితర పారిశ్రామిక దిగ్గజాలు 16 ప్రత్యేక విమానాల్లో విశాఖ వస్తున్నారు. అలాగే కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి తదితరులు  వస్తున్నారు.

కేంద్ర మంత్రులని ఎయిర్ పోర్టు నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌  తీసుకుని రావడం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. అలాగే ముఖేష్ అంబానీ, నవీన్ జిందాల్, మిట్టల్,అదానీ వంటి పారిశ్రామిక వేత్తలను దృష్టిలో ఉంచుకొని ఖరీదైన లగ్జరీ కార్లను రప్పిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తల కోసం దాదాపు 30కి పైగా బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన వాహనాలను  అధికారులు సిద్దం చేశారు. అలాగే 25 దేశాలకి చెందిన‌ సుమారు 50 మంది విదేశీ ప్రతినిధులు, హై కమిషనర్ల కోసం కూడా లగ్జరీ కార్లు రెంట్‌కు తీసుకుంటున్నారు. మొత్తంగా దాదాపు 800 మందికి పైగా విఐపీలు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 800 వాహనాలని విశాఖ జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి వచ్చే వీవీఐపీలకి ప్రొటోకాల్ ప్రకారం భధ్రత కల్పించడంతో పాటు ఎటువంటి అసౌకర్యం‌ కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు.

విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు రోజుల పాటే జరగనున్నప్పటికీ నగరంలోని అన్ని ప్రముఖ‌ హోటళ్లలో గదులు 6వ తేదీ వరకు ఫుల్ అయ్యాయి. జీఐఎస్ సదస్సుకి వచ్చే వీవీఐపీలు, వీఐపీల కోసం దాదాపు 800 పైగా గదులని అధికారులు సిద్దం చేశారు. కేంద్ర మంత్రులు పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ ప్రతినిధులు, డిప్యూటీ హైకమిషనర్లకి రాడిసన్ , నోవాటెల్, పార్క్ లాంటి స్టార్ హోటళ్లలో గదులు సిద్దం చేశారు. ఈ సమ్మిట్‌కి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు వస్తుండగా దీనికి బందోబస్తు‌ కోసం దాదాపు ఆరేడు వేల మంది పోలీసులు వస్తుండటంతో వైజాగ్ లో హోటళ్లు మొత్తం ఫుల్ అయిపోయాయి. స్టార్ రేటింగ్స్ ఉన్న హోటళ్లలో సుమారు 1500 రూములు బుక్కయ్యాయి. 

ఇక వచ్చే అతిథలకి లోటుపాట్లు రాకుండా జిల్లా యంత్రాంగం 12 బృందాలని నియమించింది. విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి వారిని హోటల్స్‌కి చేర్చడం, అక్కడ నుంచి సమ్మిట్ జరిగే ప్రాంతానికి చేరవేయడం...తిరిగి ఎయిర్ పోర్టుకి తీసుకెళ్లే వరకు పలు విభాగాల ఉద్యోగులకి బాధ్యతలు అప్పగించారు. విశాఖ ఎయిర్ పోర్టులో, హోటళ్ల వద్ద, సమ్మిట్ వద్ద కూడా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు.  మరోవైపు సమ్మిట్ కోసం వచ్చే ప్రతినిధుల సంఖ్య అంచనాలకు మించి పోతోందని రిజిస్ట్రేషన్లను బట్టి అర్థం అవుతోంది. దీంతో వచ్చే అతిథులకు రవాణా, వసతి సౌకార్యాల్లో ఎటువంటి లోపం రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకి ఆదేశాలిచ్చింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: సీఎం జగన్‌ ఇంటర్వ్యూ: వనరులు పుష్కలం.. అవకాశాలు అపారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement