సాక్షి, అమరావతి : ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు దుష్ప్రచారం చేయడంలో గోబెల్‌ను సైతం రాజగురువు రామోజీరావు మించిపోయారు. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలనే లక్ష్యంగా చేసుకుని తన విషపుత్రిక ఈనాడులో అబద్ధాలను అదేపనిగా అబద్ధాలను ప్రజలపై రుద్దేందుకు ఎల్లో మీడియా గత ఐదేళ్లుగా తెగ ప్రయాసపడుతోంది. ఇప్పుడు ఎంతో సమున్నతంగా ఉన్న ప్రభుత్వ విద్యా రంగంపై నిస్సిగ్గుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా అసత్యాలను వండివారుస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ‘దీవెనే శాపమైన వేళ..’ అంటూ విద్యాదీవెన పథకంపై తన అక్కసునంతా రంగరించి ప్రదర్శించింది.
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ఉన్నతాశయంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజును క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే ప్రస్తుత ప్రభుత్వం జమచేస్తోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే.. అమల్లోగాని, నిధుల విడుదలలో గాని, లబ్ధిపొందుతున్న విద్యార్థుల సంఖ్యలోగాని ఈ ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు నూటికి నూరుశాతం విద్యాదీవెన ద్వారా మేలు జరుగుతోంది.
అపరిమితంగా ఫీజు రీయింబర్స్‌మెంట్..
ఇక పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు ఎలాంటి పరిమితీలేదు. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందినీ చదివించవచ్చు. ఫీజు ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.3.05 లక్షల వరకూ రీయింబర్స్‌మెంట్ చేస్తోంది. గత ప్రభుత్వం ఏడాదికి ఇంజినీరింగ్ కోర్సులకు గరిష్టంగా రూ.35 వేలు, ఫార్మాకు రూ.68 వేలు మాత్రమే చెల్లించింది.
అలాగే, గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలోనే కాదు, ఎందులోనూ సంతృప్తస్థాయి అన్నమాటే లేదు. ఇక ప్రభుత్వం ఫీజులు ఇచ్చేవరకూ వేచి చూడకుండా పిల్లల తల్లులు కట్టాలంటూ కొన్ని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయంటూ ఈనాడు వక్రీకరణకు దిగింది. ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బును జమచేసిన తర్వాత వారంలోగా ఆ మొత్తాన్ని కాలేజీలకు చెల్లించాలి. మూడు వారాల్లోగా చెల్లించకుంటే కాలేజీలు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాయి.
దాంతో తదుపరి విడత ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బును నేరుగా కాలేజీ ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. దీంతో తల్లితండ్రులపై కాలేజీలు ఒత్తిడి తీసుకువచ్చే ఆస్కారమే లేదు. అలాగే, ఫీజు చెల్లించేంత వరకూ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఈనాడు చెప్పిందీ అబద్ధమే. ఇలా చేయడానికి కాలేజీలకు ఎలాంటి అధికారంలేదు.
వివక్ష లేకుండా వసతి దీవెన..
ఇదేకాక.. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం అందిస్తోంది.
గత ప్రభుత్వంలో అయితే కుల ప్రాతిపదికన, కోర్సు ప్రాతిపదికన కేవలం రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 మాత్రమే ఇచ్చేవారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలకు వార్షికాదాయాన్ని రూ.2 లక్షలు, ఇతర వర్గాలకు రూ.లక్ష పరిమితి పెడితే, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకుండా అర్హులైన అందరికీ వసతి దీవెన అమలుచేస్తోంది. వసతి దీవెన డబ్బులు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే జమచేస్తోంది.
ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం చెల్లింపు..
గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు పాలైనా, ఇవ్వాల్సిన అరకొర ఫీజులను ఇవ్వకుండా బకాయి పెట్టినా.. ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఏనాడూ రామోజీ తన ఈనాడులో ఒక్క కథనాన్ని కూడా ప్రచురించలేదు. కానీ, ఈ ప్రభుత్వం ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ఫీజులు చెల్లించడంతో పాటు, 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సైతం చెల్లించింది.
అంతేకాక.. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుచేస్తూ పేద విద్యార్థులకు అండగా నిలిచింది. పైగా దేశంలో నూరుశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుచేస్తోంది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఒక్కటే. అయినా, ఇదేమీ పట్టని రామోజీ మాత్రం ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. నిజానికి.. టీడీపీ పాలన ఐదేళ్లలో చెల్లించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి ఖర్చులు సగటున ఏడాదికి రూ.2,428 కోట్లు అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా చెల్లిస్తున్న సగటు మొత్తం రూ.4,044 కోట్లు.
గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.10,332 కోట్లు వెచ్చిస్తే.. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.15,592.87 కోట్లు ఖర్చుచేసింది. 26.98 లక్షల మందికి విద్యాదీవెన కింద రూ.11,317.11 కోట్లు.. 25.17 లక్షల మందికి వసతి దీవెన కింద మరో రూ.4,275.76 కోట్లు చెల్లించింది.
♦ 2022 అక్టోబరు–డిసెంబరు కాలానికి చెల్లించాల్సిన రూ.698.68 కోట్లను ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే చెల్లించింది.
♦ జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి రూ.702.99 కోట్లను ఈ ఏడాది మే 24న చెల్లించింది.
♦ ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికం మొత్తాన్ని ఆగస్టులో చెల్లించింది.
♦ ఇప్పుడు జూలై–సెప్టెంబరు త్రైమాసికం సొమ్ము చెల్లింపు తుపాను కారణంగా వాయిదాపడింది. ఇది ఈనెల 29న భీమవరంలో జరిగే కార్యక్రమంలో 26.98 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన, 25.17 లక్షల మందికి జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఇంత ఠంఛనుగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు చెల్లింపులు చేస్తుంటే రామోజీకి దిమ్మతిరిగిపోతోంది. దీంతో విద్యార్థులకు నష్టం జరిగిపోతోందంటూ ఈనాడు పెడబొబ్బలు పెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment