
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ మంగళవారం విచారణకు రానుంది. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారించనుంది. రిట్ పిటిషన్‌లో సింగిల్ జడ్జిగా జస్టిస్ సత్యనారాయణమూర్తి తీర్పు ఇచ్చారు కాబట్టి తన తీర్పుపై తానే విచారణ జరిపే అవకాశం ఉండదు.
అందువల్ల ఆయన ఈ అప్పీల్‌ను మరో ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉంది. ప్రభుత్వ అప్పీల్ విచారణ కోసం ప్రస్తుతం వెకేషన్ జడ్జీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ రఘునందన్‌రావులతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒకవేళ జస్టిస్ సత్యనారాయణమూర్తి ప్రభుత్వ అప్పీల్‌పై విచారణ అంత అత్యవసరం కాదని భావిస్తే విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసే అవకాశం ఉంది. 30 లక్షల మంది లబ్ధిదారుల ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాన్ని హైకోర్టు అత్యవసరం కాదని భావిస్తుందా? అనేదానిపై మంగళవారం స్పష్టత రానుంది.
వాస్తవానికి ప్రభుత్వం.. తీర్పు వచ్చిన మరుసటి రోజే అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ జరిపేందుకు సీజే అరూప్‌కుమార్ గోస్వామి సానుకూలంగా స్పందించారు. అయితే ఆయనకు బదిలీ ఉత్తర్వులు రావడంతో ప్రభుత్వ అప్పీల్‌ను పక్కన పెట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం తన ప్రయత్నాలను విడిచిపెట్టలేదు. సోమవారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. వ్యాజ్యంపై విచారణ జరపాల్సిన అత్యవసరాన్ని, ఆవశ్యకతను ప్రభుత్వం అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ద్వారా రిజిస్ట్రీకి వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment