సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)ల ద్వారా ఆక్వా రైతులు, మత్స్యకారులకు మరింత మేలు చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడేళ్లలో 19,059 కేసీసీ కార్డుదారులకు రూ.2,673 కోట్ల రుణ పరపతిని ప్రభుత్వం కల్పించింది. మరింత ఎక్కువ మందికి కేసీసీలను జారీ చేయడం ద్వారా వారికి రుణ సాయం, బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.
ఈ మేరకు కేసీసీల జారీ, రుణపరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత కేసీసీ అప్లికేషన్(ఆటోమేషన్)ను రూపొందించింది. జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు కేసీసీల జారీ, రుణాల మంజూరు వివరాలను ఆర్బీకేల్లోని మత్స్య సహాయకుల ద్వారా అప్లోడ్ చేస్తున్నారు.
కేసీసీ పొందాలంటే...
కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం మత్స్యకారులు, ఆక్వా రైతులు స్థానిక ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగతంగానే కాకుండా జేఎల్‌జీ, మహిళా, స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడినా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీచేస్తారు. ఇందుకోసం ఆర్బీకే స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వారి సామర్థ్యాన్ని బట్టి రుణపరపతి కోసం బ్యాంకులకు సిఫార్సు చేస్తారు.
అర్హులైన కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు పాండ్స్, ట్యాంక్స్, ఓపెన్ వాటర్ బాడీస్, హేచరీలు, రేరీంగ్, ప్రొసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రుణాలు ఇస్తారు. మత్స్యకారులకు వెస్సెల్స్, బోట్స్ నిర్మాణానికి ఆర్థిక చేయూతనిస్తారు. వర్కింగ్ క్యాపిటల్ కింద మత్స్యకారులకు సీడ్, ఫీడ్, ఎరువులు, ఫ్యూయల్, విద్యుత్, కూలీ, మార్కెటింగ్ చార్జీలు, లీజ్ రెంట్‌ల చెల్లింపుల కోసం రుణాలు పొందవచ్చు. మత్స్య ఉత్పత్తులు విక్రయించేవారు కూడా తమ వ్యాపార విస్తరణకు కోసం రుణ పరపతిని పొందవచ్చు.
మత్స్యకారులకు భరోసా
ప్రతి సీజన్‌లో ఆక్వా రైతులకు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణంలో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తారు. ఆ రూ.2లక్షలపై 2%, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే మరో 3% వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించారు.
కేసీసీ పొందిన వారికి బీమా కూడా వర్తిస్తుంది. కార్డు పొందిన ప్రతీ మత్స్యకారునికి నెలకు రూ.12 ప్రీమియంతో 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారికి ప్రధానమంత్రి సురక్ష యోజన, 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి రూ.330ల ప్రీమియంతో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన బీమా వర్తింపజేస్తారు.
పెరుగుతున్న కార్డుదారులు.. రుణాలు
రాష్ట్రంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో 2,865 కేసీసీ కార్డుదారులకు రూ.688.85కోట్లు, 2020–21లో 5,114 కార్డుదారులకు రూ.711.20కోట్లు, 2021–22లో 9,112 కార్డుదారులకు రికార్డు స్థాయిలో రూ.1,205.89 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీ నాటికి 1,968 కార్డుదారులకు రూ.67.26కోట్ల రుణాలు మంజూరు చేశారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద రుణాల కోసం 46,383 కేసీసీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
రుణ సాయం... బీమా సౌకర్యం
Published Mon, Sep 19 2022 4:47 AM | Last Updated on Mon, Sep 19 2022 4:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment